దాశరథి శతజయంతి ప్రత్యేకం
ఇది దాశరథి కృష్ణమాచార్య శత జయంతి సంవత్సరం. 1925 జూలై 22న ఖమ్మం జిల్లా మానుకోట తాలూకాలోని చినగూడూరులో జన్మించిన దాశరథి ఆరు పదుల వయసుకల్లా సాధించిన అక్షర అద్భుతాలు ఇన్నీ అన్నీ కావు. ‘అగ్నిధార’, ‘మహాంద్రోదయం’, ‘రుద్రవీణ’, ‘అమృతాభి షేకం’, ‘ఆలోచనాలోచనాలు’, ‘ధ్వజమెత్తిన ప్రజ’, ‘కవితా పుష్పకం’, ‘తిమి రంతో సమరం’, ‘నేత్రపర్వం’, ‘పునర్న వం’, ‘గాలిబ్ గీతాలు’, ‘నవమి’, ‘నవమంజరి’, ‘ఖబడ్దార్ చైనా’, ‘వ్యాసపీఠం’, ‘బాలలగేయాలు’, ‘జయదేవ కృత గీతగోవింద’ కావ్యం వంటి కవితా సంపుటాలుసహా ‘యాత్రాస్మృతి’ పేర్న ఆత్మకథను వెలువరించారు.
దాశరథి కేవలం కవిత్వమేకాక కొన్ని కథలూ రాశారు. ఆయన కథనాలలో కవిత్వాగ్ని జ్వాలలు సెగలు అక్షరాలకు తగులుతాయి. భావోద్వేగాలు అడుగడుగునా వెన్నెలలా పరచుకుంటాయి. 1948 నుంచి 2000 సంవత్సరం వరకు ఆయన రాసిన కథలలో ‘స్వాతి చినుకులు’, ‘సంక్రాంతి’, ‘వీణనవ్వు’, ‘మారువేషం’, ‘మహాబోధి’, ‘పూచిన మోదుగులు’, ‘తెలంగాణ అమరవీరుని రక్తాంజలి’ వున్నాయి. ఇవన్నీ అప్పటి అభ్యుదయ, తెలుగు స్వతంత్ర, ఆంధ్రప్రభ, యువ, ఆంధ్రపత్రిక వంటి వార, మాస పత్రికలలో ప్రచురితమైనాయి. 1961లో ‘ఇద్దరు మిత్రులు’ చిత్రం ద్వారా పాటల రచనకు శ్రీకారం చుట్టి, సుమారు 200కు పైగా సినిమా పాటలు రాశారు.
1977లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిని ‘ఆస్థాన కవి’గా నియమించి గొప్పగా గౌరవించింది. 1983లో ఆ పదవి రద్దు అయినందున మానసికంగా కలత చెందారు. ఇదే వారిలో అనారోగ్యానికి దారి తీసినట్టు చెప్తారు. 63 ఏళ్లు అయినా నిండకుండానే 1987 నవంబర్ 5న వారు అన్యాయంగా లోకాన్ని వదిలి వెళ్లారు. కానీ, ఆయన చెక్కిన కవితాత్మక సారస్వత శిల్పాలు, ఎదురొడ్డిన చైతన్య కిరణాలు, గర్జించిన ఉక్కు భావాలు ప్రజల నాల్కలపై ఇప్పటికీ నడయాడుతూనే ఉన్నాయి. ఆదర్శాలను చాటడమే కాదు, వాటిని నిజ జీవితంలో ఆచరించి చూపిన ఘనుడు.
చినగూడూరులో నాల్గవ తరగతిని, ఖమ్మం ఉస్మానియా ఉన్నత పాఠశాలలో మెట్రిక్యులేషన్, భోపాల్ విశ్వవిద్యాలయం నుండి ఇంటర్మీడియట్, ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఇంగ్లీషు సాహిత్యంలో బి.ఎ. చదివారు. వారసత్వంగా వచ్చిన సంస్కృతంతోపాటు ఆంగ్లం, ఉర్దూ భాషలలో టీనేజ్ వయసులోనే నిష్ణాతుడయ్యారు. చిన్నతనం నుండే ఆయనవి కమ్యూనిస్టు భావాలు. గార్ల జాగీరులో పేద ప్రజలు పడే బాధలను కళ్లారా చూసి తట్టుకోలేక పోయారు. నాటి నిజాం పాలకుల నిరంకుశత్వాన్ని సహించలేక పోయారు. ఈ కోపాగ్నే కవితాక్షరాలుగా ఉద్భవించి, జలపాతాలవలె దూకాయి.
టీనేజ్ వయసులోనే అద్భుత పద్యాలతో కవితాత్మక భావాలను వ్యక్తపరుస్తూ అనేకులను ఆశ్చర్య చకితులను చేశారు బాల దాశరథి. యుక్తవయసులో ఎదిరించి మాట్లాడ టమే తప్పయిపోయింది. ఆ కాలంలో పాలకులకు వ్యతిరేకంగా ఘాటైన కవిత్వం రాయడం పెద్ద నేరమైంది. 19 ఏళ్ల వయసులోనే తెలుగు భాషా సంస్కృతుల పునరుద్ధరణకుపాటు పడుతున్న ఆంధ్ర సారస్వత పరిషత్తు సభలలో పాల్గొని ఎలుగెత్తి కవితా గానం చేశారు. 1944లో ఓరుగల్లు కోటలో ఏర్పాటైన సభపై వేసిన పందిళ్లను రజాకార్లు తగుల పెట్టినప్పుడు, ‘జ్వాలలో ఆహుతి అయినా అవుతాం కానీ, కవి సమ్మేళనం జరపకుండా ఉండలేం’ అంటూ తోటివారికి స్ఫూర్తిగా నిలిచారు.
1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చినా తెలంగాణ ప్రజలకు నిజాం చెర వీడలేదు. ప్రజలపై రజాకార్ల ఆధ్వర్యంలో జరిగే హింసాకాండకు ఆయన హృదయం తల్లడిల్లింది. ‘నిజాం రాజు జన్మజన్మల బూజు’ అంటూ ఉద్యమస్థాయికి ఎగిసిన ఆయన సత్యాగ్రహ పోరాటాన్ని.. ఠాణాలో నిలబెట్టి కొరడా దెబ్బలు కొట్టినా విడవలేదంటే ఆయన నిబద్ధతను అర్థం చేసుకోవచ్చు. గార్లలో ఆయనను అరెస్టు చేసిన తర్వాత మొత్తం 16 నెలలు కఠిన కారాగార శిక్ష విధించారు. ఆయన తాను ఎదుర్కొన్న అనుభవాలనే అక్షరబద్ధం చేశారు. అవే కవితా సింహాలై గర్జించాయి. ఒళ్లు గగుర్పొడిచే పాటలుగా మారుమోగాయి. దాశరథిని మామూలు మహాకవిగా మాత్రమే అనుకొంటే అది పొరపాటే అవుతుంది. యావత్ జీవితాన్నే ప్రజల స్వేచ్ఛా జీవితం కోసం ధారపోసిన మహోన్నత ఆదర్శ సాహితీమూర్తిగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు.
దోర్బల