నేడు భారత్, సౌతాఫ్రికా రెండో టీ20
- జోరు మీద సూర్య సేన.. ఒత్తిడిలో సఫారీలు
- రాత్రి 7.30 నుంచి
డర్బన్: సఫారీ గడ్డపై దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో నేడు టీమిండియా రెండో టీ20 మ్యాచ్ ఆడనుంది. యువ రక్తంతో ఉరకలెత్తుతున్న డిఫెండింగ్ చాంపియన్ భారత్ రెండో విజయంపై కన్నేసింది. తొలి మ్యాచ్‌లో శాంసన్ మెరుపు సెంచరీకి తోడు స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయి రాణించడంతో సఫారీలపై ఘన విజయం సాధించింది. రెండో టీ20లోనూ అదే జోరును ప్రదర్శించి సిరీస్‌ను ఒక మ్యాచ్ ఉండగానే కైవసం చేసుకోవాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు బ్యాటింగ్ వైఫల్యంతో ఓటమిని మూటగట్టుకున్న సౌతాఫ్రికా గెలుపు రుచి చూడాలనుకుంటుంది. మ్యాచ్ రాత్రి 7.30 గంటల నుంచి స్పోర్ట్స్ 18, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
బ్యాటింగ్‌పై నజర్
తొలి టీ20లో భారత్ విజయం సాధించినప్పటికీ బ్యాటింగ్‌లో వైఫల్యాలు బయటపడ్డాయి. శాంసన్, తిలక్ వర్మ మినహా మిగతావారు దారుణంగా విఫలమయ్యారు. ఓపెనర్ అభిషేక్ శర్మ గత ఏడు మ్యాచ్‌ల్లో అభిషేక్ వరుసగా 0, 10, 14, 16, 15, 4, 7 స్కోర్లు సాధించాడు. ఈ మ్యాచ్‌లో రాణించడం అతనికి కీలకం. కెప్టెన్ సూర్య టచ్‌లో కనిపిస్తున్నప్పటికీ భారీ స్కోరు చేయాల్సిన అవసరముంది. తొలి టీ20లో టీమిండియా చివరి ఆరు వికెట్లను 36 పరుగుల వ్యవధిలో కోల్పోవడం బ్యాటింగ్ బలహీనతను బయటపెట్టింది. బౌలింగ్‌లో స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, బిష్ణోయి మరోసారి కీలకంగా మారనున్నారు.
సీనియర్లు లేని లోటు
మరోవైపు సౌతాఫ్రికా జట్టులో సీనియర్లు లేని లోటు స్పష్టంగా కనిపించింది. టీ20 ప్రపంచకప్ ఆడిన డికాక్, రబాడ, నోర్టే, షంసీ ఈ సిరీస్‌కు దూరంగా ఉన్నారు. వెస్టిండీస్‌తో సిరీస్ పోగొట్టుకున్న సౌతాఫ్రికా ఐర్లాండ్‌తో సిరీస్‌ను డ్రా చేసుకుంది. తాజాగా టీమిండియాతో మ్యాచ్‌లో ఘోర వైఫల్యం చవిచూసింది.
పాకిస్థాన్‌కు వెళ్లలేం
ఢిల్లీ: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పాకిస్థాన్ వేదికగా జరగనున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు ఆ దేశానికి వెళ్లలేమని బీసీసీఐ శనివారం ఐసీసీకి మరోసారి స్పష్టం చేసింది. హైబ్రిడ్ మోడల్‌కు పాకిస్థాన్ ససేమిరా అనడంతో బీసీసీఐ ఈ నిర్ణ యం తీసుకున్నట్లు తెలిసింది. టోర్నీకి మరో వంద రోజులు మాత్రమే ఉండడంతో టోర్నీ నిర్వహణపై ఐసీసీ ఒక నిర్ణయానికి రావాల్సి ఉంది.