calender_icon.png 4 March, 2025 | 1:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలి

03-03-2025 07:45:29 PM

ప్రభుత్వాసుపత్రిలో డెలివరీల సంఖ్య పెంచాలి..

వైద్యులు సమయపాలన పాటించాలి..

ఆసుపత్రులలో మందులు లేవంటే ఫార్మసిస్ట్ లదే భాద్యత..

జిల్లా స్థాయి ఆసుపత్రుల ప్రగతిపై సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్..

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ కల్పించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో జిల్లా వైద్య విధాన పరిషత్ శాఖ వారి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధ్యక్షతన జిల్లాలోని ఆసుపత్రుల ప్రగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలలో ఔట్ పేషెంట్, ఇన్ పేషెంట్, స్కానింగ్, రక్త పరీక్షలు, సర్జరీలు డయాలసిస్, డెలివరీలపై ఆస్పత్రులు వారీగా ప్రగతిపై ఆసుపత్రుల సూపర్డెంట్ లను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని ఆసుపత్రులలో పారిశుధ్యం కొరకు అధునాతన యంత్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అన్ని ఆసుపత్రులలో ఈఎన్టీ వైద్యం కోసం కావలసిన యంత్ర పరికరాలకు సంబంధించి నివేదికలు అందించాలన్నారు. గత సంవత్సరం అనుభవాలను దృష్టిలో ఉంచుకొని వర్షాకాలంలో ఆసుపత్రుల్లో ఎక్కడైనా లీకేజీ, త్రాగునీటి సమస్య వంటి వాటిని గుర్తించి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఆస్పత్రిలో అవసరమైన వైద్యులు, సిబ్బందిని నియామకానికి తగిన చర్యలు చేపట్టాలని అన్నారు. జిల్లాలోని ఆసుపత్రిలో అభివృద్ధి కొరకు సింగరేణి, ఐటిసి, కేటీపీఎస్, నవభారత్ వంటి పరిశ్రమలు ముందుకొస్తున్నాయని, దానికి తగిన విధంగా సరైన ప్రణాళికలు రూపొందించాలని సూపర్డెంట్ లను ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించి, ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలన్నారు. సిబ్బంది హాజరుపై ఆకస్మిక తనిఖీలు చేపడతామన్నారు.

నర్సింగ్ సూపర్డెంట్లు ప్రజల అవసరాలకు తగ్గట్టుగా సిబ్బందికి డ్యూటీలు వేయాలని అన్నారు. ఆసుపత్రులలో సరిపడా మందులు లేవంటే ఆసుపత్రి ఫార్మసిస్టులదే బాధ్యత అని అన్నారు. అవసరమైన మందులకు ఎప్పటికప్పుడు ఇండెంట్లు పంపించాలని సూచించారు. ఇండెంట్లు పెట్టిన మందులు రాకపోతే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం పెంచి డెలివరీ ప్రభుత్వ ఆసుపత్రులలోనే జరిగేలా చర్యలు చేపట్టాలి. ప్రభుత్వ ఆసుపత్రి కివచ్చే పేద రోగులకు అందించే వైద్య సేవలలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సందర్బంగా అన్ని విభాగలలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిని కలెక్టర్ అభినందించారు. ఈ సమావేశంలో డిసిహెచ్ఓ రవిబాబు, జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల సూపడెంట్ లు, సిబ్బంది పాల్గొన్నారు.