calender_icon.png 14 October, 2024 | 5:55 AM

ఉద్యమానికి ఊపిరిపోసిన అలయ్ బలయ్

14-10-2024 03:05:36 AM

స్వరాష్ట్ర సాధన జేఏసీ ఏర్పాటుకు తోడ్పాటు  

సంప్రదాయాలను కాపాడుకోవడం మన బాధ్యత 

స్పష్టం చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 

హాజరైన పలు రాష్ట్రాల గవర్నర్లు, కేంద్ర మంత్రులు

హైదరాబాద్, అక్టోబర్ 13 (విజయక్రాం తి): తెలంగాణ ఉద్యమ సమయంలో జేఏసీ ఆవిర్భావానికి అలయ్ బలయ్ ఉపయోగపడిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ సంప్రదాయాలు కాపాడుకోవ డం మనందరి బాధ్యతగా సీఎం పేర్కొన్నారు.

ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకోవ డానికి అలయ్ బలయ్ స్ఫూర్తిగా పనిచేసిందని ఆయన అన్నారు. తెలంగాణ సంస్కృ తిని నలుదిశలా వ్యాపింపచేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ నుంచి ఆర్‌ఎస్‌యూ వరకు కమ్యూని స్టుల నుంచి కాంగ్రెస్ కూడా తెలంగాణ కోసం ఉద్యమించాయన్నారు.

అన్ని సామాజిక వర్గాలు కార్యోన్ముఖులు కావడానికి అల య్ బలయ్ దోహదపడిందని సీఎం వివరించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో బండారు విజయలక్ష్మి అధ్యక్షతన ఏర్పాటైన అలయ్ బలయ్ కార్యక్రమాన్ని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఢంకా మోగిం చి ప్రారంభించారు. 

కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... రాష్ర్ట ప్రజలకు అతిపెద్ద పండగ దసరా అని, ఈ పర్వదినాన అందరికీ గుర్తొచ్చేది పాలపిట్ట, జమ్మిచెట్టు అని అన్నారు. మరోవైపు అల య్ బలయ్ అంటే గుర్తొచ్చేది బండారు దత్తాత్రేయ అని పేర్కొన్నారు. దత్తాత్రేయ వారసత్వాన్ని ఆయన కుమార్తె విజయలక్ష్మి ముందుకు తీసుకు వెళ్లడం అభినందనీయమని సీఎం అన్నారు.

ప్రభుత్వపరంగా, పార్టీ పరంగా వీహెచ్, కేశవరావు, పొన్నం ప్రభాకర్ అలయ్ బలయ్‌లో పాల్గొన్నామని ముఖ్యమంత్రి వివరించారు. ఇది రాజకీయాలకు సంబంధం లేదని, అంతరించిపోతున్న సంస్కృతి సంప్రదాయాలను దత్తాత్రేయ ముందుకు తీసుకువెళ్తున్నారని తెలిపారు.

తెలంగాణ ఉద్యమంలో జెండాలకు అజెండాలకు అతీతంగా ఒక పొలిటకల్ జేఏసీని ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడానికి ఈ అలయ్ బలయ్ కార్యక్రమం స్ఫూర్తిగా పనిచేసిందని అన్నారు. దసరా పండుగ పూర్తి చేసుకొని కుటుంబంలో ఉం డే పెద్దలకు, మిత్రులకు జమ్మి పెట్టి అలయ్ బలయ్ చేసుకొని మనమందరం అభివృద్ధిపథం వైపు నడవాలని...

మన ప్రాంతం సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకునేదే ఈ పండుగ అని అన్నారు. రాజకీయాలకు అతీతంగా గత 19 ఏళ్లుగా అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, హర్యానా గవర్నర్ హరిబావ్ భగాడే, ఉత్తరాఖండ్ గవర్నర్ గుర్మీత్ సింగ్, మేఘాలయా గవర్నర్ విజయ్ శంకర్, స్పీక ర్ గడ్డం ప్రసాద్‌కుమార్, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, మహారాష్ట్ర మా జీ గవర్నర్ విద్యాసాగర్ రావు, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, ఏపీ మంత్రి సత్యకుమార్, ఎంపీలు డాక్టర్ కే లక్ష్మణ్, ఈటల రాజేందర్, డీకే అరుణ, రఘునందన్‌రావు, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, ఎమ్మెల్సీలు గోరేటి వెంకన్న, వాణీదేవి, మాజీ ఎంపీ వీహెచ్, కేశవరావు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 

అలయ్ బలయ్ అంటేనే దత్తన్న : కేంద్ర సహాయ మంత్రి సంజయ్

దత్తాత్రేయ పేరు వినగానే హోలి, అలయ్ బలయ్ కార్యక్రమాలు గుర్తుకొస్తాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. హోలి రోజు దత్తాత్రేయ హోలి ఆడితే 3 నెలలపాటు రంగు పోదని గుర్తుచేసుకున్నారు. అలయ్ బలయ్ పేరుతో రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నేత లు హాజరై తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను గుర్తు చేసుకోవడం సంతోషం గాఉందని చెప్పారు. రాబోయే తరాలు మన తెలంగాణ సంస్కృతి, హిందూ సంస్కృతి మర్చిపోకుండా అలయ్ బలయ్ నిర్వహించడం గొప్ప విషయమని కొనియాడారు. 

