ప్రతి రంగంలో మహిళలు పురుషులకు దీటుగా విజయం సాధిస్తున్నారు. ఓకే టైంలో విభిన్న రంగాల్లో దూసుకుపోతూ ఔరా! అనిపించుకుంటున్నారు. అలాంటి కోవకు చెందిందే హైదరాబాద్‌కు చెందిన అలికా జో.. జిమ్నాస్టిక్ కోచ్‌గా తనకంటూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటి వరకు 150 మెడల్స్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. మరీ ముఖ్యంగా సౌత్ నుంచి మొట్టమొదటి రిథమిక్ జిమ్నాస్టిక్ కావడం విశేషం. ఆమె ఆలోచనలను స్ప్రింగ్‌లా మలిచి ‘జో ఇనిస్టిట్యూట్ ఆఫ్ జిమ్నాస్టిక్స్ అకాడమీ’ ద్వారా అమ్మాయిలకు ట్రెయినింగ్ ఇస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నది. ఇంతకి ఎవరీమె? జిమ్నాస్టిక్‌లో జర్నీ ఎలా మొదలైందో ఆమె మాటాల్లోనే..
నేను జిమ్నాస్టిక్, వుషూలో ఇంటర్నేషనల్ ప్లేయర్‌ని. జిమ్నాస్టిక్‌ను మూడేళ్ల వయసు నుంచి నేర్చుకున్నాను. దీంట్లో నాకు 16 సంవత్సరాల అనుభవం ఉంది. 2015లో అధికారికంగా ప్లేయర్‌గా రిటైర్డ్ అయ్యాను. మళ్లీ 2017లో జడ్జిగా (న్యాయ నిర్ణేతగా) ఎంటరయ్యాను. ఇండి యా తరపున బల్గేరియా, చైనా, ఇటీవల సింగపూర్‌లో జరిగిన బీబీసీఏ కప్‌కు న్యాయ నిర్ణేతగా వ్యవహరించాను. ఇవి నా అచీవ్‌మెంట్స్‌గా చెప్పొచ్చు. మినిస్ట్రీ ఆఫ్ యూత్ అండ్ స్పోర్ట్స్ అఫైర్స్ తరపున గుర్తింపు పొందాను. అలా ఎన్‌ఎస్‌ఎన్‌ఎస్‌ఐ (నేతాజీ సుభాష్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్) నుంచి సెంట్రల్ గవర్నమెంట్ కోచ్‌గా సర్టిఫికెట్ సాధించాను. అలాగే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి కూడా గుర్తింపు పొందాను. ఇది నా జిమ్నాస్టిక్‌కు సంబంధించింది.
వుషూ మార్షల్ ఆర్ట్స్ ప్లేయర్‌గా..
జిమ్నాస్టిక్స్‌తో పాటు వుషూ మార్షల్ ఆర్ట్స్ కూడా చేస్తున్నాను. ఇది చైనీస్‌కు సంబంధించినది. వుషూ మార్షల్ ఆర్ట్స్‌లో నేను ప్లేయర్‌గానే ఉన్నాను. వుషూలో 2018 వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో ఆడాను. వుషూ మార్షల్ ఆర్ట్స్‌లో వరల్డ్‌లోనే ఐదో ర్యాంక్‌లో నిలిచాను. తర్వాత కోవిడ్ కారణంగా రెండేళ్లు బ్రేక్ తీసుకున్నాను. అలాగే కోయంబత్తూర్-2024 జరిగినా వుషూ మార్షల్ ఆర్ట్స్‌లో గోల్డ్ మోడల్ సాధించాను. ఫిబ్రవరి-2024 జార్ఖండ్‌లోని రాంచీలో జరిగిన నేషనల్ ఫెడరేషన్స్ కాంపిటీషన్స్‌లో వుషూ మార్షల్ ఆర్ట్స్‌లో సిల్వర్ సాధించాను.
ఇదే నా ఫ్యాషన్..
దీన్నే ఎంచుకోవడానికి ప్రత్యేకంగా కారణం ఏం లేదు. మా డాడీ నన్ను మూడేళ్ల వయసులో జిమ్నాస్టిక్స్ క్లాస్‌లో చేర్పించారు. డాడీ ఏషియా గోల్డ్ మెడలిస్ట్. డాడీ స్పోర్ట్స్ పర్సన్ కాబట్టి నన్ను కూడా స్పోర్ట్స్ వైపు తీసుకొచ్చారు. అట్లా మా నాన్న, అమ్మ సపోర్టు వల్ల స్పోర్ట్స్ వైపు వచ్చాను. అలా జిమ్నాస్టిక్స్‌పై ఆసక్తి క్రమంగా పెరిగి దాన్నే ఫ్యాషన్‌గా, కెరీర్‌గా మలుచుకున్నాను. 12 ఏళ్ల వయసు నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నాను. ఏడాదికి రెండుసార్లు స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో జరిగే కాంపిటీషన్స్‌లో కచ్చితంగా పాల్గొనేదాన్ని. ఇప్పటి వరకు దాదాపు 150పైనే మెడల్స్ సాధించాను.
