స్వల్పంగా పెరిగిన సూచీలు
ముంబై, డిసెంబర్ 11: అటు యూఎస్‌లోనూ, ఇటు దేశీయంగానూ ద్రవ్యోల్బణం గణాంకాలు విడుదలకానున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో బుధవారం స్టాక్ సూచీలు పరిమితశ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. అయితే మూడు రోజుల వరుస క్షీణతకు బ్రేక్‌వేస్తూ స్వల్ప లాభాలతో ముగిసాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 16 పాయింట్ల లాభంతో 81,526 పాయింట్ల వద్ద నిలిచింది. ఇదేబాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 31 పాయింట్లు పెరిగి 24,641 పాయింట్ల వద్ద ముగిసింది.
వచ్చే వారం ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయాన్ని ప్రభావితం చేసే యూఎస్ వినిమయ ద్రవ్యో ల్బణం డేటా వెలువడనున్నందున గ్లోబల్ మార్కెట్లలో నెలకొన్న మిశ్రమ సెంటిమెంట్‌ను ప్రతిబింబిస్తూ భారత సూచీలు నిస్తే జంగా ట్రేడయ్యాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. గత ఏడు ట్రేడింగ్ సెషన్లలో ఎన్నడూ లేనంత పరిమితంగా నిఫ్టీ 107 పా యింట్ల శ్రేణిలో కదిలిందని స్టాక్స్‌బాక్స్ టెక్నికల్ అనలిస్ట్ అమేయా రణదివే చెప్పారు. బీఎస్‌ఈలో ట్రేడయిన షేర్లలో 2,146 లాభపడగా, 1,840 నష్టపోయాయి.
పెరిగిన యూఎస్ ద్రవ్యోల్బణం
ఫెడ్ రేట్ల కోతను నిర్దేశించే యూఎస్ రిటైల్ ద్రవ్యోల్బణం నవంబర్ నెలలో 2.7 శాతానికి పెరిగింది. అక్టోబర్ నెలలో ఇది 2.6 శాతం. బుధవారం భారత్ మార్కెట్ ముగిసిన తర్వాత ఈ గణాంకాలు వెలువడ్డాయి. అంచనాలకు అనుగుణంగానే 2.7 శాతం ద్రవ్యోల్బణం నమోదైనందున, వచ్చేవారం జరిగే ఫెడరల్ రిజర్వ్ సమీక్షలో రేట్ల తగ్గింపు ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
బజాజ్ ఫైనాన్స్ టాపర్
సెన్సెక్స్ ప్యాక్‌లో అన్నింటికంటే అధికంగా బజాజ్ ఫైనాన్స్ 2.6 శాతం లాభపడింది. నెస్లే ఇండియా, బజాజ్ ఫిన్‌సర్వ్, ఏషియన్ పెయింట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, ఇన్ఫోసిస్, మారుతి, భారతి ఎయిర్‌టెల్, హిందుస్థాన్ యూనీలివర్‌లు 1.7 శాతం వరకూ పెరిగాయి. మరోవైపు జేఎస్‌డబ్ల్యూ స్టీల్, అదానీ పోర్ట్స్, ఎన్టీపీసీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రిలయన్స్ ఇండస్ట్రీస్, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టైటాన్‌లు నష్టాలతో ముగిసాయి.
వివిధ రంగాల సూచీల్లో కన్జూమర్ డ్యూరబుల్స్ ఇండెక్స్ 0.59 శాతం, ఇండస్ట్రియల్స్ సూచి 0.40 శాతం, ఆటోమొబైల్స్ సూచి 0.37 శాతం, ఐటీ సూచి 0.35 శాతం, ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్ 0.34 శాతం చొప్పున పెరిగాయి. యుటిలిటీస్, బ్యాంకెక్స్, పవర్, సర్వీసెస్ సూచీలు నష్టపోయాయి. బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.35 శాతం, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.25 శాతం చొప్పున పెరిగాయి.