తెలంగాణ ఉద్యమంలో అలయ్ బలయ్ ఒక ఐక్య వేదిక : మంత్రి పొన్నం ప్రభాకర్ 

తెలంగాణ, హైదరాబాద్ సంస్కృతి అలయ్ బలయ్ అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. దసరా తర్వాత ఇవాళ ఆనందంగా అందరం అలయ్ బలయ్‌లో పాల్గొన్నట్టు తెలిపారు. ప్రస్తుత రాజకీయాలపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడిన మాటలు నిజమని చెప్పారు. రాజకీయ నేతల భాషల హద్దులు దాటకుండా ఉండేలా పార్టీలన్నీ నిర్ణయం తీసుకోవాలని అన్నారు.

ఇతరులపై వాడే భాష అయినా మత పరమైన విమర్శలైనా రెచ్చగొట్టేలా ఉండకూడదని చెప్పారు. అలయ్ బలయ్ లాంటి వేదికలు అలాంటి చెడు సంప్రదాయాలకు చెక్ పెడుతాయయని ఆశాభావం వ్యక్తం చేశారు. భవి ష్యత్తులో కూడా అలయ్ బలయ్ దిగ్విజ యంగా కొనసాగాలలని ఆకాంక్షించారు.

గొంగళ్లతో సన్మానం.. ౬౦ రకాల వంటకాలతో విందు 

అలయ్‌బలయ్‌కు హాజరైన సీఎం రేవంత్‌రెడ్డితోపాటు పలు రాష్ట్రాల గవర్నర్లు, కేం ద్ర మంత్రులను బండారు దత్తాత్రేయ గొంగళ్లతో సన్మానించారు. సంప్రదాయ నృత్యా లు, కోలాటం, గిరిజన నృత్యాలు, పోతరాజుల విన్యాసాలు, పులి వేషాలు తెలంగాణ సంస్కృతికి అద్దంపట్టాయి. హైదరాబాదీ సంప్రదాయ మర్ఫా వాయిద్య సంగీతం విశేషంగా ఆకట్టుకుంది.

అలయ్ బలయ్ అధ్య క్షురాలు బండారు విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథు ల కోసం పెద్ద ఎత్తున శాఖాహార, మాంసాహార వంటకాలను సిద్ధం చేశారు. నోరూరిం చే తెలంగాణ సంప్రదాయ వంటలు, ప్రత్యేకించి చికెన్, మటన్ బిర్యానీ, చేపల పులుసు, చిరు ధాన్యాల ఉత్పత్తులు, గారెలు, జొన్న రొట్టె, ఇతర పిండి వంటకాలు సిద్ధం చేశారు. ఇవే కాకుండా బోటి, తలకాయ కూర, చేపల ఫ్రై, చికెన్ ఫ్రై, నల్ల, పాయ వంటి దాదాపు 60 రకాల వంటకాలు వడ్డించినట్టు నిర్వాహకులు పేర్కొన్నారు. 

సమైక్యతా వారధి: మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

అలయ్ బలయ్ లాంటి కార్యక్రమా లు రాజకీయాలకు అతీతంగా, సమైక్య తా భావాన్ని పెంపొందిస్తాయని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సమైక్యతా వారధుల నిర్మాణం సామాజిక బాధ్యతగా పేర్కొన్నారు. ఒకప్పుడు ఐక్యత లేక పరాయి పాలనలో సమస్యలు అనుభవించామని అన్నారు.

ఇప్పుడు పాశ్చాత్య అనుకరణ కారణంగా కుటుంబానికి, సమాజానికి దూరమవుతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ పరిస్థితుల్లో భారతీయ సంస్కృ తిలో భాగమైన ఇలాంటి కార్యక్రమాల ద్వారా అందరూ ఏకం కావాలని ఆకాంక్షించారు. అలయ్ బలయ్ సందర్భంగా రాజకీయాలకు అతీతంగా అందరినీ ఒకే వేదిక మీద చూడటం ఎంతో ఆనందంగా ఉందన్నా రు.

రాజకీయ విభేదాలు సిద్ధాంతాలకే పరిమితం కావాలని, నేతలు వ్యక్తిగత దూషణలకు దిగితే, అది కార్యకర్తలకూ పాకుతుందని, ఇది సమాజ శ్రేయ స్సుకు మంచిది కాదని హితవు పలికారు. ఇలాంటి కార్యక్రమాల స్ఫూర్తితో సమాజంలో ఐక్యతా స్ఫూర్తిని, సమిష్టి తత్వాన్ని పెంపొందించేందుకు ప్రజాప్రతినిధులు కృషి చేయాలని కోరారు. 

