calender_icon.png 4 October, 2024 | 4:53 AM

శరవేగంగా ఏకేబీఆర్ ఎత్తిపోతల పనులు

04-10-2024 12:22:11 AM

కొనసాగుతున్న పంపుహౌస్ పైపులైన్ల ఏర్పాటు

అండర్ ్రగ్రౌండ్ పైపులైన్ల ఏర్పాటుకు అడ్డంకిగా భూసేకరణ

అధిక పరిహారం ఆశిస్తున్న రైతులు 

త్వరలో రైతులతో సమావేశానికి అధికారుల కసరత్తు 

నల్లగొండ, అక్టోబర్ ౩ (విజయక్రాంతి) : అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (ఏకేబీఆర్) ఎత్తిపోతల పనులు శరవేగంగా జరు గుతున్నాయి. పథకంలో ప్రధానమైన పంపుహౌస్ పైపులైన్ల ఏర్పాటు పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి.

ఇప్పటికే అవసరమైన మోటార్లతోపాటు పైపులైన్లను ప్రాజెక్టు వద్దకు చేర్చి పనులకు ఆటంకం లేకుండా నీటిపారుదల అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. వచ్చే ఏడాది నాటికి పనులు పూర్తి చేసి దేవరకొండ నియోజకవర్గంలోని పీఏపల్లి, నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని గుర్రంపోడు మండలాల్లోని పలు గ్రామాల్లో 7 వేల ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఎత్తిపోతల స్వరూపం ఇలా 

2021లో నాగార్జునసాగర్ ఉప ఎన్నికల సమయంలో నాటి సీఎం కేసీఆర్ దేవరకొండ నియోజకవర్గంలోని పొగిళ్ల, అంబా భవాని, కంబాలపల్లి, పెద్దగ ట్టు, పెద్దమునిగల్, ఏకేబీఆర్ ఎత్తిపోతలను చేపడుతున్నట్టు ప్రకటించారు. వీటికి రూ.585 కోట్లతో పాలనా అనుమతులు మంజూరుచేశారు.

ఈ ఎత్తిపోతల్లో ఒకటైన ఏకేబీఆర్ నిర్మాణానికి రూ.90.96 కోట్లు కేటాయించారు. 2022లో పనులు ప్రారంభంకాగా ఏడాదిన్నరలో పూర్తయ్యేలా లక్ష్యం పెట్టుకున్నారు. కానీ, డ్రాయింగ్ అనుమతులు, భూ సేకరణలో జాప్యం కారణంగా పనులు కొంత ఆలస్యమయ్యాయి. 

పైపులైన్ల ఏర్పాటుకు సమస్యగా భూసేకరణ 

ఏకేబీఆర్ ఎత్తిపోతల పథకానికి భూసేకరణ ప్రధాన సమస్యగా పరిణమించింది. అండర్‌గ్రౌండ్ పైపులైన్ల ఏర్పాటు కు భూసేకరణ చేయాల్సి ఉంది. ఇందుకు 7 ఎకరాలకుపైగా అవసరం ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే ప్రాథమిక సర్వే.. పేపర్ నోటిఫికేషన్ పూర్తి చేశారు. కానీ పరిహారం చెల్లింపు విషయం లో ఏకాభిప్రాయం కుదరడం లేదు.

గతం లో అధికారులు సమావేశం నిర్వహించగా రైతులు ఎకరానికి రూ. 20 లక్షలు డిమాండ్ చేయడంతో ఏం చేయాలో తెలియక ఈ విషయాన్ని పక్కన పెట్టారు. ప్రస్తుతం పనులు జరుగుతుండడంతో ఈ విషయం మళ్లీ తెరపైకి వచ్చింది. త్వరలో మరోసారి రైతులతో సమావేశం నిర్వహించి పరిహారం ఎంత చెల్లించాలన్న దానిపై చర్చింనున్నట్టు తెలుస్తున్నది. 

పాత పీఏపల్లిలో పంపుహౌస్ నిర్మాణం 

ఏఎమ్మాఆర్పీలో భాగమైన ఏకేబీఆర్‌లో 245 అడుగుల (పుల్ రిజర్వాయర్ లెవల్) వరకు 1.5 టీఎంసీల నీటిని నిల్వ చేయొచ్చు. ఏకేబీఆర్ నిర్మాణంలో పాత పీఏపల్లి మునిగిపోయింది. ప్రస్తుతం నీటిని ఎత్తిపోసేందుకు రిజర్వాయర్ పక్కనే పంపు హౌస్‌ను నిర్మిస్తున్నారు. ఈ పంపు హౌస్‌లో 0.35 మెగావాట్ల సామర్థ్యం కలిగి ఒక్కోటి 16 క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేసే 5 మోటార్లను అమర్చుతున్నారు.