calender_icon.png 15 November, 2024 | 4:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఢిల్లీలో ప్రమాద ఘంటికలు

14-11-2024 12:59:29 AM

ఏక్యూఐలో 429కి పడిపోయిన గాలి నాణ్యత

న్యూఢిల్లీ, నవంబర్13: కాలుష్య కోరల్లో దేశ రాజధాని ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. గడిచిన 24 గంటల్లోనే ఢిల్లీ దాని పరిసర ప్రాంతాల్లో గాలి నాణ్యత తీవ్రంగా పడిపోయింది. దేశ రాజధానిలో మంగళవారం సాయంత్రం గాలి నాణ్యత ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ)లో 334గా నమోదవ్వగా బుధవారం సాయంత్రం నాటికి ఎయిర్ క్వాలిటీ 429కి పడిపోయింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్(సీపీసీబీ) ప్రకారం ఢిల్లీలో 36 మానిటరింగ్ స్టేషన్లు ఉండగా అందులో 30 స్టేషన్లు నగరంలో గాలి నాణ్యత ఆందోళనకర స్థాయిలో క్షీణించినట్టు తెలిపాయి.

రాజధానిలో గత 14 రోజులుగా గాలి నాణ్యత పడిపోతూనే ఉంది. వాహనాల నుంచి వెలువడే పొగ 15.4శాతం కాలుష్యానికి కారణమవుతుండగా చుట్టుపక్కల రాష్ట్రాల్లో రైతులు పెద్ద ఎత్తున పంట వ్యర్థాలను దహనం చేస్తుండంతో  పరిస్థితి మరింత దిగజారుతోంది. బుధవారం ఉదయం దట్టమైన పొగ మంచు నగరమంతటా వ్యాపించడంతో ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో కొన్ని విమానాలు ల్యాండ్ కాకుండా వెనుదిరిగాయి.

పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నప్పటికీ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కాలుష్య నివారణకు గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్‌ను అమలు చేయడం లేదు. గురువారం నాటికి పరిస్థితి మెరుగవుతుందని పేర్కొంటోంది.