అయినప్పటికీ వర్షాలు కురిసే అవకాశం
బెంగాల్, ఒడిశా వైపు వాయుగుండం
హైదరాబాద్, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): తెలుగు రాష్ట్రాలకు వాయుగుండం ముప్పు తప్పినట్లేనని వాతావరణశాఖ వెల్లడించింది. అయినప్పటికీ పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం రెండుమూడు రోజుల్లో వాయుగుండంగా మారి తీవ్రతరం కానుందని తెలిపింది. అయితే ఆ వాయుగుండం వాయువ్యంగా పయనిస్తూ బెంగాల్, ఉత్తర ఒడిశా తీరాలకు తాకనుందని పేర్కొంది.
దీంతో తెలుగు రాష్ట్రాలకు వాయుగుండం ప్రమాదం తప్పినట్లయింది. కానీ ఈనెల 10వ తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, ఆదిలాబాద్, మంచిర్యాల, కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్, నల్గొండతోపాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతోకూడిన తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.