అవగాహన లోపం..
జిమ్నాస్టిక్స్, వుషూ మార్షల్ ఆర్ట్స్ గురించి చాలామందికి అవగాహన లేదు. దీనికి కారణం పబ్లిసిటీ లేకపోవడమో? ఈ ఫీల్డ్‌లో టాప్‌లో రాణించినవారు లేకపోవడమో? జరుగుతుంది. ఇప్పుడు చూడండి.. దీపా కర్మాకర్ ఒలింపిక్స్‌లోకి వెళ్లినందుకు ఫేమస్ అయ్యారు. దాని ద్వారా ఆమె ప్రపంచవ్యాప్తంగా తెలిసింది. క్లియర్‌గా చెప్పాలంటే.. మనం ఒలంపిక్స్‌కు పోయేంతవరకు మనల్ని ఎవరూ గుర్తు పట్టరు. ముఖ్యంగా మన సౌత్‌లో అయితే క్రికెట్ అండ్ బ్యాడ్మింటన్‌పై ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే చాలామందికి ఆ గేమ్ గురించి మాత్రమే తెలుసు. వాటితో పాటు చాలా గేమ్స్ ఉన్నాయనే విషయాన్ని మరిచిపోయారు. అలాగే మిగతా గేమ్స్‌పై అవగాహన లేకపోవడం కూడా దీనికి కారణం.
లైఫ్ టర్నింగ్ పాయింట్..
రిథమిక్ జిమ్నాస్టిక్స్ అనేది ఒక డెడికేషన్ స్టోర్ట్స్. దీన్నే ఫ్యాషన్‌గా, కెరీర్‌గా ఎంచుకున్నా వాళ్లు మాత్రమే దీంట్లో రాణించగలు గుతారు. దీని ట్రెయినింగ్ చాలా కఠినంగా ఉంటుంది. ఈ స్పోర్ట్ చూసినప్పుడు చాలా అందంగా, డ్యాన్స్ లాగా కనిపిస్తుంది. చాలా ఈజీ అనుకుంటారు. కానీ కచ్చితంగా ట్రెయినింగ్ ఉండాలి. నా 25 ఏళ్ల కెరీర్‌లో ప్రతీది నాకు సంతోషాన్నే కలిగింది. ఎందుకంటే ఇది నా ఫ్యాషన్ కాబట్టి. 2011లో నేషనల్ ఛాంపియన్‌గా గుర్తింపు పొందాను. అప్పుడే నాకు ఐదు గోల్డ్ మెడల్స్ వచ్చాయి. ఆ సమయంలో నాకు ప్రభుత్వం మెడిసిన్ సీట్ కూడా ఆఫర్ చేసింది. ఆ టైమ్‌లో నేషనల్‌లో గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థులకు స్పోర్ట్స్ కోటాలో మెడిసిన్ సీట్స్ ఫ్రీగా ఇచ్చేవాళ్లు. అప్పుడు నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఆ సమయంలో మా డాడీ ఒక్కటే మాట అన్నారు. ‘నీ లైఫ్ ఇప్పుడు టర్నింగ్ పాయింట్’ మెడిసిన్ కు వెళ్తావా? స్పోర్ట్స్‌లోనే ఉంటావా? అని అడిగారు. నాకు స్పోర్ట్సే కావాలి అని ఆ రోజు నేను నిర్ణయించుకున్నాను. దాంట్లోనే రాణించాగలిగాను. ఒకవిధంగా స్పోర్ట్స్ ద్వారానే నాకు గుర్తింపు వచ్చింది. నాకు తిండి పెట్టేది కూడా జిమ్నాస్టిక్స్ అని మాత్రం చెప్పగలను.
బాధ కలిగించే సందర్భం..
