calender_icon.png 19 April, 2025 | 11:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేటకు వాయు కాలుష్య భయం

10-04-2025 02:28:12 AM

  1. జిల్లా కేంద్రంలో పెరుగుతున్న వాయు కాలుష్యం

అధ్వాన రహదారులతో దుమ్ము ఎగసిపడుతున్న వైనం

శ్వాసకోశ వ్యాధులతో పట్టణవాసులు సతమతం

సూర్యాపేట,ఏప్రిల్9(విజయక్రాంతి):  జిల్లాకేంద్రంలో ప్రజలు దుమ్ము, ధూళితో సహవాసం చేయాల్సి వస్తోంది. ఇంటి నుంచి బయటకెళ్తే ఒళ్లంతా దుమ్ముతో తిరిగి వచ్చే పరిస్థితి నెలకొంది . దుమ్ము, దూళితో వాయు కాలుష్యం అధికం కావడంతో రహదారుల వెంట వచ్చేందుకు ప్రజలు జంకుతున్నారు. ప్రధాన రహదారుల్లో వస్తున్న దుమ్ము, ధూళి వాహనదారులకు ప్రాణ సంకటంగా మారుతుంది.

దుమ్ము, ధూళి కారణంగా చిరు వ్యాపారులు, రోడ్ల పక్కనే వ్యాపారాలు సాగిస్తున్న వారు, తినుబండారాలు, ఆహార పదార్థాలు, ఇతరత్రా దుకాణదారులు, అవసరాల నిమిత్తం పట్టణ అంతర్గత వివిధ వీధుల నుంచి, గ్రామాల నుంచి వస్తున్న ప్రజల నోట్లోకి దుమ్ము పోయి అవస్థలు పడుతున్నారు.

ప్రధాన సమస్యగా మారి .. 

జిల్లాకేంద్రంలో రోజురోజుకు వాయు కాలుష్యం విపరీతంగా పెరగడంతో ప్రజలు అనేక వ్యాధుల బారినపడి ఆస్పత్రుల పాలవుతున్నారు. ప్రజలు వాడే వాహనాల నుంచి వచ్చే కాలుష్యమే  కాకుండా... దుమ్ము కూడా ప్రధాన పాత్ర పోషిస్తూ వాయు కాలుష్యానికి కారణమవుతున్నది. జిల్లా కేంద్రంలో నెలల తరబడి గాలిలో ఉండాల్సిన దుమ్ము శాతం కంటే వందల రెట్లు ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.

ఈ దుమ్ము రోడ్లపై తిరిగే ప్రతి వ్యక్తి ఊపిరితిత్తుల్లోకి చేరి ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడేలా చేస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నిబంధనల ప్రకారం ప్రజలు ఉండే ప్రాంతంలో గాలిలో దుమ్ము శాతం 10 మైక్రాన్ల నుంచి 50 మైక్రాన్స్ లోపు మాత్రమే ఉండాలి .

అయితే జిల్లా కేంద్రంలో గాలిలో దుమ్ము శాతం ఉహించని విధంగా 200 మైక్రాన్ల స్థాయికి చేరిందని నిపుణులు చెబుతున్నారు . ఇదే స్థాయిలో ఉంటే రోడ్డుపై నడిచే, వాహనాలపై వెళ్లే ప్రతి వ్యక్తి వ్యాధుల బారిన పడాల్సి వస్తోందని హెచ్చరిస్తున్నారు .

నివారణ చర్యలు శూన్యం..

రోజురోజుకు విస్తరిస్తున్న జిల్లా కేంద్రంలో వాయు కాలుష్య నివారణ చర్యలు శూన్యం అని చెప్పవచ్చు.  రోడ్లపై పెరుకున్న దుమ్మ దూళిని శుద్ది చేయడంలో అధికారులు విఫలం చెదుతున్నారనే విమర్శలు ఉన్నాయి. మున్సిపాలిటీ అధికారులు వాటర్ ట్యాంక్ ద్వారా రహదారులపై నీళ్లు  చల్లి దుమ్ము లేవకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.