- నేడు నేపాల్‌తో భారత్ ఢీ
- మహిళల ఆసియాకప్
దంబుల్లా: మహిళల ఆసియా కప్‌లో ఎదురు లేకుండా దూసుకెళ్తోన్న మన అమ్మాయిలు హ్యాట్రిక్ విజయంపై కన్నేశారు. గ్రూప్ భాగంగా నేడు నేపాల్‌తో చివరి లీగ్ మ్యాచ్‌కు సిద్ధమయ్యారు. ఇప్పటికే సెమీస్ బెర్తు ఖరారు చేసుకున్న హర్మన్‌ప్రీత్ బృందం అజేయంగా లీగ్ దశను ముగించాలని ఉవ్విళ్లూరుతుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అత్యంత పటిష్టంగా కనిపిస్తోన్న టీమిండియాను నిలువరించడం నేపాల్ అమ్మాయిలకు శక్తికి మించిన పనే.
యూఏఈతో మ్యాచ్‌లో టాపార్డర్ విఫలమైనప్పటికీ కెప్టెన్ హర్మన్, కీపర్ రిచా ఘోష్ పూనకం వచ్చినట్లు చెలరేగిపోయారు. ఇలా ఒకటి నుంచి ఏడో స్థానం వరకు మన బ్యాటర్లు దంచడమే పనిగా పెట్టుకోవడంతో మరోసారి భారీ స్కోరు నమోదయ్యే అవకాశముంది. పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, దీప్తి శర్మ, రేణుకా సింగ్‌లతో కూడిన బౌలింగ్ పటిష్టంగా కనిపిస్తోంది. మరోవైపు యూఏఈతో ఆడిన మ్యాచ్‌లో సంచలన విజయం సాధించిన నేపాల్ జట్టు భారత్‌పై విజయంతో సెమీస్ చేరాలని ఆశిస్తోంది.
చమరి రికార్డు సెంచరీ
శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్టు (69 బంతుల్లో 119 నాటౌట్; 14 ఫోర్లు, 7 సిక్సర్లు) మహిళల ఆసియాకప్‌లో సెంచరీ చేసిన తొలి ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కింది. సోమవారం మలేసియాతో జరిగిన పోరులో చమరి చెలరేగడంతో లంక 20 ఓవర్లలో 4 వికెట్లకు 184 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో మలేసియా 40 రన్స్‌కు ఆలౌటైంది.