నిజానికి స్టోర్ట్స్ పర్సన్స్ చాలా సమస్యలు ఎదుర్కొంటారు. మేం నేషనల్ కాంపిటీషన్‌కు సెలక్ట్ అయితే స్పోర్ట్స్ కిట్ ఇవ్వాలి. అది మా వరకు రాదు. కేవలం మాకు ఒక టీ షర్ట్ ఇచ్చి.. జర్నల్ కోచ్‌లో టికెట్ బుక్ చేసి పంపిస్తారు. కనీసం మాకు షూ కూడా ఉండేది కాదు. మహారాష్ట్ర, ఢిల్లీ, యూపీ టీమ్ మమ్మల్ని చూసి నవ్వేవాళ్లు. అది తలుచుకుంటే ఇప్పటికీ బాధేస్తుంది. ఎవరో ఉన్నోళ్లు మాత్రమే షూ, బ్లేజర్ వేసుకునేది.. మేం పాత బట్టలతో, చెప్పులతో కాంపిటీషన్‌లో పాల్గొనే వాళ్ళం. అది చాలా సిగ్గుగా అనిపించేది. అలా ఉండకూడదని నా వైపు నుంచి నాకు తోచిన సహాయం చేసి నా విద్యార్థులను ప్రోత్సహిస్తాను. ఇది దేశ గౌరవానికి సంబంధించిన విషయం కదా. స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన నిధులను సరిగ్గా వినియోగిస్తే.. బాగుండేది. కానీ అలా జరగడం లేదు.
లైట్ ఫుడ్ తీసుకోవాలి..
ఫుడ్ డైట్ గురించి నేను ప్రత్యేకంగా ఏం చెప్పను. ఆయిల్, మసాలా ఫుడ్‌కు మాత్రం దూరంగా ఉండాలంటాను. శరీరం ఎంత సన్నగా ఉంటే అంత సునాయాసనంగా జిమ్నాస్టిక్స్ చేయొచ్చు. కండరాల మధ్య ఫ్యాట్ ఉంటే ఎముకలు విరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి రిథమిక్ జిమ్నాస్టిక్ అనేది స్లిమ్‌గా ఉన్నప్పుడు మాత్రమే చేయగలం. ఉదయం టిఫిన్ తినాలని.. మధ్యాహ్నం భోజనానికి బదులు పండ్లు తినమంటాను, సాయంత్రం పాలు, జ్యూస్ తాగమని నా విద్యార్థులకు చెబుతాను.
జో జిమ్నాస్టిక్స్ అకాడమీ..
నా ఇన్‌స్టిట్యూట్ పేరు ‘జోస్ జిమ్నాస్టిక్ అకాడమీ’. ఇది తెలంగాణ ప్రభుత్వం చేత గుర్తింపు పొందిన అకాడమీ. రిథమిక్ జిమ్నాస్టిక్స్ అమ్మాయిలు మాత్రమే ఆడే ఆట. నా అకాడమీలో ప్రస్తుతం 50 మందికి పైనే విద్యార్థులు ఉన్నారు. టోర్నమెంట్స్ ఉంటే నేను నా విద్యార్థులను తీసుకెళ్తాను. ముఖ్యంగా నేను స్టోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా గుర్తింపు చెందిన కోచ్‌ను కాబట్టి అకాడమీకి ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. స్టోర్ట్స్‌ను కెరీర్‌గా ఎంచుకున్నా విద్యార్థులను టోర్నమెంట్స్‌కు తీసుకెళ్తాను. నావైపు నుంచి ప్రత్యేకంగా వాళ్లను ప్రోత్సహిస్తాను. నా విద్యార్థుల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్లేయర్స్‌తో పాటు ఇంటర్నేషనల్ మెడలిస్ట్‌లు కూడా ఉన్నారు. ప్రభుత్వం నుంచి కొంచెం ప్రోత్సహిస్తే బాగుంటుంది.
‘ఖేలో ఇండియా’ పోటీలకు జడ్జిగా..
ఖేలో ఇండియా యూత్ పోటీలకు తెలంగాణ నుంచి జడ్జిగా వ్యవహరించాను. ఈ కేటగిరీలో దేశ వ్యాప్తంగా మొత్తం 30 మందిని ఎంపిక చేస్తే.. దక్షిణాది నుంచి నాకు మాత్రమే అవకాశం లభించింది. అది నాకు చాలా ఆనందాన్ని కలిగించిన సందర్భం. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో బెంగాల్‌లో నిర్వహించిన 15 రోజుల ప్రత్యేక శిక్షణలో పాల్గొన్నాను. దాన్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు గానూ ప్రభుత్వం సత్కరించింది. దాని కోసం దాదాపు 2000 వేల మంది అప్లు చేస్తే దాంట్లో 67 మంది ని మాత్రమే ఎంపిక చేసుకున్నారు. దాంట్లో నేను ఉండటం గర్వకారణంగా భావిస్తున్నాను.