నేడు డాక్టర్ రావూరి భరద్వాజ జయంతి
‘ఆకలి, అవసరం, ఆత్మాభిమానం నన్ను/ కసి కొద్దీ రచయితగా మలిచాయని’ సగర్వంగా చాటుకొన్న స్వాభిమాన రచయిత రావూరి భరద్వాజ. సుమారు పాతికేళ్ళుగా తెలుగునేల ఉనికినే మరిచిపోయిన ‘జ్ఞానపీఠాన్ని’ మన మార్గం పట్టించి, ముచ్చటగా మూడవ జ్ఞానపీఠాన్ని తెచ్చిపెట్టారు.
శిలలను చీల్చుకొని వచ్చిన మొక్క మొక్కవోని ధైర్యంతో అవమానాలకు ఎదురీది శిరమెత్తి నిలిచిన ఆత్మాభిమానం! పదునెక్కిన కలంతో గళమెత్తిన సాహిత్యం! రాశిలో వాసిలో వన్నెకెక్కిన సారస్వతం! ఉలి చెక్కిన శిల్పం ప్రాణం పోసుకొని ప్రణవాన్ని పలికిన ఋషిత్వం! అల రవీంద్రుని తలపించే మూర్తిమత్వం! వీటన్నింటి కలబోత మహా రచయిత డాక్టర్ రావూరి భరద్వాజ!
‘ఆకలి, అవసరం, ఆత్మాభిమానం నన్ను/ కసి కొద్దీ రచయితగా మలిచాయని’ సగర్వంగా చాటుకొన్న స్వాభిమాన రచయిత రావూరి భరద్వాజ. సుమారు పాతికేళ్ళుగా తెలుగునేల ఉనికినే మరిచిపోయిన ‘జ్ఞానపీఠాన్ని’ మన మార్గం పట్టించి, ముచ్చటగా మూడవ జ్ఞానపీఠాన్ని తెచ్చిపెట్టారు. 1927 జూలై 5న జన్మించిన భరద్వాజ తల్లిదండ్రులు కోటయ్య, మల్లికాంబ. ఆనాటి నిజాం పాలనకు చెందిన పరిటాల జాగీరులోని ‘మొగులూరు’ వీరు పుట్టిన ఊరు. తండ్రి ఆనాటి జాతీయ, సంఘ సంస్కరణోద్యమాలలో రాత్రింబవళ్ళు తిరుగుతూ కుటుంబ బాధ్యతలకు దూరంగా ఉండేవారు. ఆర్థికంగా అంతంత మాత్రమే అయిన ఆ కుటుంబం ఉన్న కొద్దిపాటి పొలం పోగొట్టుకొని పేదరికం పాలైంది. గుంటూరులోని తాడికొండలో అక్షరాలు దిద్దుకొన్న భరద్వాజ చదువు 7వ తరగతి వద్దే ఆగిపోయింది. పై చదువులు చదవాలని ఉన్నా ఆర్థిక పరిస్థితులు అనుకూలించలేదు.
జీవితమే ఒక పోరాటం
చదువుకు దూరమైన భరద్వాజ ఆనాటి రైతు వ్యవసాయ, కార్మిక సంఘాలలో చురుగ్గా తిరిగేవారు. ‘ప్రజా నాట్యమండలి’ వంటి సంస్థల కార్యక లాపాలలో విరివిగా పాల్గొనేవారు. ఇటువంటివి నచ్చని తండ్రి కోపంతో భరద్వాజను ఇంటినుండి గెంటివేశారు. దెబ్బతిన్న ఆత్మాభిమానంతో ఊళ్ళోనే అక్కడక్కడా తిరుగుతూ, ఎవరైనా ఇంత పెడితే తిని, అరుగుల మీద పడుకొనే వారు. రోజులు గడవక పశువుల కాపరిగా, వ్యవసాయ కూలీగా, వడ్రంగి దగ్గర పనులలో చేరి పొట్ట పోసుకొనేవారు. ఆ సమయంలో ఒక చిన్న కుర్రాడు తాత దగ్గర ‘మను చరిత్ర’లోని పద్యాన్ని అప్పజెబితే, ఆ ముసలాయన ఆ కుర్రాణ్ణి మెచ్చుకుంటూ భరద్వాజను దెప్పి పొడిచాడు. దాంతో పౌరుషం పొడుచుకు వచ్చిన ఆయన పట్టుబట్టి ప్రాచీన తెలుగు సాహిత్యాన్ని బాగా అధ్యయనం చేశారు. కొన్నాళ్లకే భాషమీద పట్టు సాధించారు. పద్యాల రచనతో ఆయనలోని సృజన శక్తి పురుడు పోసుకొని పురి విప్పింది.
జీవనోపాధి కోసం భరద్వాజ 1943లో మిలటరీలో చేరి, 1945లో యుద్ధం ముగియడంతో బయటకి వచ్చారు. 1946లో నెల్లూరు వెళ్ళి అక్కడ ‘జమీన్ రైతు’ పత్రికలో చేరారు. కథలు రాయడం మొదలుపెట్టారు. అవి పత్రికల్లో అచ్చవుతూ వచ్చాయి. చలం సాహిత్యాన్ని బాగా చదవడం వల్ల తనదైన వచన రచనా శైలి ఏర్పడింది. పొట్టి శ్రీరాములు, ఎన్.జి. రంగా వంటివారితో పరిచయాలు పెరిగాయి. 1948 జూన్‌లో కాంతంతో భరద్వాజ వివాహం జరిగింది. 1949లో తెనాలి వెళ్ళి ‘జ్యోతి’, ‘రేరాణి’, ‘సినిమా’ వంటి పత్రికలలో పని చేశారు.
