calender_icon.png 21 October, 2024 | 4:38 PM

ఏపీలో వాయుగుండం బీభత్సం

18-10-2024 01:30:51 AM

  1. పలు జిల్లాల్లో భారీగా కురుస్తున్న వర్షాలు
  2. విశాఖ, కాకినాడ తీరాల్లో ఎగిసి పడుతున్న అలలు
  3. పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

విశాఖపట్నం, అక్టోబర్ 17: వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, తూర్పుగోదావరి, విశాఖ జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాలోని అన్ని చోట్ల జనజీవనం స్తంభించిపోయింది.

తిరుపతి జిల్లా తడ వద్ద వాయుగుండం తీరాన్ని దాటినట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. 22 కిలోమీటర్ల వేగంతో కదిలి తీరాన్ని తాకిన అనంతరం అల్పపీడనంగా బలహీనపడినట్లు పేర్కొంది. ఈ ప్రభావంతో రాష్ట్రంలోని పలు తీర ప్రాంతాలు, రాయలసీమ జిల్లాలతో పాటు ఉత్తర తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

సముద్ర తీరానికి సమీపంలో ఉండే విశాఖపట్నం, కాకినాడ తదితర తీర ప్రాంతాల్లో పెద్దఎత్తున సముద్ర అలలు ఎగసిపడుతున్నాయి. విశాఖలోని ఆర్కే బీచ్ వద్ద అలలు దుకాణాలను తాకుతుండగా, పెద్దగంట్యాడ మండలం కొంగపాలెంలో వర్షం బీభత్సానికి రేకుల షెడ్డు కూలి ఓ వ్యక్తి తీవ్రగా యాల య్యాయి.

కోనసీమ జిల్లాలోని అల్లవరం మండలం ఓడలరేవు తీరంలో అలలు ఉద్ధృతంగా ఎగసిపడుతున్నాయి. ఓఎన్‌జీసీ ప్లాంట్‌ను సముద్రపు నీరు తాకింది. కాకినాడ జిల్లాలోని ఉప్పాడ తీరంలో సము ద్రం అల్లకల్లోలంగా మారింది. రాకాసి అలలతో కొత్తపల్లి మండలంలో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొ రిగాయి. అంతర్వేది తీరంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. గోదావరి సంగమం వద్ద అలలు ఎగిసిపడుతున్నాయి. 

జలాశయాలకు వరద..

వైఎస్సార్ జిల్లా గండికోట జలాశయం, మైలవరం జలాశయాలకు వరద నీరు వచ్చి చేరుతుంది. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిండుకుండలా మారింది. పైడిపాలెం, వామికొండ, సర్వారాయ సాగర్ జలాశయాలకు వరద చేరింది. నెల్లూరు నగర శివారులోని ఆటోనగర్, చంద్రబాబు నగర్, తల్పగిరి కాలనీ, జొన్నవాడ రోడ్డు, పొట్టెపాలం కలుజు ప్రాంతాల్లో వర్షం కారణంగా రోడ్లపై నీరు నిలించింది. శ్రీసత్యసాయి జిల్లా సీకే పల్లి మండలం వెల్దుర్తి సమీపంలో చిత్రావతి నది ఉద్ధృతంగా ప్రవహించడంతో వెల్దుర్తి, గంగినేపల్లి తండాలకు, ఎర్రోని పల్లి, బ్రాహ్మణపల్లి, చిన్నపరెడ్డి పల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

సీఎం సమీక్ష

రాష్ట్రంలో ఎడతెరపి లేని వర్షాల నేపథ్యంలో కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో సీఎం చంద్రబాబు గురువారం సమీక్ష నిర్వహించారు.  ప్రాజెక్టుల్లో నీటి ప్రవాహాలపై అప్రమత్తంగా ఉండాలని  సూచించారు.