calender_icon.png 10 October, 2024 | 2:55 PM

అల్కరాజ్‌దే చైనా ఓపెన్

03-10-2024 12:00:00 AM

ఫైనల్లో సిన్నర్‌పై విజయం

క్వార్టర్స్‌లో సబలెంకా, ఆండ్రీవా

బీజింగ్: చైనా ఓపెన్ టెన్నిస్ టోర్నీ విజేతగా స్పెయిన్ యువ కెరటం కార్లోస్ అల్కరాజ్  నిలిచాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో అల్కరాజ్ 6-7 (7/6), 6-4, 7-6 (7/3)తో ప్రపంచ నంబర్ వన్ జానిక్ సిన్నర్ (ఇటలీ)పై విజయం సాధించాడు. మూడో ర్యాంకులో కొనసాగుతున్న అల్కరాజ్ టాప్ సీడ్ సిన్నర్‌ను మట్టికరిపించడం ఈ ఏడాది ఇది మూడోసారి.

ఇంతకముందు ఇండియన్‌వెల్స్, ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో అతడిపై నెగ్గాడు. అంతేకాదు ఈ విజయంతో సిన్నర్ 14 వరుస విజయాలకు అల్కరాజ్ చెక్ పెట్టడం విశేషం. వరుసగా సిన్సినాటి, యూఎస్ ఓపెన్‌లను కైవసం చేసుకున్న సిన్నర్‌కు ఇది పెద్ద షాక్ అని చెప్పొచ్చు.

ఇప్పటి వరకు అల్కరాజ్-సిన్నర్ పది సార్లు తలపడగా.. అల్కరాజ్ 6 సార్లు.. సిన్నర్ నాలుగు పర్యాయాలు విజయకేతనం ఎగురేశాడు. సిన్నర్ మీద నిషేధం విధించాలని వాడా పట్టుబడుతున్న వేళ.. సిన్నర్ ఓడిపోవడం గమనార్హం.  

సబలెంకా సాఫీగా.. 

మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ అరీనా సబలెంకా (బెలారస్) క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. బుధవారం జరిగిన మహిళల ప్రిక్వార్టర్స్‌లో సబలెంకా 6-4, 6-3 తేడాతో మాడిసన్ కీస్ (అమెరికా)పై విజయాన్ని నమోదు చేసుకుంది.  సిన్సినాటి ఓపెన్, యూఎస్ ఓపెన్‌ను గెలుచుకున్న సబలెంక చైనా ఓపెన్‌ను కూడా కైవసం చేసుకుంటుందో లేదో తెలియనుంది.

మరో ప్రిక్వార్టర్స్‌లో కరోలినా ముచావా (చెక్ రిపబ్లిక్) 6-2, 6-0 తేడాతో బుక్సాపై, మిర్రా ఆండ్రీవా (రష్యా) లినెట్టెపై విజయాలు సాధించి క్వార్టర్స్‌కు దూసుకెళ్లారు. పురుషుల డబుల్స్ ఫైనల్లో బోలెల్లి-వవస్సోరి ద్వయం 4-6, 6-3, 10-5 తేడాతో ప్యాటెన్-హెలివారా జోడీ మీద విజయం సాధించి చాంపియన్స్‌గా నిలిచారు.