దారుణంగా నాయకుల భాష : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసే అల య్ బలయ్ అత్భుతమైన కార్యక్రమమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. రాజకీయంగా ఎన్ని వైరుధ్యాలున్నా ఇలాంటి కార్యక్రమాల ద్వారా అంతా ఒక చోట కలవడం గొప్ప విషయమని చెప్పారు. ఎన్ని కలప్పుడు మాత్రమే రాజకీయాలు చేయాలని, మిగతా సమయమాల్లో ప్రజల సంక్షే మం, అభివృద్ధిపై దృష్టిసారించాలని సూ చించారు.

దురదృష్టవశాత్తు తెలంగాణ లో అది లోపించిందని ఆవేదన వ్యక్తంచేశారు. గత కొంతకాలంగా రాజకీయ నాయకుల భాష దారుణంగా ఉంటోందని, చాలామం ది నాయకులు మాట్లాడే భాష అంగీకారయోగ్యం కాదని స్పష్టంచేశారు. రాజకీయ నాయకుల్లో మార్పు రావాలని కోరారు.  

అలయ్ బలయ్ అంటేనే ఐక్యత : తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

అలయ్ బలయ్ అంటేనే ఐక్యత అని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. ఇది మన సంప్రదాయాలను ప్రతిబింబించే కార్యక్రమమని తెలిపారు. తెలంగాణ గ్రామీణ ప్రజల సంస్కృతి సంప్రదాయా లు ఎంతో గొప్పగా ఉన్నాయని పేర్కొన్నా రు. అంతా బాగుండాలనేదే ఈ సంస్కృతి భావమని తెలిపారు.

అన్ని మతాల వారు కలిసి విజయదశమి వేడుకలను గొప్పగా జరుపుకొంటున్నారని సంతోషం వ్యక్తంచేశారు. విజయదశమి పర్వదినం చెడుపై మంచి సాధించిన విజయమని, ఆ విజ యం ఐక్యతతో సాధ్యమని స్పష్టంచేశారు. అలయ్ బలయ్ వంటి అత్భుతమైన కార్యక్రమం చేపట్టినందుకు బండారు దత్తాత్రే యను, ఆలయ్ బలయ్ ఫౌండేషన్ సభ్యులను అభినందిస్తున్నామని ఆయన కొనియాడారు.

ఏపీలోనూ అలయ్ బలయ్ చేస్తాం : ఏపీ మంత్రి సత్యకుమార్

రాజకీయంగా ఎంతో వైరుధ్యం ఉన్న నాయకులందరినీ ఒకేచోట కలిపిన అల య్ బలయ్ ఎంతో గొప్ప కార్యక్రమమని ఆంధ్రప్రదేశ్ మంత్రి సత్యకుమార్ తెలిపా రు. తాను ఏపీ ప్రతినిధిగా ఈ కార్యక్రమానికి హాజరైనట్టు వివరించారు. ఎన్నికల సమయంలో మాత్రమే పోటీ ఉండాలని, తర్వాత అంతా కలిసి ముందుకు సాగాల ని పిలుపునిచ్చారు. ఏపీలోనూ ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తామని స్పష్టంచేశారు. సంక్రాం తి లేదా దసరా సందర్భంగా ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టేందుకు ఏపీ ప్రతినిధిగా తన వంతు ప్రయత్నం చేస్తానని తెలిపారు.

అలయ్ బలయ్ ఒక సందేశం : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు 

రాజకీయ నాయకులంతా ఒక పద్ధతి తో వ్యవహరించేలా దత్తాత్రేయ తీసుకువచ్చిన అలయ్‌బలయ్ కార్యక్రమం ఎంతో గొప్పదని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. భవిష్యత్తులోనూ ఈ కార్యక్ర మం చాలా గొప్పగా ముందుకు సాగుతుందని చెప్పారు. రాజకీయ నాయకుల కు, రాజకీయాలకు ఆయన ఓ దశ దిశా చూపిస్తున్నారని పేర్కొన్నారు. 

తెలుగు రాష్ట్రాలను అగ్రస్థానంలో నిలపాలి : హర్యానా గవర్నర్ దత్తాత్రేయ

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్‌రెడ్డి, చంద్రబాబు కలిసిమెలిసి రాష్ట్రాల అభివృద్ధి కోసం పని చేయాల ని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పిలుపునిచ్చారు. రాజకీయాలకు అతీతంగా పరస్పరం సహకరించుకుని, ఐకమత్యంతో ముందుకు వెళ్లి, దేశంలో నే తెలంగాణ, ఏపీని అగ్రస్థానంలో నిలపాలని ఆకాంక్షించారు.

రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా 19 ఏళ్ల క్రితం అలయ్ బలయ్ కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. ప్రేమ, ఆత్మీయత, ఐక్యత చాటి చెప్పాలన్నదే అలయ్ బలయ్ ఉద్దేశమని చెప్పారు. ఈసారి కులవృత్తులకు ప్రాధాన్యం ఇస్తూ అలయ్ బలయ్‌లో వాటిని ప్రదర్శించామని పేర్కొన్నారు. జడ్పీటీసీ స్థాయి నుంచి సీఎం వరకు కష్టపడి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి అభినందనీయుడని అన్నారు.