- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో మెరుగైన ఫలితాలు
- వేగవంతంగా ఔషధాల తయారీ
- రోగులకు చికిత్సల్లోనూ కచ్చితత్వం
- 30 నుంచి 40 శాతం సమయం ఆదా
- హెల్త్‌కేర్‌లో ఏఐ వినియోగానికి ప్రభుత్వం ప్రోత్సాహం
- నేడు హైదరాబాద్‌లో ఏఐ ఇన్ హెల్త్‌కేర్ సమ్మిట్
- ప్రారంభించనున్న పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, నవంబర్ 17 (విజయక్రాంతి): ప్రపంచ సాంకేతిక రంగమంతా ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చుట్టూ తిరుగుతున్నది. సాంకేతిక రంగంలో ఏఐ వినియోగంతో అద్భుత ఫలితాలను సాధిస్తున్నారు. పనితీరును వేగవంతం చేయడం తోపాటు సమర్థవంతంగా చేసేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతగానో ఉపయో గపడుతోంది.
దీంతో ఆయా రంగాలు కూడా ఏఐ వినియోగించడంపై దృష్టి సారించాయి. అందులో ముఖ్యమైనది హెల్త్ కేర్ రంగం. హెల్త్‌కేర్ రంగంలోనూ ఏఐ ఉపయోగంతో అద్భుతాలు సృష్టించవచ్చని గుర్తించడంతో ఆ దిశగా చర్యలు చేపడుతున్నారు. హెల్త్‌కేర్ రంగంలో ఔషధాల తయా రీ, రోగులకు చికిత్సలు అందించడం వంటి సేవల్లో ఏఐ కీలకంగా వ్యవహరిస్తోంది.
ఔషధాల తయారీకి సంబంధించిన పరిశోధ నలను వేగవంతం చేయడం, చికిత్సల్లో ఖచ్చితత్వం ప్రదర్శించడంతోపాటు ఎంతో సమ యం ఆదా చేసేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దోహదపడుతుంది. ఈ రకంగా హెల్త్‌కేర్ రంగంలో ఏఐ వినియోగానికి మొగ్గు చూపేందుకు కారణమవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఔషధ పరిశోధనలు వేగవంతం
టీకాలు, జనరిక్ మందులు, బయోసిమిలర్స్, ఇతర ఉత్పత్తుల తయారీలో పరిశో ధనలను వేగవంతంగా చేయడానికి ఏఐని వినియోగించేందుకు సిద్ధమవుతున్నారు. ఏఐ, మెషిన్ లెర్నింగ్‌తో క్లినికల్ పరీక్షలను సమర్థంగా నిర్వహించేందుకు వీలవుతుందని ఫార్మా రంగ నిపుణులు చెప్తున్నారు.
మార్కెట్‌లో మందుల డిమాండ్ అంచనా వేయడం, సరఫరా వ్యవస్థలను బలోపేతం చేసుకోవడం, రోగుల అవసరాలకు అనుగుణం గా మందులను అందించేందుకు ఏఐ కీలకంగా వ్యవహరిస్తోంది. ఔషధ పరిశోధన ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. తగిన నిధులు లేక పరిశోధనలను విస్తృత స్థాయిలో చేపట్టడానికి పలు కంపెనీలు వెనుకడుగు వేస్తున్నాయి.
దీంతోపాటు ఎన్నో ఏళ్లపాటు పరిశోధన చేసి కొత్త ఫార్ములాను ఆవిష్కరిస్తే అది క్లినికల్ ట్రయల్స్‌లో విఫలమవుతున్న సందర్భాలుంటాయి. ఔషధాల తయారీ పరిశోధనల్లో ఇదొక పెద్ద సమస్యగా మారుతోంది.
కొత్త సాంకేతికతతో పరిశోధనా వ్యయం సగానికి తగ్గే అవ కాశం ఉండటంతో హెల్త్‌కేర్ రంగంలో ఏఐ వినియోగంపై దృష్టిసారిస్తున్నారు. ఔషధ పరిశోధనల్లో తలెత్తే సమస్యలకు ఏఐ, ఎంఎల్, డేటా అనలిటిక్స్ వంటి టెక్నాలజీలు పరిష్కార మార్గాలు చూపగలుతా యని నిపుణులు భావిస్తున్నారు.
చికిత్సల్లో కచ్చితత్వం
భవిష్యత్ వైద్య రంగం అంతా ఏఐ, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్‌పైనే ఆధారపడి ఉండబోతోంది. చికిత్సలు, రోగ నిర్ధారణ, సర్జరీల్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో సేవల కల్పనలో స్పష్టమైన మార్పు కన్పిస్తోంది. ఉదాహరణకు జాయింట్ రీప్టేస్‌మెంట్, ఎముకలకు సంబంధించిన ఇతర సర్జరీల్లో రోబోటిక్ సర్జరీల వినియోగంతో సర్జరీ అనంతరం రోగికి సహజ సిద్ధమైన శరీర ఆకృతి, సర్జరీ రేటు ఎక్కువగా ఉంటుంది.
సర్జరీల్లో కచ్చితత్వం, తక్కువ కోతలు, రక్తస్రావం లేకపోవడంతోపాటు ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం కూడా తక్కువగానే ఉంటుంది. సాధారణ చికత్సలతో పోలిస్తే చాలా త్వరగా కోలుకుం టున్నారు. ప్రస్తుతం ఈ సాంకేతిక పరిజ్ఞానం తక్కువగా ఉండటంతో చికిత్సలకు కొంత ఎక్కువ ఖర్చు ఉంటుంది.
