బీసీ కమిషన్ చైర్మన్‌గా నిరంజన్
వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్‌గా కోదండరెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న విద్యా కమిషన్‌కు చైర్మన్‌గా మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళిని నియమించింది. ఈ పదవిలో మురళి రెండేళ్ల పాటు ఉంటారు. రాష్ట్రంలో విద్యారంగాన్ని సమూలంగా మార్చివేసి అత్యుత్తమ విద్యావిధానాలను ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేసింది.
ఏపీలో జగన్ హయాంలో ఆయన ప్రభుత్వ సలహాదారుగా పనిచేసిన కాలంలో మురళి అక్కడ విద్యావ్యవస్థ మార్పులో కీలకమైన పాత్ర పోషించారని పేర్కొంటారు. ఈ నేపథ్యంలో ఆయనను తెలంగాణ తొలి విద్యా కమిషన్ చైర్మన్‌గా నియమించడంతో రాష్ట్రంలో విద్యారంగాన్ని సమూలంగా మార్చేసేందుకు సర్కారు వడివడిగా అడుగులు వేసినట్లుగా భావిస్తున్నారు. ఈ నిర్ణయం రాష్ట్ర విద్యారంగానికి మేలు చేసేదిగా చెబుతున్నారు.
బీసీ కమిషన్ చైర్మన్‌గా నిరంజన్
సీనియర్ కాంగ్రెస్ నాయకుడు నిరంజన్‌ను ప్రభుత్వం బీసీ కమిషన్ చైర్మన్‌గా నియమించింది. కమిషన్ సభ్యులుగా రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మిని నియమించారు. బీసీ వెల్ఫేర్ కమిషనర్ మెంబర్ సెక్రటరీగా కొనసాగుతారని ప్రభుత్వం తెలిపింది.
రైతు సంక్షేమ కమిషన్ ఏర్పాటు..
రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని పునరుత్తేజింప చేసేందుకు, సుస్థిర వ్యవసాయ అభివృద్ధికి ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించేందుకు, రైతుల సంక్షేమం మరియు అభివృద్ధి కోసం తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ ఏర్పాటు చేస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిషన్‌కు చైర్మన్‌గా సీనియర్ కాంగ్రెస్ నేత, కిసాన్ సెల్ జాతీయ నేత ఎం. కోదండరెడ్డిని నియమించారు. వ్యవసాయ రంగంలో ఎంతో అనుభవజ్ఞుడైన కోదండరెడ్డిని చైర్మన్‌గా నియమించారు.
ఆధునిక వ్యవసాయ పద్ధతులు, సమర్థవంతమైన నీటిపారుదల పద్ధతుల ద్వారా పంటల ఉత్పాదత పెంచడం, నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉంచడం, సేంద్రియ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం, రైతులకు మెరుగైన జీవనోపాధులు పెంపొందించడం, రైతుల ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించడంతో పాటు వ్యవసాయ కూలీలకు జీవనోపాధులు పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి అనేక లక్ష్యాలతో ఈ కమిషన్‌ను ఏర్పాటు చేసిట్లు సర్కారు స్పష్టం చేసింది.