ప్రొవిడెన్స్: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన వెస్టిండీస్.. టీ20 ప్రపంచకప్‌లో రెండో విజయం ఖాతాలో వేసుకుంది. గ్రూప్ భాగంగా జరిగిన పోరులో వెస్టిండీస్ 134 పరుగుల తేడాతో ఉగాండాను చిత్తుచేసింది. విండీస్ బౌలర్ అకీల్ హుసేన్ (5/11) ధాటికి ఉగాండా ప్రపంచకప్ చరిత్రలో అత్యల్ప స్కోరు (39) నమోదు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. చార్లెస్ (44; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), రస్సెల్ (30; 6 ఫోర్లు) రాణించారు. పూరన్ (22; 3 సిక్సర్లు), పావెల్ (23), రూథర్‌ఫోర్డ్ (22) తలా కొన్ని పరుగులు చేశారు. అనంతరం లక్ష్యఛేదనలో ఉగాండా 12 ఓవర్లలో 39 పరుగులకు ఆలౌటైంది. జుమా మియాగి (13) ఒక్కడే రెండంకెల స్కోరు చేయగా.. అకీల్ హుసేన్ ధాటికి మిగిలినవాళ్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. కరీబియన్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్ రెండు వికెట్లు పడగొట్టాడు. అకీల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించిన విండీస్.. గ్రూప్‌లో రెండో స్థానంలో కొనసాగుతోంది.