09-04-2025 12:00:00 AM
కిమ్స్ ఆస్పత్రి అతిపెద్ద పరిశోధన
చెస్ట్ ఎక్స్-రేలతో క్షయపై ఖచ్చితత్వ గుర్తింపు
హైదరాబాద్, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): చెస్ట్ ఎక్స్-రేలను ఉపయోగించి క్షయ(టీబీ)ను గుర్తించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించి కిమ్స్ ఆస్పత్రి అతిపెద్ద పరిశోధన చేసిందని కిమ్స్ హాస్పిటల్స్ పల్మోనాలజీ విభాగాధిపతి డాక్టర్ లతా శర్మ తెలిపారు. ఎక్కడా మానవ ప్రమేయం లేకుండా, క్యూఎక్స్‌ఆర్ అనే అత్యాధునిక ఏఐ టూల్‌ను ఉపయోగించి మొత్తం 16,675 మంది పేషెంట్ల చెస్ట్ ఎక్స్-రేలను విశ్లేషించారు. ఇందులో ప్రధానంగా రెండు అంశాలపై దృష్టిపెట్టారు. ముందుగా ఏఐ ద్వారా టీబీని గుర్తించడం, ఆ తర్వాత రేడియాలజిస్టులు దాన్ని నిర్ధారించడం. మొత్తం గుర్తించిన కేసుల్లో 88.7% కచ్చితమైనవిగా తేలింది. దీంతో వ్యాధిని త్వరగా గుర్తించడంలో ఏఐ కీలకపాత్ర పోషిస్తుందని నిర్ధారణ అయ్యింది. దానికితోడు.. ఇందులో టీబీ లేదని నిర్ధారించడంలో 97% కచ్చితత్వాన్ని ఏఐ సాధించింది.
ఏఐ టూల్ స్పెసిఫిసిటీ 69.1%గా ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) ప్రమాణాలను ఇది అందుకుంటోంది. ఏఐ గుర్తించిన కేసులన్నింటినీ నిపుణులైన రేడియాలజిస్టులు కూడా నిర్ధారించారు. అందువల్ల క్లినికల్ డయాగ్నసిస్లో ఏఐ సామర్థ్యం, దాని ఖచ్చితత్వాలకు ఇది నిదర్శనంగా నిలిచింది. టీబీ గుర్తింపులో ఏఐ టూల్ సామర్థ్యం, దాని ఖచ్చితత్వం చాలా బాగున్నాయని, ఇది గేమ్ ఛేంజర్ కానుందని డాక్టర్ లతా శర్మ అన్నారు. మానవ నైపుణ్యానికి ఏఐ ప్రత్యామ్నాయం కాలేదు గానీ, ప్రాథమిక పరీక్షల విషయంలో మాత్రం అది చాలా ఆధారపడదగ్గ పరికరంగా ఉపయోగపడుతుందని కిమ్స్ ఆస్పత్రికి చెందిన సీనియర్ కన్సల్టెంట్ రేడియాలజిస్ట్ డాక్టర్ చైతన్య ఇసమళ్ల అన్నారు.