ఆ రోజుల్లోనే ‘కళావాణి’, ‘కొత్తచిగుళ్ళు’ కథా సంపుటాలు ప్రచురించారు. ‘కళావాణి’కి చలం పీఠిక రాయడం విశేషం. 1956లో మద్రాసు వెళ్ళి అక్కడి తెలుగు పత్రికలలో పని చేస్తూనే రచనా వ్యాసంగం కొనసాగించారు. రకరకాల వ్యక్తులు, సినిమా వాళ్ళతో పరిచయాలు పెంచుకొన్నారు. ఒకటి రెండు సినిమాలకు కథ, మాటలు రాశారు. చివరికి దానినీ వదిలి వచ్చారు. 1959లో ‘ఆకాశవాణి’లో ఉద్యోగం రావడంతో భరద్వాజ జీవితానికి స్థిరత్వం ఏర్పడింది. రేడియోలో ‘గాంధీమార్గం’ ద్వారా తెలుగువారికి చేరువయ్యారు.
కవిత్వం నుంచి బాల సాహిత్యం వరకు!
భరద్వాజ మొదట పద్యాలు, తర్వాత కొన్నాళ్లు వచన కవితలు రాసినా కథకునిగా, నవలాకారునిగానే లబ్ధ ప్రతిష్ఠులయ్యారు. జీవితం నేర్పిన పాఠాలనే రచనలుగా మలిచారు. సుమారు 186 పుస్తకాలు వెలువరించారు. 37 కథా సంపుటాలు, 17 నవలలు, బాల సాహిత్యంతో 6 నవలలు, 5 కథా సంపుటాలు, వ్యాస సంపుటాలు, జీవిత చరిత్రలు, 8 నాటకాలు, సైన్స్ ఫిక్షన్ వంటి వైజ్ఞానిక రచనలు, అపరాధ పరిశోధనా రచనలు మొదలైనవి ఒక ఎత్తయితే, భార్యను కోల్పోయాక ఆమె జ్ఞాపకాలతో సృష్టించిన ‘స్మృతి సాహిత్యం’ మరొక ఎత్తు. ‘అంతరంగిణి’, ‘ఐనా ఒక ఏకాంతం’, ‘ఐతరేయం’, ‘ఒకింత ఏకాంతం’, ‘నాలోని నీవు’ -పేరున ఐదు సంపుటాలుగా వెలువరించారు.
కథారచనలో సిద్ధహస్తుడైన భరద్వాజ కథనంలో నూతన ప్రయో గాలతో, శిల్పరీతిలో నవ్యతను సాధించారు. రిక్షా కార్మికుడు, హెూటల్ సర్వర్, పోర్టర్, బూట్ పాలిష్ చేసుకొనేవాడు మొదలైన 52 మంది అట్టడుగు వర్గాల అల్పజీవుల యదార్థ గాథలను ‘జీవన సమరం’ పేరుతో వెలువరించారు. తన జీవితంలోని చేదు అనుభవాలను, తన చుట్టూ ఉన్న సమాజంలోని బడుగు జీవితాల వెతలను కథలుగా మలచడం వల్లే ఆయన రచనలు సజీవ లక్షణాలు, వాస్తవికతలతో తొణకిసలాడుతూ ఉంటాయి.
(అ)సామాన్యునికి దక్కిన ‘జ్ఞానపీఠం’!
సాహిత్య కృషికి గుర్తింపుగా 1980 అక్టోబర్ 25న ఆంధ్ర విశ్వవిద్యాలయం ‘కళా ప్రపూర్ణ గౌరవ డాక్టరేట్’ను ప్రదానం చేసింది. 1983లో ‘జీవన సమరం’ నవలకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి, కేంద్ర సాహిత్య అకాడమి అవార్డులు లభించాయి. సోవియట్ రష్యాలో పర్యటించినపుడు రాసిన ‘యాత్రాచరిత్ర’కు 1985లో ‘సోవియట్ ల్యాండ్ నెహ్రూ’ అవార్డు దక్కింది. 1987లో జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ వారు ‘కళా ప్రవీణ’ గౌరవ డాక్టరేట్ ఇచ్చి సత్కరించారు. 1991లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం డి.లిట్ ప్రదానం చేసింది. భారతీయ భాషా పరిషత్, రాజ్యలక్ష్మీ ఫౌండేషన్, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అవార్డులు, పురస్కారాలు లభించాయి.
వెండితెర చీకటి జీవితాల గురించి రాసిన ‘పాకుడు రాళ్ళు’ నవలకు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ‘జ్ఞానపీఠ్’ పురస్కారం లభించడం విశేషం. 1965లో రాసిన ఈ నవలకు 2012లో ఈ పురస్కారం ప్రకటితమైంది. 1976లో, 1983లో రెండుసార్లు గుండెపోటుకు గురైనా కళ్ళముందే భార్యను, ఎదిగిన కొడుకులు ఇద్దరిని పోగొట్టుకొన్నారు. చివరి దశలో తీవ్ర అనారోగ్యంతో మృత్యుముఖం దాకా వెళ్లారు. 2013లో ‘జ్ఞానపీఠాన్ని’ అందుకొని, తిరిగి వచ్చిన వారం రోజులకే (అక్టోబర్ 18) తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో తెలుగు సాహిత్యలోకం అద్భుత అక్షర తపస్విని కోల్పోయింది.
డాక్టర్ టి. గౌరీశంకర్
వ్యాసకర్త విశ్రాంతాచార్యులు
సెల్: 9440969130