calender_icon.png 23 September, 2024 | 1:52 PM

కబ్జా కోరల్లో అలీ చెరువు

23-09-2024 01:26:02 AM

25.07 ఎకరాల విస్తీర్ణంలో 8 ఎకరాలకు పైగా ఆక్రమణ

కోర్టు పరిధిలో వివాదం

ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 2౨: రంగారెడ్డి జిల్లా మంచాల మండలం కాగజ్‌ఘట్ పరిధిలోని అలీ చెరువు కబ్జా కోరల్లో చిక్కు కుపోయింది. చుట్టుపక్కల ప్రాంతాల రైతులకు, ప్రజలకు ఆదెరువుగా ఉన్న ఈ చెరువు రోజురోజుకూ కుచించుకుపోతోంది. భూముల విలువ పెరగడంతో రియల్ వ్యాపారులు చెరువులు, కుంటలు, కాల్వలు అనేది  లేకుండా ఇష్టారాజ్యంగా ఆక్రమిస్తున్నారు. 25.07 ఎకరాల విస్తీర్ణం కలిగిన అలీ చెరువు 8 ఎకరాలకు పైగా ఆక్రమణకు గురైనట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చెరువుకు ఆనుకొని ఉన్న ఓ రియల్ ఎస్టేట్ సంస్థ చెరలో చిక్కి తన అస్థిత్వాన్నే కోల్పోయే పరిస్థితి ఉందని వాపోతున్నారు. కాగజ్‌ఘట్ పైభాగంలోని జాపాల రిజర్వుడ్ ఫారెస్ట్, గడ్డమల్లాయగూడ, గున్‌గల్ రెవెన్యూ పరిధిలోని వరద కాల్వలు, కుంటల ద్వారా ఈ చెరువుకు వర్షం నీరు వచ్చి చేరుతుంది. గొలుసుకట్టుగా తదుపరి వరద ప్రవాహం నోముల, లింగంపల్లి, రాయపోల్ చెరువులను కలుపుకొంటూ ముందుకు వెళ్తుంది. ఎన్‌ఆర్ డెవలపర్స్ అనే సంస్థ ఏర్పాటు వేసిన వెంచర్, సీసీ రోడ్డు, చేపట్టిన భవన నిర్మాణాలు అలీ చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలోనే ఉన్నాయనే ఆరోపణలు న్నాయి. ఉన్నతాధికారులు స్పందించి కబ్జా నుంచి అలీ చెరువును కాపాడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

ప్రభుత్వ పెద్దల అండతోనే..

చెరువు పరిధిలో రిసార్ట్‌తో పాటు పెద్ద ఎత్తున విల్లాలను నిర్మిస్తున్నా ప్రభుత్వ శాఖలు తలోమాట చెబుతూ కాలయాపన చేస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. అయి తే, ముందుగా ఇక్కడ వెంచర్ కోసం ఏర్పా టు చేసిన ప్రధాన రోడ్డుపైనా వివాదం తలెత్తింది. ఈ వెంచర్‌కు ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూమిలో గత ప్రభుత్వ పెద్దల అండతో అధికార యంత్రాంగమే రోడ్డు వేసేందుకు అనుమతి పత్రాలు ఇచ్చారనే ఆరోపణలున్నాయి. 2 ఏళ్ల క్రితం ఇక్కడ జరిగిన ఓ శుభకార్యానికి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు హాజరు కావడంతో ఆగమేఘాల మీద సాగర్ ప్రధాన రహదారి ఆగపల్లి నుంచి ఇక్కడకు వచ్చే ప్రధాన రోడ్డు విస్తరణ చేపట్టి రాత్రికి రాత్రే డబుల్ రోడ్డుగా మార్చడం చర్చనీయాంశమై వివాదానికి దారితీసింది.

కోర్టు తీర్పు మేరకే..

అలీ చెరువు వివాదం తాజాగా కోర్టు మెట్లు ఎక్కినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే, ఇటీవల చెరువు ఎఫ్‌టీఎల్ కబ్జాపై స్థానిక మత్స్యకారులు ఆందోళనలు చేసి సాగునీటి శాఖ, రెవెన్యూ యంత్రాంగానికి ఫిర్యాదు చేశారు. దీంతో సదరు వెంచర్ నిర్వాహకులు స్వయంగా కోర్టును ఆశ్రయించి చెరువు శిఖం, ఎఫ్‌టీఎల్ పరిధిని నిర్ధారించాలని తదుపరి ఎఫ్‌టీఎల్‌లోకి వచ్చే తమ నిర్మాణాలను తొలగింపునకు కట్టుబడి ఉంటామంటూ విన్నవించినట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించిన కోర్టు వాస్తవ నివేదిక కోసం నీటి పారుదల శాఖను ఆదేశించిందని, సంబంధిత అధికారులు నివేదిక సమర్పించిన అనంతరమే అలీ చెరువు కబ్జాలపై తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

చర్యలు తీసుకుంటాం

కాగజ్‌ఘట్‌లోని అలీ చెరువు కబ్జా జరిగిందనే విషయం మా దృష్టికి వచ్చింది. అక్కడ నిర్మించిన భవనం చెరువు పరిధిలోనే ఉందని తేలింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం.

 శారద, ఇరిగేషన్ ఏఈ