calender_icon.png 18 November, 2024 | 3:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్లాస్టిక్ వ్యర్థాల కట్టడే లక్ష్యం

18-11-2024 01:45:27 AM

25 నుంచి సౌత్ కొరియాలో గ్లోబల్ ప్లాస్టిక్ ట్రీటీ

ప్లాస్టిక్ కట్టడి కోసం నాలుగు పాలసీలను ప్రతిపాదించిన పరిశోధకులు

న్యూఢిల్లీ, నవంబర్ 1౭: ప్రపంచానికి ప్లాస్టిక్ వ్యర్థాలు, కర్బన ఉద్గారాలు పెను సవాళ్లు విసురుతున్నాయి. ఏటికేడు వీటి పరిమాణం పెరుగుతుండటంతో జీవకోటి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. 2050 నాటికి ప్లాస్టిక్ వ్యార్థాలు రెట్టింపు అవ్వొచ్చనే వార్తల నేపథ్యంలో ప్లాస్టిక్ వ్యర్థాలు వాటికి సంబంధించిన కర్బన ఉద్గారాల కట్టడిపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేసి కీలక విషయాలను వెల్లడించారు.

‘2050 నాటికి ప్రపంచ ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ మరియు గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించే మార్గాలు’ అనే శీర్షికతో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్కిలీ, శాంటా బార్బరా పరిశోధుకుల బృందం ఓ నివేదికను విడుదల చేసింది. ఇందులో ప్లాస్టిక్ కట్టడి కోసం నాలుగు అంశాలను పేర్కొంది. ఈ నాలుగు పాలసీలను ఆచరణలో పెట్టడం ద్వారా 2050 నాటికి కర్బన ఉద్గారాలను దాదాపు మూడింట ఒక వంతు తగ్గించవచ్చని నివేదికలో వెల్లడించింది. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్లాస్టిక్ వ్యర్థాల కాలుష్యాన్ని 90శాతంపైగా తగ్గించొచ్చని తెలిపింది. 

ప్లాస్టిక్ వ్యర్థాలపై ప్రతిపాదనలు

ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించడానికి కొత్త ప్లాస్టిక్ ఉత్పత్తుల్లో కనీసం 40శాతం రీసైకిల్ మెటీరియల్ వాడాలని శాస్త్రవేత్తల బృందం తన నివేదికలో పేర్కొంది. అలాగే కొత్త ప్లాస్టిక్ ఉత్పత్తిని 2020 స్థాయికి పరిమితం చేయాలని అధ్యయనం సిఫార్సు చేసింది. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణలో భాగంగా మౌలిక సదుపాయాల కల్పన కోసం పెట్టుబడులు పెట్టాలని సూచించింది. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాల్లో  ఇందుకోసం పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టాలని కోరింది.

ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీని నిరుత్సాహపరిచేలా వాటి ప్యాకేజింగ్‌పై కొత్త మొత్తం చార్జి విధించాలని పేర్కొంది. ఈ పాలసీలను ప్రపంచ వ్యాప్తంగా అమలు చేస్తే ప్లాస్టిక్ కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చని పర్యావరణ నిపుణుడు ప్రొఫెసర్ మెక్‌కాలీ అభిప్రాయపడ్డారు. 300 మిలియన్ల పెట్రోల్, డీజిల్ కార్లను రోడ్ల మీదకు రానీయకుండా నిరోధించడం ద్వారా ఒక ఏడాదిలో ఎంత కాలుష్యాన్ని అరికట్టగలమో అదే స్థాయి నియంత్రణ ఈ నాలుగు పాలసీలను అమలు పర్చడం ద్వారా చేయెచ్చని వివరించారు.  

ప్రపంచ దేశాల సమావేశం

దక్షిణ కొరియాలోని బుసాన్ వేదికగా ఈ నెల 25 నుంచి డిసెంబర్ 1 వరకు గ్లోబల్ ప్లాస్టిక్ ట్రీటీ జరగనుంది. ఈ సమావేశంలో దాదాపు 190 దేశాలు పాల్గొని ప్లాస్టిక్ కారణంగా జరుగుతున్న  కాలుష్యాన్ని అడ్డుకోవడానికి ఉన్న అవకాశాలపై చర్చలు జరుపుతాయి. అనంతరం ప్లాస్టిక్ కట్టడికి ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నాయి. ఈ సమావేశాన్ని దృష్టిలో పెట్టుకునే గ్లోబల్ ప్లాస్టిక్ ట్రీటీ జరగడానికి కొన్ని రోజుల ముందు శాస్త్రవేత్తలు తమ అధ్యయనాన్ని నివేదిక రూపంలో విడుదల చేశారు.