calender_icon.png 4 October, 2024 | 10:46 PM

భువనగిరి కోర్టు ఆవరణలో ఎయిమ్స్ ఉచిత వైద్య శిబిరం

04-10-2024 08:04:21 PM

యాదాద్రి భువనగిరి,(విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ, భువనగిరి న్యాయవాదుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో బీబీనగర్ ఎయిమ్స్ వైద్యశాల సహకారంతో భువనగిరి జిల్లా కోర్టు ఆవరణలో ఉచిత వైద్య, ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. శిబిరాన్ని యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, అధ్యక్షులు, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఎ. జయరాజు ప్రారంభించారు. ఈ శిబిరం ద్వారా మొత్తంగా 134 మంది ఉచిత వైద్య సేవలు పొందారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ... వైద్యుడు దేవుడితో సమానమని, నేటి సమాజంలో మనుషులు సరైన ఆహార నియమం లేక, పని వత్తిడి, వ్యాయామం లేక తన శరీర ప్రవృత్తిని అర్ధం చేసుకోలేక నానా రుగ్మతలకు లోనవుతున్నాడని, ఏదేని అనారోగ్యానికి గురైనప్పుడు మాత్రమే వైద్య చికిత్సకకు పోకుండా, ఆరోగ్య నియమాలు పాటిస్తే శరీరం, మనస్సు తద్వారా దైనందిన జీవన పోరాటం సులభమవుతుంది.

న్యాయ సేవ అధికార చట్టం లక్ష్యాలలో ప్రతీ ఒక్కరికి  రాజ్యాంగ ఫళాలు అందాలని దీనికై ప్రతీ నెల కార్యాచరణ ప్రణాళిక ఉంటుందని దీనిలో భాగంగా ఈరోజు ఈ వైద్య మరియు ఆరోగ్య శిభిరాన్ని ఏర్పాటు చేయడమైనదని తెలిపారు. భువనగిరి బార్ అసోసియేషన్ అధ్యక్షులు బి. హరినాథ్, ఎయిమ్స్ ఆసుపత్రి స్టాండింగ్ కౌన్సిల్ వేముల అశోక్ మాట్లాడుతూ... ఉచిత వైద్య శిబిరాల ద్వారా వైద్య సేవలే కాకుండా ఆరోగ్యంపై అవగాహన కలుగుతుందని, ఈ శిబిరం ద్వారా అందరితో పాటు కక్షిదారులు కూడా ఉచితంగా వైద్య సేవలు పొందారని ఇట్టి శిభిరాన్ని ఏర్పాటు చేసిన ఎయిమ్స్ వైద్యశాల వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఎయిమ్స్ డాక్టర్లు వాహిణి, చంద్రమౌళి మాట్లాడుతూ గ్రామాలలో, పట్టణాలలో, కమ్యూనిటీ కేంద్రాలలో సంస్థ అధికారుల సూచనల మేరకు తమ సంస్థ ద్వారా ఎన్నో వైద్య సేవలు ఇట్టి శిభీరాల ద్వారా అందచేస్తున్నామని, నేటి శిభిరంలో మొత్తంగా 20 మంది వైద్య బృందం సేవలు అందించామని తెలిపారు.