గువాహటి: ఐపీఎల్ 17వ సీజన్లో ప్లేఆఫ్ బెర్త్ లక్ష్యంగా రాజస్థాన్ రాయల్స్ కీలక పోరుకు సిద్ధమైంది. గౌహతి వేదికగా నేడు పంజాబ్ కింగ్స్‌తో రాజస్థాన్ అమీతుమీ తేల్చుకోనుంది. లీగ్ ఆరంభంలో వరుస విజయాలతో దుమ్మురేపిన రాజస్థాన్ తాజాగా మూడు వరుస పరాజయాలతో కాస్త నెమ్మదించింది. అయితే ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లాడి 16 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న రాయల్స్‌కు ఇప్పటికీ మెరుగైన అవకాశాలే ఉన్నాయి. పంజాబ్‌పై గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా రాజస్థాన్ దర్జాగా ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టనుంది. మరోవైపు ఇప్పటికే లీగ్ నుంచి నిష్క్రమించిన పంజాబ్ కింగ్స్‌కు ఈ మ్యాచ్ నామమాత్రమే కానుంది.
రాజస్థాన్ బ్యాటింగ్ విషయానికి వస్తే బట్లర్ దూరమైనప్పటికి జైస్వాల్, కెప్టెన్ సంజూ శాంసన్‌లు ఫామ్‌లో ఉండడం సానుకూలాంశం. ఇక లోకల్ బాయ్ రియాన్ పరాగ్ తన హిట్టింగ్తో రాజస్థాన్‌ను ప్లేఆఫ్స్‌కు చేర్చాలనే పట్టుదలతో ఉన్నాడు. ధ్రువ్ జురేల్, హెట్‌మైర్, శుభమ్ దూబేలు రాణించాల్సిన అవసరముంది. సందీప్ శర్మ, బౌల్ట్, ఆవేశ్ ఖాన్‌లతో పేస్ త్రయం పటిష్టంగా కనిపిస్తోంది. చహల్, అశ్విన్ స్పిన్ బాధ్యతలు పంచుకుంటూ వికెట్లు పడగొడుతున్నారు. మరోవైపు ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు దూరమై పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న పంజాబ్.. పోరాడితే పోయేదేమీ లేదు అన్న చందంగా రాజస్థాన్‌పై విరుచుకుపడాలని భావిస్తోంది. సీజన్లో ఇరుజట్ల మధ్య జరిగిన తొలి అంచె పోటీలో రాజస్థాన్ విజయాన్ని అందుకుంది.