భవిష్యత్‌లో పరిజ్ఞానం వినియోగం పెరిగేకొద్దీ చికిత్సలకు అయ్యే ఖర్చులు కూడా తగ్గుతాయి. ప్రజల్లో ఈ చికిత్సలపై కొన్ని అపోహలున్నాయి. చికత్సల్లో వాడే వైద్య పరికరాలన్నీ వైద్యుడి నియంత్రణలోనే ఉన్నాయి. వైద్యుడి దిశా నిర్దేశంలోనే రోగ నిర్ధారణ, శస్త్ర చికిత్సలు జరుగుతాయి.
వార్షిక వృద్ధిరేటు పెరుగుదల
భారత వైద్య రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం రోజురోజుకూ పెరుగుతున్నది. 2016 నుంచి 2022 మధ్య ఏఐ హెల్త్‌కేర్ పరిశ్రమల 22.5 శాతం సగటు వార్షిక వృద్ధిరేటును నమోదు చేసిందని పలు నివేదికలు చెప్తున్నాయి. 2025 నాటికి ఇది 7.8 బిలియన్ యూఎస్ డాలర్లకు చేరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ప్రజారోగ్య పరిరక్షణలో వైద్యులు, నర్సులు, సహాయ సిబ్బంది చికిత్సలకు మౌలిక సదుపాయాల కొరతను అధిగమించడంలో ఏఐ ఎంతో కీలకంగా వ్యవహరిస్తోందని వైద్య రంగ నిపుణులు అభిప్రాయడుతున్నారు. దేశంలో వైద్య సదుపాయాల కొరతను కొవిడ్ మహమ్మారి స్పష్టంచేసింది.
2019 ఆర్థిక సర్వే ప్రకారం దేశంలోని ప్రతి 1,456 మందికి ఒక వైద్యుడు మాత్రమే ఉన్నారు. నేషనల్ హెల్త్ ప్రొఫైల్ 2021 ప్రకారం దేశంలో ప్రతి వెయ్యి మందికి 0.6 మేర మాత్రమే ఉన్నారు. ఈ కొరతను అధిగమించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్ వంటి సాంకేతిక పరిజ్ఞానం తోడ్పడుతుంది.
సమయమూ ఆదా
రోగ నిర్ధారణ, సర్జరీ, ఇతర చికిత్సల కోసం ఏఐ టూల్స్‌ను వినియోగిస్తున్నారు. ఏఐతో రోగ నిర్ధారణలో కచ్చితత్వంతోపాటు రోగులకు సమయం ఆదా అవుతోందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. వైద్యుడిని రోగి సంప్రదించడానికి ముందే ప్రామాణికమైన ప్రశ్నలకు రోగుల నుంచి సమాధానాలు రాబట్టి చాట్ బాట్, మెటా వంటి ఏఐ సాధనాల ద్వారా విశ్లేషిస్తున్నారు.
ఇలాంటి పద్ధతుల్లో రోగులకు 30 నుంచి 40 శాతం మేర సమయం ఆదా అవుతున్నట్టు వైద్యులు పేర్కొంటున్నారు. ఇక రోగుల రికార్డులు, ఎక్స్‌రే, సిటీ స్కాన్, రక్త పరీక్షలు, జన్యుక్రమ విశ్లేషణ వంటి అంశాల్లో వైద్యులు, సిబ్బందికి సహాయకారిగా పనిచేసే ఏఐ ఉపకరణాలెన్నో అందుబాటులో ఉంటున్నాయి. ఇవి వైద్యులు, సిబ్బందిపై పని ఒత్తిడిని తగ్గించడానికి దోహదపడుతున్నాయి.
క్యాన్సర్, రెటినోపతి, ఊపిరితిత్తుల జబ్బులు, రక్తంలో ఇన్ఫెక్షన్, అరుదైన వ్యాధుల నిర్ధారణలో తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఏఐని వినియోగిస్తున్నాయి. సర్జరీల్లో రోబోలను వినియోగించడం సాధారణ విషయంగా మారింది. ఇప్పటికే కొన్ని చోట్ల రోబోటిక్ సర్జరీలు అందుబాటులోకి వస్తున్నాయి.
నేడు ఏఐ ఇన్ హెల్త్‌కేర్ సమ్మిట్
హెల్త్‌కేర్ రంగంలో రాష్ట్రం దేశానికే దిక్సూచిగా మారుతోంది. ప్రపంచ దేశాలు హైదరాబాద్ వైపు చూసేట్టు హెల్త్‌కేర్ రంగంలో అభివృద్ధి సాధిస్తోంది. రాష్ట్రంలో హెల్త్‌కేర్ రంగం మరింత ప్రగతి సాధించేందుకు ప్రభుత్వం వైపు నుంచి ఎంతో సహకారాన్ని అందిస్తున్నది. ఆ దిశగా చర్యలు కూడా తీసుకుంటున్నది. ప్రస్తుతం హెల్త్‌కేర్ రంగంలో వినియోగంపై ప్రభుత్వం దృష్టి సారించింది.
ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేకూరే లబ్ధిపై అవగాహన కల్పిస్తున్నది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో సోమవారం ఏఐ ఇన్ హెల్త్‌కేర్ సమ్మిట్ నిర్వహిస్తున్నది. ఈ కార్యక్రమాన్ని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రారంభించనున్నారు. హెల్త్‌కేర్ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో సాధించే విప్లవాత్మక మార్పుల గురించి వివరించనున్నారు.