01-03-2025 07:41:44 PM
బాన్సువాడ,(విజయక్రాంతి): ఏఐటీయూసీ ఆధ్వర్యంలో తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా రెండవ మహాసభ శనివారం బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రిలోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు దుబాస్ రాములు(AITUC District Vice President Dubas Ramulu) అధ్యక్షత వహించారు. ఈ మహాసభకు ముఖ్య అతిథులుగా ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎండి యూసుఫ్ హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వేలాదిమంది కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ పద్ధతుల్లో శానిటేషన్, పేషంట్ కేర్ ,సెక్యూరిటీ విభాగాల్లో పని చేస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వం ఇచ్చిన జీవో 60 ద్వారా కార్మికులకు కనీస వేతనాలు అమలు గాకుండా, పీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయకుండా కాంట్రాక్టర్లు జేబులు నింపే ప్రయత్నం గత ప్రభుత్వం చేసిందని, ప్రస్తుత ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా కార్మికుల వేతనాలు పెంచుకోవడంతో పాటు కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ విధానం రద్దు కోసం ఏఐటీయూసీ పోరాటానికి సిద్ధమవుతుందని ఆ పోరాటంలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనడానికి సన్నద్ధం చేయడం కోసం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలు పర్యటన చేస్తూ సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. కామారెడ్డి జిల్లా కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వై.ఓమయ్య మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని పోరాడుతున్న నేపథ్యంలో మోడీ ప్రభుత్వం మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చిన్నంగా కార్మికులు పోరాడి సాధించుకున్న 29 చట్టాలను రద్దుచేసి కార్మిక వ్యతిరేక. నాలుగు కోడ్ లను ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలు చేయించడానికి ప్రయత్నం చేస్తున్నదని రాష్ట్ర ప్రభుత్వం ఖరాఖండిగా కార్మిక వ్యతిరేక విధానాలు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయమని మోడీ ప్రభుత్వానికి హెచ్చరిక చెయ్యాలని పిలుపునిచ్చారు. 8 గంటల పని విధానం అమలవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో 12 గంటలు పని విధానాన్ని అమలు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం అనుకుంటుందని, ఈ నేపథ్యంలో మార్చి రెండో వారం నుంచి ఏఐటీయూసీ నిర్వహించే కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ మహాసభలో మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి హసీనా బెగం, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బాల్రాజ్, సిపిఐ జిల్లా కార్యదర్శి దశరథ్, ఏఐటీయూసీ డివిజన్ కార్యదర్శి డి .శంకర్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు రేణుక, సంతోష్ గౌడ్, కమర్ అలీ, శ్రీనివాస్, సురేఖ ,సంగీత, రజియా బేగం, ధనుంజయ్, ఎం గంగారం, సుశీల వివిధ ఏరియా ఆసుపత్రుల కార్మికులు తదితరులు పాల్గొన్నారు.