calender_icon.png 17 January, 2025 | 3:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హ్యాట్రిక్‌పై గురి

03-08-2024 02:00:24 AM

25 మీటర్ల పిస్టల్ విభాగం ఫైనల్లో మనూ బాకర్

ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో భారత షూటర్ మనూ బాకర్ హ్యాట్రిక్ పతకంపై గురి పెట్టింది. తన ఫేవరెట్ అయిన 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో మనూ తుది పోరుకు అర్హత సాధించింది. ఇప్పటికే ఈ ఒలింపిక్స్‌లో రెండు మెడల్స్ సాధించిన మనూ బాకర్ మరో పతకం సాధించేందుకు అడుగుదూరంలో నిలిచింది. అయితే మనూ సాధించిన రెండు పతకాలు కాంస్యం కావడంతో ఈసారి పతకం రంగు మార్చే పనిలో పడింది. 25 మీ పిస్టల్ ఈవెంట్‌లో మంచి రికార్డు కలిగిన మనూ బాకర్ అత్యుత్తమ ప్రదర్శనతో స్వర్ణం గెలవాలని ఆశిద్దాం. ఒకవేళ నేడు మనూ మరో పతకం సాధిస్తే ఒకే ఒలింపిక్స్‌లో మూడు పతకాలు సాధించిన తొలి అథ్లెట్‌గా చరిత్ర సృష్టించనుంది. ఆల్ ది బెస్ట్ మనూ..

చటౌరోక్స్: పారిస్ ఒలింపిక్స్‌లో భారత షూటర్ మనూ బాకర్ మరోసారి సత్తా చాటింది. మహిళల 25 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత విభాగంలో మనూ బాకర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇప్పటికే ఈ ఒలింపిక్స్‌లో రెండు కాంస్యాలు సాధించిన 22 ఏళ్ల హర్యానా చిన్నది ముచ్చటగా మూడో పతకంపై గురి పెట్టింది. శుక్రవారం జరిగిన పిస్టల్ 25 మీటర్ల క్వాలిఫికేషన్ పోరులో అదరగొట్టిన మనూ టాప్ నిలిచింది. తొలుత ప్రిసిషన్ రౌండ్‌లో 294 పాయింట్లు స్కోరు సాధించిన మనూ టాప్‌| చోటు దక్కించుకుంది. ఆ తర్వాత తనకు అచ్చొచ్చిన ర్యాపిడ్ రౌండ్‌లో మనూ చెలరేగిపోయింది. ర్యాపిడ్  తొలి సిరీస్‌లో ఏకంగా 100 పాయింట్లు సాధించి రికార్డు సృష్టించింది.

ఈ రౌండ్‌లో మొత్తం 296 పాయింట్లు స్కోరు చేసింది. ఓవరాల్‌గా 590 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో నిలిచి పతకానికి అడుగు దూరంలో నిలిచింది. నేడు జరగనున్న ఫైనల్ పోరులో ఇదే తరహా ప్రదర్శన కనబరిస్తే మనూ బాకర్ పసిడి సొంతం చేసుకున్న ఆశ్చర్యపోనవసరం లేదు. హంగేరీకి చెందిన వెరొనికా మేజర్ (592 పాయింట్లు) తొలి స్థానంలో నిలవగా.. ఇటలీ షూటర్ హనియే రోస్తమియన్ (588 పాయింట్లు) మూడో స్థానంలో నిలిచింది. పాయింట్ల విషయంలో వెరొనికాతో కేవలం రెండు పాయింట్లు మాత్రమే వ్యత్యాసం ఉండడంతో మనూ స్వర్ణంపై ఆశలు రేపుతుంది.

ఇశా సింగ్‌కు నిరాశ..

తొలిసారి ఒలింపిక్స్ ఆడుతున్న హైదరాబాదీ షూటర్ ఇశా సింగ్ మాత్రం నిరాశపరిచింది. 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో ఇశా సింగ్ 581 పాయింట్లతో 18వ స్థానానికి పరిమితమైంది. మొత్తం 40 మంది షూటర్లు పాల్గొన్న ఈవెంట్‌లో ఇశా..ప్రిసిషన్ రౌండ్‌లో 291 పాయింట్లు , ర్యాపిడ్ రౌండ్‌లో 290 పాయింట్లు సాధించి తుది పోరుకు అర్హత సాధించడంలో విఫలమైంది. కాగా 2022 హాంగ్జౌ ఆసియా గేమ్స్‌లో ఇశా సింగ్ స్వర్ణ పతకం గెలిచిన సంగతి తెలిసిందే.

నేడు ఒలింపిక్స్‌లో భారతీయం

షూటింగ్: మహిళల స్కీట్ క్వాలిఫికేషన్: రైజా ధిల్లాన్, మహేశ్వరి చౌహాన్

మహిళల 25 మీటర్ల పిస్తోల్ ఈవెంట్ (మెడల్ రౌండ్): మనూ బాకర్ 

ఆర్చరీ: మహిళల వ్యక్తిగత (1/8 ఎలిమినేషన్స్): 

దీపికా కుమారి x క్రొప్పెన్ (జర్మనీ)

భజన్ కౌర్ x  డయనంద 

కొయ్‌రునీస (ఇండోనేషియా)

సెయిలింగ్: పురుషుల డింగీ ఓపెనింగ్ సిరీస్ (రేస్ 5,6): విష్ణు శరవణన్

మహిళల డింగీ ఓపెనింగ్ సిరీస్ 

(రేస్ 5,6): నేత్ర కుమానన్

బాక్సింగ్: పురుషుల వెల్టర్

వెయిట్ (క్వార్టర్స్): నిషాంత్ దేవ్ x మార్కో (మెక్సికో)