19-04-2025 12:26:16 AM
హైదరాబాద్, ఏప్రిల్ 18 (విజయక్రాంతి): కర్ణాటక తరహాలోనే తెలంగాణలో టెట్రా ప్యాకెట్లలో మద్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ప్రభుత్వానికి ఇప్పటికే ఎక్సైజ్‌శాఖ ప్రతిపాదనలు పంపింది. ఈ విధానం అమలైతే మందుబాబులకు మరింత సులభంగా మద్యం లభించనుంది. రాష్ట్రంలో అంచనాలకు మించి మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి.
దీంతో రాష్ట్ర ఖజనాకు ఆదాయం పెరుగుతోంది. ఈ క్రమంలో తక్కువ ధరలకే మద్యాన్ని అందుబాటులోకి తెచ్చి, అమ్మకాలను పెంచుకునేందుకు ఎక్సుజ్ శాఖ సిద్ధమవుతోంది. అందులో భాగంగానే ప్రస్తుతం అందుబాటులో ఉన్న బ్రాండ్లతోపాటు అదనంగా కొత్త బ్రాండ్లను ప్రవేశపెట్టాలని భావిస్తోంది.
ఫ్రూట్ జ్యూస్ తరహాలో మద్యాన్ని 60 ఎంఎల్, 90 ఎంఎల్, 180 ఎంఎల్‌ల ప్యాకెట్ల రూపంలో అమ్మడానికి కసరత్తు జరుగుతోంది. సీసాలతో పోల్చితే టెట్రా ప్యాకెట్ల ద్వారా మద్యం తక్కువ ధరకు లభించనుంది. రాష్ర్టంలో ఇప్పుడు క్వార్టర్ చీప్ లిక్కర్ ధర రూ.120గా ఉంది.
అదే మద్యం టెట్రా ప్యాకెట్ల రూపంలో అందుబాటులోకి వస్తే రూ.100కే లభించే అవకాశం ఉందని ఎక్సుజ్ శాఖ అధికారులు చెబుతున్నారు. ఎక్సైజ్‌శాఖ నుంచి ఇప్పటికే ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందాయి. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వ ఆమోదం తెలిపితే టెట్రా ప్యాకెట్ల రూపంలో రాష్ర్టంలో మద్యం విక్రయాలు జరగనున్నాయి.
నిరసనలతో ఆ ప్రభుత్వాలు వెనక్కి..
పక్క రాష్ట్రం కర్ణాటకలో మద్యం 90ఎంఎల్, 180 ఎంఎల్ టెట్రా ప్యాకెట్లలో లభిస్తోంది. అయితే తెలంగాణలో వీటితోపాటు 60 ఎంఎల్ పరిమాణంలో టెట్రాప్యాక్ మద్యాన్ని కూడా తీసుకురావాలని ఎక్సైజ్ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. సీసా మద్యంతో పోల్చినప్పుడు రూ.10 నుంచి రూ.15 తక్కువకే టెట్రా ప్యాకెట్‌లో మద్యం లభిస్తుంది.
గతంలో తమిళనాడు, బీహార్ రాష్ట్రాలు కూడా టెట్రా ప్యాకెట్ల రూపంలో మద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నించాయి. అయితే, ఆ రాష్ట్రాల్లో భారీగా నిరసనలు వ్యక్తం కావడంతో ప్రభుత్వాలు వెనక్కి తగ్గాయి. ఈ క్రమంలో పైలెట్ ప్రాజెక్టుగా ముందుగా ఒక జిల్లాలో టెట్రా ప్యాకెట్ మద్యాన్ని తీసుకురావాలనే ఆలోచనలో అధికారులు ఉన్నారు.
మెక్‌డోల్స్ ఆసక్తి
ప్రస్తుతం రాష్ర్టంలో 2,620 వైన్ షాపులు, 1,117 వరకు బార్లు ఉన్నాయి. వీటికి దేశ విదేశాలకు చెందిన 55 కంపెనీల ద్వారా మద్యం సరఫరా అవుతుంది. కర్ణాటకలో మెక్‌డోల్స్ కంపెనీ 90శాతం మద్యాన్ని టెట్రా ప్యాకెట్ల రూపంలో విక్రయిస్తోంది.
తెలంగాణలో కూడా అదే తరహాలో మద్యాన్ని విక్రయించేందుకు ఆసక్తి చూపుతోంది. ప్యాకెట్ల రూపంలో మద్యాన్ని తీసుకురావాడం వల్ల అమ్మకాలు పెంచుకోవచ్చుననే ఉద్దేశంతో ఆ కంపెనీ ప్రతినిధులు ఇప్పటికే రెండుసార్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సుజ్ శాఖ ఉన్నతాధికారులను సంప్రదించారు.