calender_icon.png 27 September, 2024 | 6:48 PM

క్లీన్‌స్వీప్ లక్ష్యంగా..

27-09-2024 12:00:00 AM

  1. భారత్, బంగ్లా రెండో టెస్టు 
  2. రోహిత్, కోహ్లీ ఫామ్‌పై నజర్ 
  3. ముగ్గురు స్పిన్నర్లకు అవకాశం

కాన్పూర్: బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు మ్యాచ్ ఆడేందుకు టీమిండియా సిద్ధమైంది. చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టులో 280 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించిన రోహిత్ సేన ఈ మ్యాచ్‌లోనూ గెలిచి రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలనే యోచనలో ఉంది. అయితే కాన్పూర్ టెస్టుకు వర్షం ముప్పు పొంచి ఉంది. గురువారం ఉదయం సెషన్‌లో ఇరుజట్ల ఆటగాళ్ల ప్రాక్టీస్ చేసినప్పటికీ.. మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది.

దీంతో మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు. మ్యాచ్ జరగనున్న ఐదు రోజుల్లో ఏదో ఒక సమయంలో వర్షం అంతరాయం కలిగించే అవకాశముందని వాతావరణ నిపుణులు సూచించారు. 2022 నుంచి స్వదేశంలో భారత్ ఇప్పటివరకు టెస్టుల్లో 18 వరుస విజయాలు నమోదు చేసింది. రెండో టెస్టులోనూ విజయం సాధించి జైత్రయాత్రను కొనసాగించాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు పాకిస్థాన్‌ను వారి సొంతగడ్డపైనే మట్టికరిపించి భారత్ గడ్డపై అడుగుపెట్టినప్పటికీ టీమిండియా ముందు వారి పప్పులు ఉడకలేదు. ఇక టీ20 క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన బంగ్లా ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ భారత్‌తో రెండో టెస్టు తన కెరీర్‌లో చివరి టెస్టు అయ్యే అవకాశముందని వెల్లడించాడు. ఈ నేపథ్యంలో షకీబ్‌కు విజయంతో వీడ్కోలు పలకాలని బంగ్లాదేశ్ భావిస్తోంది.

ఆ ఇద్దరు ఏం చేస్తారో..

ఇక టీమిండియా బ్యాటింగ్ విషయానికొస్తే.. తొలి టెస్టు సెంచరీ హీరోలు శుబ్‌మన్ గిల్, రిషబ్ పంత్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. వీరికి తోడు ఓపెనర్ జైస్వాల్, కేఎల్ రాహుల్ మంచి టచ్‌లో కనిపిస్తున్నారు. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీలపై నజర్ నెలకొంది. టీ20 ప్రపంచకప్ తర్వాత ఈ ఇద్దరు శ్రీలంకతో సిరీస్ ఆడగా.. రోహిత్ పర్వాలేదనిపించినప్పటికీ, కోహ్లీ మాత్రం వరుసగా విఫలమవుతూ వస్తున్నాడు.

బంగ్లాతో తొలి టెస్టులో రోహిత్ రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 11 పరుగులు చేయగా.. కోహ్లీ 23 పరుగులు సాధించాడు. రెండో టెస్టులో ఈ ఇద్దరు కూడా రాణిస్తే జట్టుకు తిరుగుండదు. లోయర్ ఆర్డర్‌లో అశ్విన్, జడేజాలు రాణిస్తుండడంతో బ్యాటింగ్‌లో పెద్ద సమస్యలు లేనట్లే. ఇక కాన్పూర్ పిచ్ పేసర్లకు, స్పిన్నర్లకు అనుకూలంగా ఉండడంతో జట్టులో ఒక మార్పు చేసే అవకాశముంది. ఆకాశ్ దీప్ స్థానంలో అక్షర్ పటేల్ లేదా కుల్దీప్‌లలో ఒకరు జట్టులోకి రానున్నారు.

టీ20లకు షకీబ్ గుడ్ బై..

బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ అంతర్జాతీయ టీ20ల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపాడు. అంతే కాకుండా టెస్టుల్లో కూడా ఇదే తన చివరి టెస్టు అయ్యే అవకాశముందని తెలిపాడు. ఒకవేళ స్వదేశంలో ఫేర్‌వెల్ మ్యాచ్ లేకుంటే తన కెరీర్‌లో టీమిండియాతో ఆడబోయే టెస్టు చివరిదవుతుందని షకీబ్ వెల్లడించాడు. వచ్చే ఏడాది చాంపియన్స్ ట్రోఫీ తర్వాత వన్డేలకు కూడా గుడ్‌బై చెప్పనున్నాడు. 37 సంవత్సరాల షకీబ్ బంగ్లా తరఫున 120 టీ20లు, 70 టెస్టులు, 247 వన్డేల్లో ప్రాతినిధ్యం వహించాడు.