- నేడు భారత్, సౌతాఫ్రికా మూడో టీ20
- టీమిండియా బ్యాటింగ్‌పై నజర్
- రాత్రి 8.30 నుంచి
సెంచూరియన్: సఫారీ గడ్డపై జరుగుతున్న టీ20 సిరీస్‌లో టీమిండియా నేడు మూడో టీ20 మ్యాచ్ ఆడనుంది. రెండో టీ20లో విజయం అంచుల దాకా వచ్చిన భారత్ తృటిలో పరాజయం చవిచూసింది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో ఆధిక్యం సాధించాలని టీమిండియా పట్టుదలతో ఉంది.
మరోవైపు రెండో టీ20లో చావు తప్పి కన్ను లొట్టబోయిన తరహాలో విజయాన్ని అందుకున్న సౌతాఫ్రికా మూడో టీ20లో గెలుపు దక్కించుకోవాలనుకుంటుంది. భీకరమైన ఫామ్‌లో ఉన్న స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మ్యాచ్‌లో మరోసారి కీలకం కానుండగా.. టీమిండియా బ్యాటింగ్‌పైనే నజర్ ఏర్పడింది. సెంచూరియన్ వేదికగా రాత్రి 8.30 నుంచి మ్యాచ్ ప్రారంభం కానుంది.
బ్యాటర్లు మెరవాలి..
రెండో టీ20లో భారత్ ఓటమికి ప్రధాన కారణం బ్యాటింగ్ వైఫల్యమే. 126 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా బౌలర్ల ధాటికి సఫారీలు కకావికలమయ్యారు. మరో 30 నుంచి 40 పరుగులు జోడించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. తొలి టీ20లో సెంచరీ సాధించిన సంజూ శాంసన్ డకౌట్ కావడం జట్టు కొంపముంచింది. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ తనకు వస్తున్న అవకాశాలను వృథా చేసుకుంటున్నాడు. టీ20 స్పెషలిస్ట్‌గా ముద్ర పడిన కెప్టెన్ సూర్యకుమార్ వైఫల్యం జట్టును వెంటాడుతోంది.
మిడిలార్డర్‌లో తిలక్ వర్మ పర్వాలేదనిపిస్తుండగా.. ఫినిషర్ రింకూ సింగ్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఆల్ రౌండర్లు పాండ్యా, అక్షర్ పటేల్ ధాటిగా ఆడడంలో విఫలమవుతున్నారు. రెండో టీ20లో పాండ్యా పర్వాలేదనిపించినప్పటికీ 45 బంతుల్లో 39 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో మాత్రం స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మరోసారి కీలకం కానున్నాడు.
పేసర్లు అర్ష్‌దీప్, అవేశ్ ఖాన్ రాణించాల్సి ఉంది. మరోవైపు సీనియర్లు లేని లోటు స్పష్టంగా తెలుస్తోంది. గత మ్యాచ్‌లో టాపార్డర్, మిడిలార్డర్ విఫలమైన చోట స్టబ్స్ టెయిలెండర్ కోయెట్జీతో కలిసి సౌతాఫ్రికాను గెలిపించాడు.