1500 శాతం పెరిగిన శాంసంగ్ లాభాలు
సియోల్: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వేగంగా దూసుకొస్తుండడమే కాదు.. ఆయా కంపెనీలకు కాసుల వర్షం కురిపిస్తోంది. అమెరికా చిప్ తయారీ కంపెనీ అయిన ఎన్విడియా దీనివల్ల భారీగా లబ్ధిపొందగా.. ఇప్పుడు శాంసంగ్ వంతు వచ్చింది. దక్షిణ కొరియాకు చెందిన ఈ ఎలక్ట్రానిక్ దిగ్గజం ఈ ఏడాది రెండో త్రైమాసికంలో ఏకంగా 15 రెట్ల (1500 శాతం) లాభాన్ని నమోదు చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అంతకంతకూ విస్తరిస్తున్న నేపథ్యంలో మెమొరీ చిప్‌లకు ఏర్పడిన డిమాండే ఇందుకు కారణం.స్మార్ట్‌ఫోన్ తయారీతో పాటు సెమీకండక్టర్ తయారీ దిగ్గజమైన శాంసంగ్ ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి 10.4 ట్రిలియన్ వోన్ల (దక్షిణ కొరియా కరెన్సీ) ఆపరేటింగ్ లాభాలను ప్రకటించింది.
అమెరికా కరెన్సీలో 7.5 బిలియన్ డాలర్లు.. మన దేశ కరెన్సీ విలువ ప్రకారం సుమారు 62 వేల కోట్ల రూపాయలుకు సమానం. ఇక కంపెనీ ఏకీకృత ఆదాయం 23 శాతం వృద్ధితో 74 ట్రిలియన్ వోన్లకు పెరిగినట్లు కంపెనీ పేర్కొంది. అనుకూల మార్కెట్ పరిస్థితులు, ఓఎఎల్‌ఈడీ ప్యానెల్స్ విక్రయాలు భారీ లాభాల ప్రకటనకు కారణమని శాంసంగ్ పేర్కొంది. దీంతోపాటు ఏఐ మీద పెట్టుబడులు పెరుగుతుండడంతో హై బ్యాండ్‌విడ్త్ మెమొరీ, సాలిడ్ స్టేట్ డ్రైవ్స్ మంచి డిమాండ్ కూడా మెరుగైన త్రైమాసిక ఫలితాలకు కారణమని శాంసంగ్ తెలిపింది.