calender_icon.png 8 October, 2024 | 6:00 AM

టెకీలకు ఆకర్ష్!

08-10-2024 03:09:20 AM

ఐటీ ప్రొఫెషనల్స్‌కు గమ్యస్థానంగా తెలంగాణ

పీటీబీలో దేశంలోనే మూడోస్థానం

హైదరాబాద్ పరిసరాల్లో 18.7 లక్షల ఐటీ నిపుణులు

ఎక్స్‌ఫినో రూపొందించిన రిపోర్ట్‌లో ఆసక్తికర విషయాలు వెల్లడి

కొడవలికంటి నవీన్ :

హైదరాబాద్, అక్టోబర్ ౭ (విజయక్రాంతి): ఐటీ నిపుణులకు తెలంగాణ గమ్య స్థానంగా మారింది. ప్రొఫెషన్ ఉద్యోగార్థులను ఆకర్షించడంలో దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది. బెంగళూరుకు చెందిన స్పెషలిస్ట్ స్టాఫింగ్ కంపెనీ ఎక్స్‌ఫినో సంస్థ తన నివేదికలో ఈ విషయాలను వెల్లడించింది.

గతేడాది సెప్టెంబర్‌లో మొదటి నివేది కను విడుదల చేసిన సంస్థ.. తాజాగా బిల్డింగ్ అండ్ సస్టునింగ్ ఏ టాలెంట్ పాజిటివ్ తెలంగాణ పేరుతో రెండో వార్షిక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికలో ఐటీ రంగ నిపుణులను ఆకర్షించడంలో తెలంగాణ దూసుకుపోతోందని పేర్కొన్నది. గతేడాదితో పోలిస్తే పాజిటివ్ టాలెంట్ బ్యాలెన్స్(పీటీబీ)ని తెలంగాణ మూడు రెట్లు పెంచుకు న్నట్లు వివరించింది.

దేశంలో తొమ్మిది రాష్ట్రాల్లో పీటీబీ స్థిరంగా ఉండగా అందులో తెలంగాణ మూడో స్థానంలో నిలిచినట్లు నివేదిక చెప్పింది. ప్రతిభను ఆకర్షించడం, ప్రతిభావంతులను నిలుపుకోవడం ఆధారంగా ఈ నివేదికను తయారు చేశారు.  2023సెప్టెంబర్ కాల వ్యవధితో ఎక్స్‌ఫినో సంస్థ తన నివేదికను తయారుచేసింది. గత 12 నెలల్లో దేశంలోని రాష్ట్రాలను రెండు గ్రేడ్లుగా ఎంపిక చేసింది.

పనిచేసేందుకు వచ్చే నిపుణుల కంటే.. తరలిపోయే వారు తక్కువ ఉండటాన్ని పాజిటివ్ టాలెంట్ బ్యాలెన్స్(పీటీబీ) గ్రేడ్‌గా చెప్పింది. ఈ గ్రేడ్‌లో తొమ్మిది రాష్ట్రాలు ఉంటే.. తెలంగాణ మూడో స్థానంలో ఉంది. గత 12 నెలల్లో తెలంగాణ దాదాపు 61,600 ఐటీ నిపుణులను ఆకర్షించింది. 41,400 మందిని కోల్పోయింది.

అంతేకాకుండా, గతేడాది పీటీబీ 6,000 వేలు ఉంటే.. ఈ సారి మాత్రం ఏకంగా 20,200కు పెరిగింది. అంటే మూడు రేట్లు పెరిగింది. మొదటి, రెండు స్థానాల్లో కర్ణాటక, హర్యానా ఉన్నాయి. వచ్చే నిపుణుల కంటే.. తరలిపోయే వారు ఎక్కువగా ఉండటాన్ని నెగిటివ్ టాలెంట్ బ్యాలెన్స్(ఎన్‌టీబీ)గా అభివర్ణించింది. ఈ గ్రేడ్‌లో ఆంధ్రప్రదేశ్ ఉండటం గమనార్హం.

చలో తెలంగాణ!

నైపుణ్యం కలిగిన ప్రతిభను ఆకర్షించడానికి దేశంలోని రాష్ట్రాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ ప్రయత్నాల్లో మాత్రం తెలంగాణ దూసుకుపోతున్నది. తెలంగాణలో అన్ని రంగాల్లో కలిపి వైట్ కాలర్ నిపుణులు 48 లక్షల వరకు ఉన్నట్లు నివేదిక పేర్కొంది. ఇందులో అనుభవజ్ఞులు 20.98 లక్షల మంది ఉన్నట్లు వెల్లడించింది.

వీరిలో దాదాపు 18.7 లక్షల మంది హైదరాబాద్, దాని చుట్టుపక్కల జిల్లాల్లో పని చేస్తున్నారని విశ్లేషించింది. అంతేకాకుండా, ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలో పని చేసేందుకు అనేక మంది ఆసక్తి చూపిస్తున్నారని పేర్కొంది. దాదాపు 21 లక్షల మంది వైట్ కాలర్ ఉద్యోగార్థులు పనికోసం తెలంగాణకు మకాం మార్చాలనుకుంటున్నట్లు నివేదిక ఉటంకించింది.

ఇందులో బెంగళూరు నుంచి దాదాపు 4.40లక్షల మంది ఉన్నట్లు చెప్పింది. ఈ ఊపు ఇలాగే కొనసాగితే.. ప్రతిభకు ప్రపంచస్థాయిలో తెలంగాణ గమ్యస్థానంగా మారడానికి ఎంతో సమయం పట్టదని ఎక్స్‌ఫినో సంస్థ పేర్కొంది. 

ఆకర్షణకు కారణాలు ఇవే..

గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ల(జీసీసీ)ను ఆకర్షించడంపై తెలంగాణ సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. భవిష్యత్ అంతా జీసీసీలదే అన్న ఉద్ధేశంతో ప్రముఖ ఎంఎన్‌ఎసీలు తమ జీసీసీలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేలా ప్రభుత్వం ప్రయత్నించి ఫలితాలను సాధిస్తోంది. అలాగే, నిపుణులు ఎక్కువగా ఉంటే వ్యాపార కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతాయి.

మానవ వనరుల ఆధారంగానే వ్యాపారాలు, పెట్టుబడులు తరలివస్తాయన్న ఉద్దేశంతో మౌలిక సదుపాయాల కల్పన, ప్రగతిశీల విధానాలు, వ్యాపార ప్రోత్సాహాకాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. దీంతో ఇక్కడికి పరిశ్రమలు వస్తున్నాయి. ఫలితంగా ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతున్నాయి.

ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉన్న చోటకే నిపుణులు కూడా వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తారు. ఈ క్రమంలో తెలంగాణలో అవకాశాలు పెరుగుతున్నందున ఐటీ నిపుణులు ఇక్కడికి వచ్చేందుకు ఆసక్తిని చూపిస్తున్నట్లు నివేదిక వివరించింది.