ఢిల్లీలో ఆ స్థాయిలో వాయుకాలుష్యం
429గా నమోదైన ఏయిర్ క్వాలిటీ ఇండెక్స్
న్యూఢిల్లీ, నవంబర్ 15: దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం తీవ్రస్థాయికి చేరుకుంది. శుక్రవారం ఉదయం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (వాయునాణ్యత సూచీ) 429గా నమోదైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడి గాలిని పీల్చేవారు రోజుకు 25 నుంచి 30 సిగరెట్లు తాగినవారితో సమానమని.. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉన్నవారికి ఇది విషతుల్యమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే ఇక్కడి గాలి పీల్చేవారిలో ఆయుర్ధాయం తగ్గడంతో పాటు క్యాన్సర్ సోకే ప్రమాదం పొంచిఉందని చికాగో యూనివర్సిటీ ఓ నివేదికలో వెల్లడించింది.
జహంగీర్‌పురి, బవానా, వజీర్‌పూర్, రోహిణిలో వరుసగా ఏక్యూఐ స్థాయిలు 458, 455, 455, 452గా నమోదయ్యాయి. ఈ క్రమంలో కాలుష్య కట్టడి చర్యల్లో భాగంగా ఢిల్లీ పరిధిలో ‘గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ ని అమలు చేస్తున్నట్లు ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ ప్రకటించింది. దీని ప్రకారం తక్షణమే ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. తదుపరి నోటీసులు వచ్చే వరకు పదోతరగతి వరకు పిల్లలకు ఆన్‌లైన్ క్లాస్‌లు బోధించాలని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది.
దీని ప్రకారం శుక్రవారం నుంచి ప్రైవరీ విద్యార్థులకు ఆన్‌లైన్ ద్వారా బోధన షురూ అయిపోయింది. గత రెండ్రోజులుగా ప్రతికూల వాతావరణ పరిస్థుతుల కారణంగా దాదాపు 300 విమాన సర్వీసులు ఆలస్యమైనట్లు అధికారులు తెలిపారు.