calender_icon.png 7 November, 2024 | 10:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందరి కళ్లు వీరిపైనే

07-11-2024 12:47:52 AM

  1. రాహుల్, అయ్యర్, పంత్‌పై ఫ్రాంచైజీల కన్ను
  2. భారీ ధరకు అమ్ముడయ్యే అవకాశం n వేలానికి స్టోక్స్ దూరం

ముంబై: ఈ నెల 24, 25 తేదీల్లో జరగనున్న ఐపీఎల్ మెగావేలంలో భారత స్టార్ ఆటగాళ్లు రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్‌లకు జాక్‌పాట్ తగిలే అవకాశముంది. సౌదీ అరేబియాలోని జెద్దాహ్ వేదికగా జరగనున్న వేలంలో అందరి దృష్టి వీరిపైనే నెలకొంది. గత సీజన్‌లో కేకేఆర్‌ను చాంపియన్‌గా నిలిపిన అయ్యర్‌పై ఫ్రాంచైజీలు భారీగా ఖర్చు పెట్టే అవకాశముంది. అయ్యర్‌తో పాటు సూపర్ ఫామ్‌లో ఉన్న వికెట్ కీపర్ రిషబ్ పంత్ (ఢిల్లీ మాజీ కెప్టెన్)తో పాటు లక్నో మాజీ కెప్టెన్ కేఎల్ రాహుల్ భారీ ధర పలికే అవకాశముంది.

ఈ ముగ్గురు తమ కనీస ధరను రూ. 2 కోట్లుగా నిర్ణయించారు. ఇక మెగా వేలానికి ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ దూరం కానున్నాడు. 2025 డబ్ల్యూటీసీ చాంపియన్‌షిప్ కోసం తన ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాల్సి ఉందని స్టోక్స్ ఇది వరకే తెలిపాడు. వర్క్‌లోడ్ దృశ్యా వేలానికి దూరంగా ఉండాలనే నిర్ణయానికి స్టోక్స్ వచ్చాడు. అయితే ఇదే సమయంలో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ పలికిన ఇంగ్లండ్ స్టార్ జేమ్స్ అండర్సన్  మాత్రం ఐపీఎల్‌లో తొలిసారి తన పేరును రిజిస్టర్ చేసుకున్నాడు. కనీస ధరను రూ. 1.25 కోట్లుగా నిర్ణయించాడు. 

వీరితో పాటు విదేశీ క్రికెటర్లలో అమెరికాకు చెందిన భారత సంతతి క్రికెటర్  సౌరబ్ నేత్రావల్కర్ వేలంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. కనీస ధరను రూ. 30 లక్షలుగా నిర్ణయించిన నేత్రావల్కర్ గత జూన్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. గత వేలంలో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర (రూ. 24.50 కోట్లు)కు అమ్ముడైన మిచెల్ స్టార్క్ తన కనీస ధరను రూ. 2 కోట్లుగా ప్రకటించాడు. ఇక థామస్ డ్రాకా (కనీస ధర రూ. 30 లక్షలు) వేలం బరిలో ఉన్న తొలి ఇటలీ ప్లేయర్‌గా నిలవనున్నాడు. 

204 స్లాట్స్.. పోటీలో 1574 మంది

ఈసారి మెగావేలంలో 204 స్లాట్స్ కోసం జరగనుండగా.. పది ఫ్రాంచైజీలు రూ. 641.5 కోట్లు ఖర్చు చేయనున్నాయి. మొత్తం 1574 మంది క్రికెటర్లు బరిలో ఉండగా.. ఇందులో మొత్తం 1165 మంది భారత్‌కు చెందిన క్రికెటర్లు, 409 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. రవిచంద్రన్ అశ్విన్, చాహల్, ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్, వెంకటేశ్ అయ్యర్, ఆవేశ్ ఖాన్, దీపక్ చాహర్, ఇషాన్ కిషన్, భువనేశ్వర్, శార్దూల్ , సిరాజ్, పడిక్కల్, కృనాల్ పాండ్యా, హర్షల్ పటేల్, ప్రసిధ్ కృష్ణ, నటరాజన్, సుందర్ రూ. 2 కోట్ల కనీస ధరతో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇక సర్ఫరాజ్ ఖాన్, పృథ్వీ షా తమ కనీస ధరను రూ. 75 లక్షలుగా నిర్ణయించారు.