calender_icon.png 23 September, 2024 | 4:45 PM

ఏఐ ద్వారా భవిష్యత్తుకు బలమైన పునాది : సీఎం రేవంత్ రెడ్డి

05-09-2024 03:38:13 PM

హైదరాబాద్: సరికొత్త ఆవిష్కరణలు ప్రపంచాన్ని మార్చాయని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ హెచ్ఐసీసీలో ఏఐ గ్లోబల్ సమ్మిట్ 2024కు ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ఏఐ గ్లోబల్ సమ్మిట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఏఐ అనేది నేటితరం అద్భుతం ఆవిష్కరణ అని, కొత్త ఆవిష్కరణలు ఆశలతో పాటు భయం తీసుకువస్తాయన్నారు. కొత్త ఆవిష్కరణలు ప్రజల జీవితాల్లో మార్పులు తెస్తాయని, యువతకు తమ ఉద్యోగాలు పోతాయనే బెంగ పట్టుకుంటుందని సీఎం తెలిపారు. విప్లవాత్మక మార్పులకు హైదరాబాద్ మాదిరిగా ఏ నగరం సిద్దంగా లేదని రేవంత్ రెడ్డి చెప్పుకోచ్చారు.

ఏఐ ద్వారా భవిష్యత్తుకు బలమైన పునాది వేశామని, నాస్కామ్ సహకారంతో ఏఐ ఫ్రేమ్ వర్క్ రూపకల్పన చేయడం జరిగిందన్నారు. ఆవిష్కరణలకు పారిశ్రామిక నిపుణులతో ప్రభుత్వం కలిసి పనిచేస్తోందని ఆయన తెలిపారు. అందరూ కలసికట్టుగా సరికొత్తగా భవిష్యత్తును ఆవిష్కరిద్దామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీధర్ బాబు, వివిధ దేశాలకు చెందిన సంస్థల ప్రతినిధులు, వివిధ దేశాల నుంచి సదస్సుకు 2వేల మంది ప్రతినిధులు  హాజరయ్యారు.  ఏఐ గ్లోబల్ సమ్మిట్ ఇవాళ,రేపు రెండు రోజులపాటు కొనసాగనుంది. "మేకింగ్ ఏఐ గ్లోబల్ సమ్మిట్" అనే థీమ్ తో సదస్సు నిర్వహిస్తున్నారు.కాగా,  ఏఐ గ్లోబల్ సమ్మిట్ తొలిసారిగా హైదరాబాద్ లో జరుగుతోంది.