calender_icon.png 26 March, 2025 | 4:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

3న ముహూర్తం!

26-03-2025 01:34:44 AM

రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ఏఐసీసీ పచ్చజెండా?

  1. నాలుగు లేదా ఐదుగురికి ఛాన్స్ 
  2. రెండు బీసీలకు, రెండు రెడ్డీలకు, ఎస్సీల్లో ఒకరికి చోటు 
  3. ఆరో బెర్తుపై క్లారిటీ వస్తే.. ఎస్టీల్లో లంబాడీ లేదా మైనార్టీలకు ఛాన్స్
  4. ప్రేమ్‌సాగర్ కోసం పట్టుబడుతున్న డిప్యూటీ సీఎం
  5. క్యాబినెట్ కూర్పులో చోటుదక్కని ఆశావహులకు.. 
  6. డిప్యూటీ స్పీకర్, ప్రభుత్వ చీఫ్ విప్, విప్ పదవులు

హైదరాబాద్, మార్చి 25 (విజయక్రాంతి) : కాంగ్రెస్ అధిష్ఠానం రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు పచ్చజెండా ఊపింది. ఏప్రిల్ 3న కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం ఉండే అవకాశం ఉంది. ఖాళీగా ఉన్న ఆరు బెర్తుల్లో ఐదుగురితో భర్తీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అందులో ఇద్దరు బీసీలు, ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారితో పాటు ఒక ఎస్సీ సామాజికవర్గానికి  చోటు దక్కనున్నట్లు సమాచారం.

ఈ మేరకు రాష్ట్ర కోర్ కమిటీ నుంచి ఏఐసీసీ వివ రాలు తీసుకుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ నుంచి అభిప్రాయాలు సేకరించింది. రెడ్డి సామాజికవర్గం నుంచి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీమంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేర్లు దాదాపు ఖరారైనట్లుగా తెలుస్తోంది.

వీరిద్దరితో పాటు రంగారెడ్డి జిల్లా నుంచి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి పేరు కూడా పరిశీలనలోకి వచ్చినట్లుగా సమాచారం. అయితే  ఈ ముగ్గురిలో  ఇద్దరికి చోటు దక్కే అవకాశం ఉందని పార్టీవర్గాలు చెబుతున్నాయి. ఇక బీసీ సామాజికవర్గం నుంచి ఇద్దరికి చోటు ఇవ్వనున్నారు.

తెలంగాణ బీసీల్లో బలమైన సామాజికవర్గమైన ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి, మున్నూరుకాపు సామాజికవర్గం నుంచి వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉన్నట్లు గా సమాచారం. ఎస్సీ సామాజిక వర్గం నుంచి చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్‌కు అమాత్య పదవి దక్కనుందని చెబుతున్నారు. ఇప్పటికే వివేక్‌తో పాటు ఆయన సోదరుడు వినోద్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు.

వివేక్ తనయుడు వంశీ పెద్దపల్లి నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వివేక్‌కు మంత్రి పదవి ఇస్తే మిగతా వారి నుంచి వ్యతిరేకత వస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యతిరేకించినట్లుగా సమాచారం. అదే జిల్లా నుంచి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావుకు అవకాశం ఇవ్వాలని పట్టుపడుతున్నట్లుగా తెలుస్తోంది.

అయితే వివేక్ వెంకటస్వామి బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరినప్పుడు మంత్రి పదవి ఇస్తామనే హామీ ఇచ్చామని ఢిల్లీ పెద్దలు సర్దిచెబుతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇక ఆరో మంత్రి పదవిపైనా చర్చ జరుగుతోందని సమాచారం. దానిని బంజారాలకు ఇవ్వాలా? ముస్లిం మైనార్టీలకు ఇవ్వాలా? అనే అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది.

కాంగ్రెస్‌లో ప్రస్తుతం ముస్లింల నుంచి ఎమ్మెల్యేలు లేకపోవడంతో.. ఇటీవలనే ఎమ్మెల్సీగా ఎన్నికైన అమీర్‌అలీఖాన్ పేరుకు కూడా తెరపైకి వస్తుంది. ఎస్టీల్లో  ప్రస్తుతం ఆదివాసీ కమ్యూనిటీకి చెందిన  సీతక్క పంచాయతీరాజ్ మంత్రిగా కొనసాగుతున్నారు. బంజారాలకు ఇవ్వాలని భావిస్తే డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్, నల్లగొండ జిల్లా దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య పేర్లు పరిశీలనలో ఉన్నాయి.

అయితే ఆరో మంత్రి భర్తీ ఇప్పుడు ఉంటుందా? లేదా? అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. మంత్రి పదవులను ఆశిస్తున్నా, చోటు దక్కనివారికి డిప్యూటీ స్పీకర్, ప్రభుత్వ చీఫ్ విప్‌తో పాటు విప్ పదవులను ఇచ్చి బుజ్జగించాలనే ఆలోచనతో ఉన్నట్లుగా తెలుస్తోంది. 

హైదరాబాద్‌కు తిరిగివచ్చిన సీఎం, పీసీసీ చీఫ్

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ ఢిల్లీ పర్యటన ముగించుకుని మంగళవారం హైదరాబాద్‌కు తిరిగొచ్చారు.  మంత్రి వర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గ కూర్పుతో పాటు నామినేటెడ్ పదవుల భర్తీ, పార్టీ బలోపేతానికి సంబంధించిన అంశాలపై చర్చించేందుకు అధిష్ఠానం పెద్దలతో పిలుపుతో.. సీఎం రేవంత్‌రెడ్డి, మహేష్‌కుమార్‌గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి  సోమవారం ఢిల్లీకి వెళ్లారు.

ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ, కేసీ వేణుగోపాల్‌తో సమావేశమై చర్చించారు. సీఎం రేవంత్‌రెడ్డి , పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్ ఢిల్లీలోనే ఉన్నారు. మంగళవారం రాష్ట్రానికి చెందిన ఎంపీలతో సమావేశమై.. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించినట్లు తెలిసింది. 

నాకు హోంమంత్రి పదవంటే ఇష్టం!

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

హైదరాబాద్, మార్చి 25 (విజయక్రాంతి): ‘నాకు మంత్రి పదవి వస్తుం దని ఆశిస్తున్నా..ఆ మంత్రిత్వ శాఖ (హోంశాఖ) అంటే ఇష్టం.. కానీ అధిష్ఠానం ఏ పదవి ఇచ్చినా చేస్తా..’ అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన మనసులో మాటను బయటపెట్టారు. మంగళవారం ఆయన అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు.

సామార్థ్యాన్ని బట్టి మంత్రులను ఎంపిక చేయాలని, లోక్‌సభ ఎన్నికల సమయంలో భువనగిరి ఎన్నికల బాధ్యతలు సమర్థవం తంగా నిర్వహించానని తెలిపారు. మంత్రి పదవి విషయంలో ఢిల్లీ నుంచి ఎటువంటి ఫోన్ రాలేదని తెలిపారు.