08-02-2025 08:58:45 PM
తెలంగాణ విద్యార్థి ఉద్యమ నాయకుడు కే. సమ్మయ్య..
మందమర్రి (విజయక్రాంతి): ఉమ్మడి అదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్ ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న అల్ఫోర్స్ విద్యా సంస్థల యాజమాని డబ్బు కట్టల కార్పొరేట్ వ్యక్తి నరేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తామని తెలంగాణ విద్యార్థి ఉద్యమ నాయకుడు కుడుక సమ్మయ్య హెచ్చరించారు. శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల పట్టణాలలో పలు విద్యార్థి సంఘాలను, గ్రాడ్యుయేట్ ఓటర్లను ఆయన కలిశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ పట్టబద్దుల ఎన్నికల్లో పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థల యాజమాని కార్పొరేట్ విద్యా వ్యవస్థలను స్థాపించి ఎందరో పేద మధ్యతరగతి అమాయకులైన విద్యార్థులు వారి తల్లిదండ్రు లకు మాయమాటలు చెప్పి వారి వద్ద నుంచి ఫీజుల రూపంలో రక్తాన్ని జలగల్ల తాగుతున్నారని విమర్శించారు.
జిల్లాలో విద్యాసంస్థలను స్థాపించి చదువుల పేరిట డబ్బు కట్టలు వసూలు చేస్తూ విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నాడని మండిపడ్డారు. విద్యాసంస్థలను సేవారంగంలా కాకుండా వ్యాపారమయం చేశాడని, రాష్ట్రంలోనీ విద్యార్థుల నుండి దోచుకొని పక్క రాష్ట్రాలలో కార్పొరేట్ విద్యాసంస్థలను స్థాపించి అక్కడి అమాయకమైన విద్యార్థులను తన కార్పొరేట్ వలయంలో వేసుకొని ఫీజుల రూపంలో దోచుకుంటున్నారని ఆరోపించారు. ఫీజుల పేరిట అక్రమంగా సంపాదించిన ధనాన్ని, తన ఆస్తులను కాపాడుకోవడం కోసమే రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారని ఈ ఎన్నికల్లో విజ్ఞులైన పట్టభద్రులు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. ప్రభుత్వ సంస్థలను నాశనం చేయడానికి కార్పొరేట్ విద్యా వ్యవస్థను స్థాపించాడని, ఎన్నికలు రావడంతో అసత్య ఆరోపణలు చేస్తూ పబ్బం గడపడానికి, ప్రభుత్వ సంస్థలు, విద్యారంగం అభివృద్ధికి, నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాననడం సిగ్గుచేటని అన్నారు.
తన కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఏ ఒక్కరికి కూడా ఉచిత విద్యని అందించని, కనీసం ఫీజులో రాయితీ ఇవ్వని, విద్యార్థులు వారి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులకు అందుబాటులో ఉండని వ్యక్తి కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయని వ్యక్తినీ తమ ఓటు ద్వారా ఓడించాలన్నారు. విద్యని వ్యాపారం చేసి విద్యార్థుల బంగారు జీవితాన్ని నాశనం చేసి రాజకీయాల్లోకి వచ్చి తన డబ్బు అహం చూపిస్తున్నారని ఇలాంటి వ్యక్తిని జిల్లాలో ప్రచారానికి రాకుండా అడ్డుకుంటామని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ద్వారా చిత్తుచిత్తుగా ఒడగొట్టి తగిన గుణపాఠం చెబుతామని స్పష్టం చేశారు.