calender_icon.png 16 March, 2025 | 8:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బేగంపేట రైల్వేస్టేషన్‌లో ఉద్యోగులందరూ మహిళలే..

16-03-2025 01:42:16 AM

  1. ప్రధాని మోదీ స్టేషన్‌ను మహిళలకు అంకితమిస్తారు..
  2. ఎయిర్‌పోర్ట్‌ను తలపించే విధంగా స్టేషన్‌ను తీర్చిదిద్దుతాం..
  3. ఓట్ల కోసమే డీలిమిటేషన్‌పై తమిళనాడు సీఎం స్టాలిన్ తప్పుడు ప్రచారం
  4. ఐదేళ్ల పాలనలో స్టాలిన్ తమిళ భాష కోసం ఏం చేశారు?
  5. కేంద్ర బొగ్గు గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్, మార్చి 15 (విజయక్రాంతి): బేగంపేట రైల్వేస్టేషన్ పరిధిలో పనిచేసే సెక్యూరిటీగార్డు నుంచి ఉన్నతాధికారి వరకు అందరూ మహిళలేనని, అందుకే ప్రధాని మోదీ స్టేషన్‌ను మహిళాలోకానికి అంకితమివ్వాలనుకుంటున్నారని కేంద్ర బొగ్గు గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన హైదరాబాద్‌లోని బేగంపేట రైల్వేస్టేషన్ పరిధిలో చేపడుతున్న ఆధునీకరణ పనులను పరిశీలించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రైల్వేస్టేషన్ పరిధిలో ప్రస్తుతం  రూ.26 కోట్లతో తొలి విడత పనులు జరుగుతున్నాయని, త్వరలో రూ.12 కోట్లతో రెండో విడత పనులు చేపడతామని స్పష్టం చేశారు. స్టేషన్‌ను ఎయిర్‌పోర్ట్‌ను తలపించే విధంగా తీర్చిదిద్దుతామని హామీఇచ్చారు.

కేంద్రం తన రైల్వే బడ్జెట్‌లో తెలంగాణకు రూ.5,337 కోట్లు కేటాయించిందని, ప్రస్తుతం రాష్ట్ర పరిధిలో రూ.39 వేల కోట్ల విలువైన ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. కవచ్ అభివృద్ధిలో సికింద్రాబాద్ దేశానికే కేంద్ర బిందువుగా నిలుస్తుందన్నారు.

సికింద్రాబాద్, హైదరాబాద్ నుంచి రైళ్లను తగ్గించి చర్లపల్లి జంక్షన్‌కు ఎక్కువ రైళ్లు కేటాయిస్తామని వివరించారు. చర్లపల్లికి అప్రోచ్ రోడ్డు నిర్మించాలని సీఎం రేవంత్‌రెడ్డిని ఎప్పటి నుంచో కోరుతున్నామని, అయినప్పటికీ సీఎం నుంచి స్పందన లేదని దుయ్యబట్టారు.

డీలిమిటేషన్‌తో లోక్‌సభ సీట్లు తగ్గవు

డీలిమిటేషన్‌తో లోక్‌సభ సీట్లు తగ్గుతాయని తమిళనాడు సీఎం స్టాలిన్  తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేంద్ర మంత్రి మండిపడ్డారు. సీట్లు ఏ మాత్రం తగ్గవని ఆయన స్పష్టం చేశారు. స్టాలిన్ హిందీ అనే అంశాన్ని లేవనెత్తుకుని దక్షిణాది ప్రజలను రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు. తమిళనాడు ఎన్నిక లు సమీపిస్తున్నందున స్టాలిన్ ఓటు రాజకీయాలకు తెరతీశారని దుయ్యబట్టారు. 

ఐదే ళ్లు తమిళ ప్రజల కోసం ఏమీ చేయని స్టాలి న్, ఇప్పుడు ప్రజలను రెచ్చగొట్టే పనిపెట్టుకున్నారని ఆరోపించారు. స్టాలిన్ తమిళభాష కోసం ఏం చర్యలు తీసుకున్నారని ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రం ఎవరిపైనా హిందీని బలవంతంగా రుద్దబోదని స్పష్టం చేశారు.