న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం నిండిపోయింది. కాలుష్య తీవ్రత నేపథ్యంలో స్టేజ్-3 చర్యలకు ప్రభుత్వం చేపట్టింది. కాలుష్యం ప్రమాదకర స్థాయిల కారణంగా, తదుపరి ఆదేశాల వరకు ప్రాథమిక పాఠశాలలకు భౌతిక తరగతులు నిర్వహించబడవని, అయితే ఆన్‌లైన్ తరగతులను కొనసాగించవచ్చని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది.
ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR)లో ప్రమాదకర వాయు కాలుష్య స్థాయిలకు ప్రతిస్పందనగా, గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) 3వ దశ నవంబర్ 15 ఉదయం 8 గంటల నుండి అమలు చేయబడింది. ఢిల్లీలోని నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్‌లతో సహా జాతీయ రాజధాని ప్రాంతాన్ని మరోసారి పొగమంచు దట్టంగా కప్పేసింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) డేటా ప్రకారం, ఢిల్లీలోని ఆనంద్ విహార్‌లో గురువారం ఉదయం 6 గంటలకు AQI 441 గా ఉంది. బవానా (455), ద్వారకా సెక్టార్ 8 (444), జహంగీరూరి (458) ఢిల్లీలో అధ్వాన్నమైన గాలి నాణ్యతను నమోదు చేసిన కొన్ని ప్రాంతాలు. గాలి నాణ్యత 400 దాటింది, ఇది తీవ్రమైన కేటగిరీ కిందకు వస్తుందని అధికారులు తెలిపారు.