calender_icon.png 20 September, 2024 | 4:08 AM

అన్ని రంగాల్లో ఏఐ

07-09-2024 12:27:24 AM

ప్రతి ఒక్కరికీ ఆవిష్కరణల ఫలాలు

ప్రజా ప్రయోజనమే మా నిబద్ధతకు కొలమానం

సవాళ్లను అధిగమిస్తేనే సాంకేతికత పురోగతి

గ్లోబల్ ఏఐ సమ్మిట్‌లో మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్, సెప్టెంబర్ 6 (విజయ క్రాంతి): తెలంగాణలోని అన్ని రంగాల్లో కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతను అమలు చేయటమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. ప్రతి ఒక్కరికీ కొత్త సాంకేతికతలతో తయారయ్యే ఆవిష్కరణల ఫలాలు అందాల్సిన అవసరం ఉందని తెలిపారు. హెచ్‌ఐసీసీలో జరిగిన రెండు రోజుల గ్లోబల్ ఏఐ సమ్మిట్‌కు మంత్రి శ్రీధర్‌బాబు శుక్రవారం ముఖ్య అతిథిగా హాజరై మాట్లా డారు.

గ్లోబల్ ఏఐ సమ్మిట్‌తో తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధికి ప్రోత్సాహం లభించిందని చెప్పారు. ఏఐ రెండు వైపులా పదును ఉన్న కత్తిలాంటిదని, అద్భుతమైన ప్రగతితోపాటు కఠిన సవాళ్లను కూడా ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించారు. తెలంగాణ ఆర్థికాభివృద్ధి కోసం ఏఐ ఆధారిత సాంకేతికతతోపాటు పారదర్శక, నైతిక ప్రమాణాలున్న ఏఐపై దృష్టి కేంద్రీకరిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని రంగాల్లో ప్రజాస్వామ్యయుత ఏఐ సేవలను అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టు స్పష్టం చేశారు. 

గ్లోబల్ లీడర్‌గా ఎదగడం బాధ్యతే

బాధ్యతాయుతమైన ఏఐ సేవలను ప్రపంచం ముందుంచనున్నట్టు శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. ఏఐ గ్లోబల్ లీడర్‌గా తెలంగాణ ఎదగడం విజనరీ అయినప్పటికీ, ఇది ఎంతో బాధ్యతతో కూడుకున్నదని వెల్లడించారు. ఏఐకి సంబంధించి పలు ప్రాథమిక ప్రమాణాలపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు. ఇందులో భాగంగా మొదట ఒక శాఖలో ఏఐ ఆధారిత పరిపాలనను అవలభించబోతున్నట్టు తెలిపారు. విద్య, హెల్త్‌కేర్, వ్యవసాయం, ఐటీ వంటి శాఖల్లో దీన్ని తీసుకురానున్నామని వెల్లడించారు.

తర్వాత ఏఐ రెడీ డాటాసెట్స్, మోడల్స్‌పై దృష్టి సారించడంతోపాటు, ఏఐ స్కిల్డ్ పాపులేషన్‌ను పెంచే లక్ష్యంతోనే స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించినట్టు తెలిపారు. తెలంగాణలో, హైదరాబాద్‌లో అనేక అంతర్జాతీయ కంపెనీల్లో స్థానిక ఉద్యోగులు పనిచేస్తున్నారని, వారు తిరిగి తమ నైపుణ్యాన్ని మరింతగా మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. అందులో భాగంగా ఏఐపైనే రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ఫోకస్ చేయనుందని పేర్కొన్నారు. 

సవాళ్లతోనే పురోగతి

అన్ని రంగాల్లో సాంకేతికత అభివృద్ధి కోసం సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ప్రవేశపెట్టనున్నట్టు మంత్రి తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం ఏర్పాటు చేసే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా ఎన్నో స్టార్టప్‌లకు ప్రోత్సాహం అందించే అవకాశం ఉంటుందని చెప్పారు. దీంతోపాటు సైబర్ సెక్యూ రిటీ, డాటా అనలిటిక్స్ వంటి అంశాల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేయ డం ద్వారా అద్భుతమైన ఆవిష్కరణలను వెలుగులోకి తీసుకురావచ్చని అన్నారు.

ఏఐతో పేద, మధ్య తరగతి ప్రజలకు ఏ విధంగా లాభం జరుగుతుందనే అనుమానాలూ ఉన్నాయని, అందుకే తమ ప్రభు   త్వం ప్రస్తుత సాంకేతికత ఫలాలను ప్రతి ఒక్కరికీ అందేలా నిర్మాణాత్మకమైన పాలసీ రూపొందించామని తెలిపారు. అందులో భాగంగా సదస్సును అందరికీ ఏఐ అనే నినాదంతో ప్రారంభించామని వెల్లడించారు. ఎథికల్ ఏఐపై ప్రత్యేకంగా దృష్టి  సారి ంచాల్సిన అవసరం ఉందని అన్నారు. ఎథికల్ ఏఐతో ఎలాంటి సమస్యలను  తలెత్త కూడదనే ఉద్దేశంతో డిజిటల్ గవర్నెన్స్ ప్లాట్‌ఫామ్‌ను అమలు చేయనున్నట్టు  పేర్కొన్నారు. 

తెలంగాణతో కలిసి రావాలి

ప్రస్తుతం యంగ్ ఇండియన్స్ సమయమని, రాష్ట్ర ప్రభుత్వం యువత ఉజ్వల భవిష్యత్ కోసం ఏ విధమైన అవకాశాలు కల్పిస్తుందో అందరూ గమనిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోని 5 వేల ప్రభుత్వ పాఠశాలల్లో సమగ్ర ఏఐ కరికులం తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు. ఇది 20 వేల ఉపాధ్యాయులు, 5 లక్షల మంది విద్యార్థులపై ప్రభావం చూపనున్నదని తెలిపారు. ఫిన్‌లాండ్ ఏఐ ఎడ్యుకేషన్ మోడల్‌ను స్ఫూర్తిగా తీసుకుని ఈ పద్ధతిని అవలంభించబోతున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏఐ శిక్షణను ఇంగ్లిష్‌తోపాటు తెలుగులోనూ అందిస్తామని తెలిపారు.

హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న ఏఐ సిటీ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిసెర్చ్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నట్లు తెలిపారు. ఏరోస్పేస్, ఫైనాన్స్, డ్రైవింగ్ ఇండస్ట్రీలో కూడా ఏఐ ఆధారిత సేవలను ఉపయోగించుకునేందుకు సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉండటం తెలంగాణ ప్రత్యేకత అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 70 శాతం కంపెనీలు వారి ఐటీ బడ్జెట్‌లో 20 శాతానికిపైగా ఏఐ ఆధారిత డిజిటల్, ఎమర్జింగ్ టెక్నాలజీ కోసం కేటాయిస్తున్నాయని, తెలంగాణ రాష్ట్రం కూడా అదే విధానాన్ని అవలంభిస్తోందని చెప్పారు.

ప్రపంచ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేదికపై తెలంగాణ ఏర్పాటు చేసుకున్న స్థానానికి ఈ గ్లోబల్ ఏఐ సమ్మిట్ నిదర్శనమని సంతోషం వ్యక్తం చేశారు. ఈ విప్లవాత్మక ఏఐ ప్రయాణంలో తెలంగాణతో కలిసి నడిచేందుకు అకాడమియా, ఇండస్ట్రీ, స్టార్టప్స్, పాలసీ మేకర్స్‌ను ఈ సందర్భంగా ఆహ్వానించారు. దేశ, విదేశాల నుంచి వచ్చి సదస్సులో పాల్గొన్న ప్రతినిధులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.