- ఇతర రాష్ట్రాల్లో అధ్యయనానికి సిద్ధమైన వాణిజ్య పన్నుల శాఖ
- మొదటగా తమిళనాడుకు వెళ్లాలని నిర్ణయం
హైదరాబాద్, అక్టోబర్ 18(విజయక్రాంతి): బడ్జెట్‌లో నిర్దేశించిన లక్ష్యాన్ని వందశాతం చేరుకోడమే లక్ష్యంగా వాణిజ్య పన్నుల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇతర రాష్ట్రాల్లో పన్ను వసూళ్లు ఎలా జరుగుతున్నాయి? తెలంగాణలో అవలంబిస్తున్న విధానాలు, ఇతర ప్రాంతాల్లోని విభాగాలు పనిచేస్తున్న తీరును అధ్యయనం చేసేందుకు నిర్ణయించింది.
ఇటీవల జీఎస్టీలో భారీగా మోసాలు బయటపడుతున్న నేపథ్యంలో వాటిపై కూడా ఈ అధ్యయనంలో దృష్టిసారించే అవకాశం ఉంది. తొలి విడతలో భాగంగా తమిళనాడుకు వెళ్లాలని నిర్ణయించారు.
వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ రిజ్వీ ఆదేశాల మేరకు జాయింట్ కమిషనర్లు, అడిషనల్ కమిషర్లతో కూడిన బృందం రెండు రోజుల్లో తమిళనాడుకు వెళ్లనున్నట్లు సమాచారం. వాస్తవానికి ఇప్పటికే ఈ బృందం తమిళనాడుకు వెళ్లాల్సి ఉండగా అక్కడ వరదల నేపథ్యంలో పర్యటన ఆలస్యమైంది.
తమిళనాడే ఎందుకు?
జీఎస్టీ వసూళ్లలో తమిళనాడు మెరుగైన వృద్ధిరేటును చూపుతోంది. 2024 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ వరకు జీఎస్టీ వసూళ్లలో తమిళనాడు 19 శాతం వృద్ధిరేటును సాధించింది. గతేడాది 11 శాతం వృద్ధిరేటును కనబర్చిన ఆ రాష్ట్రం ఈసారి ఏకంగా 19 శాతం సాధించింది. ఇక తెలంగాణ విషయానికొస్తే ఈ ఆరు నెలల్లో బడ్జెట్‌లో నిర్ధేశించిన లక్ష్యాన్ని ఏ నెలలోనూ చేరుకోలేకపోయారు.
మొదటి ఆరు నెలల్లో కేవలం 7 శాతమే వృద్ధి రేటు నమోదైంది. దీంతో తమిళనాడులో జీఎస్టీ వసూళ్లు ఎలా ఉన్నాయి? లీకేజీలను అరికట్టడానికి వారు ఎలాంటి విధానాలను అవలంబిస్తున్నారు? లక్ష్యాన్ని చేరుకోడానికి వారు ఎలా ముందుకెళ్తున్నారనే విషయాలపై అధ్యయనం చేయనున్నారు.
తమిళనాడులో అధ్యయనం పూర్తున తర్వాత.. అధికారుల బృందం వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ రిజ్వీకి నివేదికను అందించనుంది. వాస్తవానికి మొదట అనుకున్న తేదీ ప్రకారం వెళ్తే ఈ నెల 21న నివేదికను సమర్పించాల్సి ఉంది. కానీ వరదల కారణంగా ప్రయాణం ఆలస్యమైనందున నివేదికను కూడా రెండు రోజుల పాటు ఆలస్యంగా సమర్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
రాబడిపై సర్కారు అంసతృప్తి..
ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే శాఖల్లో వాణిజ్య పన్నుల విభాగం అతి ముఖ్యమైంది. రెవెన్యూ రాబడుల్లో దాదాపు 63 శాతం వాటా ఈ శాఖదే అంటే దీని ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు. 2024 ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య పన్నుల శాఖకు ప్రభుత్వం రూ. 85 వేల కోట్ల లక్ష్యాన్ని నిర్ధేశించింది.
ఆరు నెల్లలో రూ.42 వేల కోట్లకు పైగా వసూళ్లు చేయాల్సి ఉండగా సెప్టెంబర్ వరకు కేవలం రూ.37 వేల కోట్లు మాత్రమే వసూలయ్యాయి. నిర్ధేశించిన లక్ష్యానికంటే ప్రతి నెల రూ.500 కోట్లకు పైగానే తగ్గుతూ వస్తున్నాయి. దీంతో వాణిజ్య పన్నుల శాఖ పనితీరుపై ప్రభుత్వం అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇటీవల జరిగిన సమావేశంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి వసూళ్లు పెరగాల్సిందేనని శాఖ ఉన్నతాధికారులకు తేల్చి చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలో ఆదాయాన్ని పెంచే మార్గాలను అన్వేషించిందుకు వాణిజ్య పన్నుల విభాగం అధికారుల బృందం త్వరలో తమిళనాడుకు వెళ్లనుంది.