04-03-2025 07:24:52 PM
ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అభిమన్య..
భద్రాచలం (విజయక్రాంతి): జిల్లాలో బుధవారం నుండి ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి అభిమన్యు డిమాండ్ చేశారు. భద్రాచలం పట్టణంలో ఎస్ఎఫ్ఐ ముఖ్య కార్యకర్తల సమావేశం మంగళవారం నిర్వహించగా అందులో పాల్గొని మాట్లాడుతూ... ఎండలు విపరీతంగా ఉండడంతో విద్యార్థులు పరీక్ష హాల్లో అసౌకర్యానికి గురవుతారని, అందుకు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఫ్యాన్లు ట్యూబ్ లైట్లు, తాగడానికి మంచినీరు ప్రతి గదిలో ఏర్పాటు చేయాలని, నిబంధనల పేరుతో విద్యార్థులను ఇబ్బందుల గురిచేయ వద్దని, అలాగే వారికి మరుగుదొడ్లు కూడా శుభ్రంగా ఉంచే విధంగా చూడాలని కోరారు.
అలాగే విధుల నిర్వహిస్తున్న సిబ్బందికి సైతం అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు, అలాగే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు వెళ్లే సందర్భంలో అన్ని రకాల ప్రజలు వాహనదారులు కూడా సహాయ సహకారాలు అందించాలని, ఆర్టీసీ బస్సులు సైతం విద్యార్థుల పరీక్షల సమయానికి అనుగుణంగా నడపాలని, ప్రైవేటు యాజమాన్యాలను కూడా విద్యార్థులను పరీక్షలకు దూరం చేసే పద్ధతులకు భిన్నంగా వ్యవహరించాలని, హాల్ టికెట్లను అందరికీ అందించాలని, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలిగిన విద్యార్థులు ఒక్కరిలో ఎవరైనా పరీక్ష రాయడానికి ఇబ్బందులకు పడ్డ ఎస్ఎఫ్ఐ తరఫున పరీక్షా కేంద్రం వద్దనే ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. విద్యార్థులు ఉన్నత భవిష్యత్తుకు బాటలు వేసుకునే విధంగా ఈ పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలని ఎస్ఎఫ్ఐ కోరుకుంటుందని అన్నారు. సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు నాగకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు రవీంద్ర, సాయి, కిరణ్, సుమన్, చందు తదితరులు పాల్గొన్నారు.