ప్రముఖ ప్రార్థనా స్థలం అజ్మీర్ దర్గాపై వివాదం తలెత్తింది. సూఫీ సన్యాసి ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తీ స్మృత్యర్థం మొగలాయి చక్రవర్తి హుమయూన్ హయాంలో నిర్మించిన ఈ దర్గా ఒకప్పుడు శివాలయమంటూ రాజస్థాన్ కోర్టులో పిటిషన్ వేశారు. దర్గాను ‘ సంకట్‌మోచన్ మహదేవ్ ఆలయం’గా ప్రకటించాలని, ఈ స్థలంలో హిందువుల పూజలకు అనుమతించాలంటూ హిందూసేన చీఫ్ విష్ణుగుప్తా ఆ పిటిషన్‌లో కోరారు. సెప్టెంబర్‌లో దాఖలయిన ఈ పిటిషన్‌ను విచారించిన అజ్మీర్ కోర్టు పురావస్తు పరిశోధనా సంస్థ (ఏఎస్‌ఐ), కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ, దర్గా కమిటీలకు నోటీసులు జారీ చేసింది. ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా ముస్లింలను ఆందోళనకు గురి చేస్తోంది. రిటైర్డ్ న్యాయమూర్తి హర్‌విలాస్ సర్దా 1911లో అజ్మీర్‌పై రాసిన పుస్తకంలో పేర్కొన్న కొన్ని విషయాలను విష్ణుగుప్తా తన పిటిషన్‌లో ప్రస్తావించారు.‘ప్రాచీన శివాలయం శిధిలాలను అజ్మీర్ దర్గా నిర్మాణానికి వాడుకున్నారు.
దర్గా ప్రధాన ప్రదేశం కింద జైన ఆలయం ఉంది’ అన్న ఆ పుస్తకంలోని అంశాలను సైతం ప్రస్తావించడం గమనార్హం. అయితే ఈ ఆరోపణలను అజ్మీర్ దర్గా కమిటీ తోసిపుచ్చింది. మతసామరస్యానికి చిహ్నంగా ఈ దర్గా ఉందని, కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద ఇది ఉందని, ఏఎస్‌ఐకి దీనితో ఎలాంటి సంబంధం లేదని అజ్మీర్ దర్గా వ్యవహారాలను చూసే అంజుమన్ కార్యదర్శి సయ్యద్ సర్వార్ చిష్తీ అన్నారు. 800 ఏళ్లకు పైగా దర్గా ఉందని, ఏటా కొన్ని లక్షల మంది దర్గాను సందర్శిస్తున్నారని, ఎప్పుడూ ఎలాంటి వివాదం తలెత్తలేదన్నారు.
కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి పిటిషన్లు వేయడం పరిపాటి అయిందని, జ్ఞానవాపి మసీదు విషయంలోనూ ఇదే జరిగిందని, దీనికి ఫుల్‌స్టాప్ పెట్టాలని ఆయన అన్నారు. నెహ్రూ హయాంనుంచి దర్గా ఉర్సు సమయంలో ప్రధానులు ‘చాదర్’ను సమర్పించే సంప్రదాయం కొనసాగుతోందని, ప్రధాని మోదీ సైతం దీన్ని కొనసాగించారని రాజస్థాన్ ముస్లిం నేత ముజఫర్ భార్తి గుర్తు చేశారు.1947 ఆగస్టు 15కు ముందున్న మత ప్రదేశాలపై ఎలాంటి వివాదాలను లేవనెత్తరాదంటున్న 1991నాటి చట్టానికి ఇది వ్యతిరేకమని, ఈధోరణి దేశానికి మంచిది కాదని తాను పదేపదే చెప్తున్నానని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా మండిపడ్డారు. కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ సైతం ఇదే విషయాన్ని గుర్తు చేశారు.
జ్ఞానవాపి మసీదు విషయంలో సర్వేకు సుప్రీంకోర్టు అనుమతించడంతో ఈ ధోరణి పెరిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా అజ్మీర్ దర్గా ఉన్న ప్రదేశంలో శివాలయం ఉందంటూ జరుగుతున్న వాదనలపై ప్రముఖ న్యాయవాది, రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ దేశాన్ని మనం ఎక్కడికి తీసుకెళ్తున్నామని ‘ఎక్స్’ వేదికగా ప్రశ్నించిన ఆయన రాజకీయ లబ్ధి కోసమే ఇదంతా జరుగుతోందన్నారు.
అయితే హిందూ సంఘాల నేతల వాదన వేరుగా ఉంది. దేశంలోని మసీదుల్లో అధిక భాగం హిందూ అలయాలను కూల్చి నిర్మించినవేననేది వారి వాదన. అయోధ్యలో రామమందిరం బాబ్రీ మసీదు వివాదం దేశవ్యాప్తంగా ఎంతటి ఉద్రిక్తతలకు దారి తీసిందో అందరికీ తెలిసిందే. అయితే సుదీర్ఘ కాలం సాగిన ఆ వివాదం సుప్రీంకోర్టు తీర్పుతో సద్దుమణిగింది. కోర్టు తీర్పును ముస్లింలు హుందాగా అంగీకరించారు కూడా.
ఇకపై ఇలాంటి వివాదాలు తలెత్తవని తామంతా భావించామని, అయితే ఇప్పడు ఎక్కువయ్యాయనేది వారి ఆవేదన. ప్రపంచవ్యాప్తంగా అనేక దండయాత్రలు, యుద్ధాలు జరిగాయి. ఫలితంగా కొన్ని సంఘటనలూ చోటు చేసుకున్నాయి. అయితే అవి ఇప్పటికీ చరిత్ర జ్ఞాపకాలుగా మిగిలి ఉన్నాయి. మరి మన దేశంలో మాత్రం చరిత్రను తిరగరాయాలనుకోవడం మంచిదా? ఈ వివాదాలు కొనసాగాల్సిందేనా? శాశ్వత పరిష్కారం కనుగొనేలా పార్లమెంటు చట్టం చేయలేదా? అని మేధావులే కాదు, సామాన్యులు సైతం ప్రశ్నిస్తున్నారు.