calender_icon.png 24 October, 2024 | 3:53 PM

మూసీపై ఏఐ కన్ను!

18-09-2024 01:03:37 AM

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంపై సర్కారు దృష్టి

  1. పర్యావరణ రక్షణ, ఆర్థికాభివృద్ధికి వ్యూహాత్మక చర్యలు
  2. వ్యర్థాల నిర్వహణ, నీటి నాణ్యతపై ‘ఏఐ’తో పర్యవేక్షణ
  3. టీజీటీఎస్ ఆధ్వర్యంలో ప్రణాళికల రూపకల్పన

హైదరాబాద్, సెప్టెంబర్ 17(విజయక్రాం తి): ఒకప్పుడు హైదరాబాద్‌కు నీటి వనరుగా ఉన్న మూసీ నదికి నేడు ఆధునీకరణే శాపం గా మారింది. అభివృద్ధి పేరుతో ఆక్రమణలు, నిర్వహణ పేరుతో వ్యర్థాలు, కలుషితాల కలయిక వల్ల మూసీ రూపురేఖలే మారిపోయా యి. ఏటా వర్షాకాలంలో వరదల కారణంగా ఎంతోమంది ఇబ్బందులకు గురవుతున్నారు.

గత పదేళ్లలో పాలకులు మూసీ సుందరీకరణ, అభివృద్ధికి చర్యలు చేపడుతామని అనేక సందర్భాల్లో చెప్పినా కార్యరూపం దాల్చలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత మూసీ సుందరీకరణపై దృష్టి సారించింది. వేలాది మంది చిరు, మధ్య తరగతి వ్యాపారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు మూసీ పరివాహక ప్రాంతాన్ని ఎకనామిక్ హబ్‌గా తీర్చిదిద్దబోతున్నట్టు ప్రకటించింది. 

‘మూసీ’కి ‘ఏఐ’ ప్రణాళికలు 

మూసీ పునరుద్ధరణపై ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉన్న నేపథ్యంలో తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్(టీజీటీఎస్) ఆ దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నది. టీజీటీఎస్ ఆధ్వర్యంలో సీబీఐటీ విద్యార్థుల భాగస్వామ్యంతో మూసీ పునరుద్ధరణపై త్రీడీ నమూనాను తయారు చేయించింది. దీని ద్వారా మూసీ పునరుద్ధరణలో ఆర్టిఫిషియ ల్ ఇంటెలిజెన్స్ వినియోగాన్ని వివరించింది. మూసీ కాలుష్యానికి ప్రధాన కారణమైన వ్యర్థాలు, వాటి తొలగింపును డ్రోన్‌ల సహాయంతో పర్యవేక్షించడం ప్రధానంగా దృష్టి సారించింది. తద్వారా మూసీ నది పరివాహక ప్రాంతం ఆక్రమణకు గురికాకుండా ఉండటంతోపాటు ప్రణాళికాబద్ధంగా నిర్మాణాలు ఉండేలా చర్యలు తీసుకోవచ్చు. ఏఐ ద్వారా వరద తీవ్రతను, ప్రమాద ముప్పును పసిగట్టి, వెంటనే అప్రమత్తం చేసేందుకు వీలు ఉండేలా ప్రణాళికలను రూపొందించారు. 

పర్యాటకుల ఆకర్షణే లక్ష్యంగా ..

మూసీ పరివాహక ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణ, అభివృద్ధి చర్యలు తీసుకోవ డం ద్వారా ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించేందుకు అవకాశం ఉంది.  ఈ క్రమంలో మూసీని కూడా వాటి తరహాలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో మూసీకి ఇరువైపులా నైట్ బజార్, వ్యూపాయింట్లు, ఏఐ ఆధారిత జెనరేటర్ పార్కులు, ఓపెన్ ఎయిర్ థియేటర్, థీమ్డ్ మ్యూజియం, వాటర్ మోనుమెంట్స్, ఆర్ట్ కాన్వాస్ వాల్స్, ఫ్లోటింగ్ ప్లాట్‌ఫామ్స్ వంటివి ఏర్పాటు చేయడంపై దృష్టి సారించారు.

దీంతోపాటు స్థానికంగా ