calender_icon.png 24 September, 2024 | 6:48 AM

శారీ బ్యూటీ స్టెప్పులకు ఏఐ మ్యూజిక్

21-09-2024 12:40:00 AM

రామ్‌గోపాల్ వర్మ తాజాగా ‘శారీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘టూ మచ్ లవ్ కెన్ బి స్కేరీ’ అనేది ట్యాగ్‌లైన్. గిరికృష్ణకమల్ దర్శకత్వం వహిస్తుండగా, రవివర్మ నిర్మాత. సత్య యాదు, ఆరాధ్యదేవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని ‘ఐ వాంట్ లవ్’ అనే పాటకు సంబంధించిన వీడియోలను తన సోషల్ మీడియా ఖాతాలో వదిలి కుర్రకారులో సెగలు పుట్టించారు ఆర్జీవీ. అయితే, తాను షేర్ చేసిన సాంగ్ వీడియో ప్రత్యేకతను కూడా పంచుకున్నారాయన. ఈ గీతానికి ఏఐ టెక్నాలజీ వినియోగించి సంగీతం రూపొందించినట్టు ఆర్జీవీ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

“శారీ’ సినిమాలోని నేపథ్య సంగీతం, సంగీతం, సాంగ్స్ అన్నీ ‘ఏఐ’తో రూపొందించినవే. ఏఐ మ్యూజిక్ వాడిన తొలి సినిమా ఇదే’ అని వర్మ రాసుకొచ్చారు. పాన్ ఇండియా మూవీగా తెలుగు, హిందీ, తమిళ, మళయాళ భాషల్లో ఈ చిత్రాన్ని నవంబర్‌లో విడుదల చేయనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వెంకటసాయి ఫిలిమ్స్ ద్వారా విడుదల చేయడానికి పంపిణీదారుడు ముత్యాల రాందాస్ థియేట్రికల్ హక్కులు పొందారు.   వర్మ యూత్, ఫ్యామిలీ ప్రేక్షకులు చూసేవిధంగా ఈ చిత్రాన్ని మలిచారని డిస్ట్రిబ్యూటర్ ఈ సందర్భంగా తెలిపారు.