09-04-2025 12:00:00 AM
యువ కథానాయకుడు అక్కినేని అఖిల్ తన ఆరో సినిమాను ప్రకటించాడు. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మాతలు. ‘వినరో భాగ్యము విష్ణు కథ’ ఫేమ్ మురళీకిశోర్ అబ్బూరు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మంగళవారం అక్కినేని అఖిల్ పుట్టిన రోజు.
ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమాకు ‘లెనిన్’ అనే టైటిల్‌ను ప్రకటించారు. ‘ప్రేమ కన్నా ఏ యుద్ధం హింసాత్మకమైనది కాదు’ అనేది ఉపశీర్షిక. జీవితంలో ప్రేమకున్న ప్రాధాన్యతను సంపూర్ణంగా చెప్పే కథతో ఈ సినిమా రూపొందుతోందని ట్యాగ్‌లైన్ ద్వారా తెలుస్తోంది. రాయలసీమ గ్రామీణ నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది.
ఆధ్యాత్మిక అంశాలను చొప్పిస్తూ ఆద్యంతం ఆకట్టుకునే ప్రయత్నం చేశారు మేకర్స్. గ్లింప్స్‌లో అఖిల్ గుబురు మీసం, పొడవాటి జుట్టుతో సరికొత్త అవతారంలో కనిపించాడు. ఇందులో అఖిల్ సరసన శ్రీలీల నటిస్తున్నట్టు గ్లింప్స్‌లో రివీల్ అయింది. ‘పుట్టేటప్పుడు ఊపిరి ఉంటుంది రా, పేరు ఉండదు..
పోయేటప్పుడు ఊపిరి ఉండదు, పేరు మాత్రమే ఉంటుంది’ అంటూ రాయలసీమ యాసలో అఖిల్ చెప్పిన డైలాగ్.. ఈ సినిమాలో భావోద్వేగాలు ఏ స్థాయిలో ఉంటాయో చెప్పకనే చెప్పింది. నవీన్‌కుమార్ సినిమాటోగ్రాఫర్‌గా, తమన్ సంగీత దర్శకుడిగా, నవీన్ నూలి ఎడిటర్‌గా పనిచేస్తున్న ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో ప్రకటించనున్నారు.