calender_icon.png 1 April, 2025 | 8:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సరస్వతీ పుష్కరాలకు సకల ఏర్పాట్లు..

27-03-2025 08:29:51 PM

కలెక్టర్ రాహుల్ శర్మ వెల్లడి..

జిల్లా స్థాయిలో టాస్క్ ఫోర్స్ కమిటీ..

టూరిజం ఆధ్వర్యంలో టెంట్ సిటీ..

కాటారం/భూపాలపల్లి (విజయక్రాంతి): దక్షిణ కాశీగా పేరుగాంచిన కాలేశ్వరం ముక్తేశ్వర స్వామి దేవస్థానం సన్నిధిలో జరగబోయే సరస్వతీ పుష్కరాల ఏర్పాట్లకు సకల సదుపాయాలు కల్పిస్తున్నామని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ వెల్లడించారు. గురువారం సరస్వతి పుష్కరాల ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో ఐడిఓసి కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... నిర్ణీత సమయానికి పుష్కరాల పనులను పూర్తి చేయడం కోసం డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కమిటీ ద్వారా ప్రతి వారం జరుగుతున్న పుష్కరాల పనులను పర్యవేక్షించాలని తెలిపారు.

ఇరిగేషన్ అధికారులు విఐపి పుష్కర ఘాట్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. పుష్కర ఘాట్ లో స్నానఘట్టాలు, బట్టలు మార్చుకునే గదులు, చలువ పందిళ్ళ ఏర్పాటుతో పాటు గోదావరి తీరంలో తాత్కాలిక రోడ్డు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. పంచాయితీ రాజ్ శాఖ ద్వారా నిర్మాణం చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని స్పష్టం చేశారు. మిషన్ భగీరథ ద్వారా మంచినీటి ట్యాంకు నిర్మాణం పైపులైను ఏర్పాటు, పార్కింగ్ స్థలాల వద్ద నీటి సౌకర్యం, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. టూరిజం శాఖ ద్వారా టెంట్ సిటీ ఏర్పాటు చేయనున్నందున వివిధ పరిశ్రమల టెంట్ సిటీ ఏర్పాటుకు స్థల సేకరణ చేపట్టాలని తెలిపారు.

దేవాదాయ శాఖ ద్వారా చేపట్టిన పనులను ఏప్రిల్ నెలాఖరు వరకు పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యుత్ శాఖ ట్రాన్స్ఫార్మర్ ల ఏర్పాటు, కరెంట్ పోల్స్ మార్చుట, ఏర్పాటు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. పంచాయితీ శాఖ ద్వారా పారిశుద్ధ్య పనులు చేపట్టాలని అదనపు సిబ్బందిని నియమించాలని తెలిపారు. తాత్కాలిక ఆర్.టి.సి బస్టాండ్ నిర్మాణ పనులు చేపట్టాలని అధికారులు తమ తమ పనుల వద్ద క్షేత్ర స్థాయిలో పర్యటించి ఏప్రిల్ 30 వరకు పూర్తి చేయాలని ఆదేశించారు. టాస్క్ ఫోర్స్ కమిటీ ద్వారా ప్రతివారం సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని ప్రతి అధికారి నిబద్దతతో జరుగుతున్న పనులు పర్యవేక్షణ చేస్తూ ఉండాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎస్పీ కిరణ్ ఖరే, సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డిపిఓ నారాయణరావు, సిపిఓ బాబా రావు, డిపో మేనేజర్ ఇందు తదితరులు పాల్గొన్నారు.