calender_icon.png 19 November, 2024 | 11:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అల్క అదుర్స్

10-06-2024 12:58:49 AM

పారిస్: సీజన్ మూడో గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్‌లో స్పెయిన్ యువకెరటం కార్లోస్ అల్కరాజ్ గార్పియా విజేతగా నిలిచాడు. నువ్వా నేనా అన్నట్లు సాగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో అల్కరాజ్ (స్పెయిన్) 6 2 5 6 6 నాలుగోసీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)పై విజయం సాధించాడు. దాదాపు నాలుగున్నర గంటల పాటు సాగిన పోరులో అల్కరాజ్.. 52 విన్నర్లు కొట్టాడు. రెండోసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ చేరిన జ్వెరెవ్ తుదికంటా పోరాడినా ఫలితం లేకపోయింది.

తొలి మూడు సెట్లలో రెండింటిని గెలుచుకున్న జ్వెరెవ్.. చివరి వరకు పట్టు కొనసాగించలేకపోయాడు. నాలుగో సెట్ లో తిరిగి పుంజుకున్న అల్కరాజ్.. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా విజృంభించి.. వరుసగా రెండు సెట్లు నెగ్గడంతో పాటు టైటిల్ ఎగరేసుకుపోయాడు. గతం లో యూఎస్ ఓపెన్ (2022), వింబుల్డన్ (2023) టైటిల్స్ నెగ్గిన అల్కరాజ్‌కు ఇది మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్ కావడం విశేషం. ఈ ప్రదర్శనతో త్వరలో విడుదల కానున్న ఏటీపీ ర్యాంకింగ్స్‌లో అల్కరాజ్ తిరిగి అగ్రస్థానానికి చేరుకోనున్నాడు. మ్యాచ్ విషయానికి వస్తే.. ఇరువురు ఆటగాళ్లు కొదమ సింహాల్లా పోరాడారు. జ్వెరెవ్ 8 ఏస్‌లు బాదితే.. అల్కరాజ్ మూడింటికే పరిమితమయ్యాడు. ఇరువురు చెరో 6 డబుల్ ఫాల్ట్స్ చేయగా.. జ్వెరెవ్ గంటకు 222 కిలోమీటర్ల వేగంతో సర్వీస్ చేసి ఆశ్చర్యపరిచాడు.