25-04-2025 11:44:52 PM
అయ్యప్ప సొసైటీ వద్ద గల ట్రూప్స్ బార్‌లో ఘటన...
ముగ్గురిపై కేసు నమోదు..
రూ.1.48లక్షల మద్యం బాటిళ్లు స్వాధీనం...
హైదరాబాద్ సిటీబ్యూరో (విజయక్రాంతి): నగరంలోని అయ్యప్ప సొసైటీ వద్ద గల ట్రూప్స్ బార్‌లో మద్యం కల్తీని ఎక్సైజ్ అధికారులు గుర్తించి, ముగ్గురిపై కేసు నమోదు చేశారు. లింగంపల్లి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ట్రూప్స్ బార్ యాజమాన్యం రెన్యువల్ ఫీజు చెల్లించలేదు. దాంతో పాటు కొంత కాలంగా ఎక్సైజ్ మద్యం డిపోల నుంచి మద్యం కూడా తీసుకోవడంలేదు. ఈ అనుమానంతో ఎక్సైజ్ అధికారులు ఆ బార్‌లో శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. ఆ బార్‌లో కూకట్‌పల్లికి చెందిన సత్యనారాయణ, పునిక్ పట్నాయక్ అనే వ్యక్తులు రూ.2,690 ధరగల జేమ్స్‌సన్ మద్యం బాటిల్‌లో రూ.1,000 విలువ గల ఓక్‌స్మిత్ మద్యాన్ని కలుపుతుండగా గుర్తించారు.
బార్‌లో మద్యాన్ని కల్తీ చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో ఎక్కువ ధరగల మద్యం స్థానంలో తక్కువ ధర కలిగిన మద్యాన్ని కలిపిన 75 బాటిళ్లను, 55 ఖాళీ బాటిళ్లను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రూ.1.48లక్షల విలువ గల మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు రంగారెడ్డి ఏఈఎస్ జీవన్‌కిరణ్ తెలిపారు. బార్ లైసెన్స్ ఓనర్ ఉద్యాకుమార్‌రెడ్డి, మేనేజర్ వి.సత్యనారాయణరెడ్డి, బార్‌లో పని చేసే పునిత్ పట్నాయక్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో సీఐ సుభాష్‌చందర్‌రావు, ఎస్సై వెంకటేశ్వరు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.