calender_icon.png 25 October, 2024 | 3:59 AM

ప్రమాదకరంగా ఢిల్లీలో కాలుష్యం

25-10-2024 01:52:37 AM

గరిష్ఠ స్థాయికి చేరిన ఏక్యూఐ 

కాలుష్యం కారణంగా మార్నింగ్ వాక్‌కు సీజేఐ గుడ్‌బై

న్యూఢిల్లీ, అక్టోబర్ 24: దేశ రాజధానిలో కాలుష్యం కోరలు చాస్తోంది. ఢిల్లీలో చాలా ప్రాంతాల్లో గురువారం ఉదయం సగటున ఎయిర్ క్యాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) విలువ 330గా చూపించినట్లు అధికారులు వెల్లడించారు. అత్యధికంగా ఆనంద్ విహార్‌లో 392 నమోదైంది. అశోక్ విహార్, ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్ట్, ఐటీఓ ఢిల్లీ, ఆర్కే పురం, ఓక్లా ఫేజ్ ద్వారకా సెక్టార్ ప్రాంతాల్లో 300కుపైగా ఏక్యూఐ నమోదైనట్లు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వెల్లడించింది. ఏక్యూఐ విలువ 100 దాటితేనే కాలుష్యం తీవ్రస్థాయిలో ఉన్నట్లు గుర్తిస్తారు. అటువంటిది ఢిల్లీలో 300కుపైగా కాలుష్యం నమోదవుతుండటం గమనార్హం. 

మార్నింగ్ వాక్ మానేశా: సీజేఐ

ఢిల్లీలో కాలుష్యంపై సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వాయుకాలుష్యం పెరుగుతున్న కారణంగా తాను మార్నింగ్ వాక్‌కు వెళ్లడం మానేశానని పేర్కొన్నారు. ఇటీవల ఆయన సహచర న్యాయ మూర్తులతో పాటు జర్నలిస్టులతో అనధికారికంగా మాట్లాడుతూ.. నగరంలో పెరుగుతోన్న కాలుష్యం గురించి ఆందోళన వ్యక్తం చేశారు. గాలి నాణ్యత సరిగా లేకపోవడం వల్ల శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశం ఉండ టం వల్ల మార్నింగ్ వాక్‌లకు దూరంగా ఉండాలని తన వైద్యుడు సూచించినట్లు పేర్కొన్నారు.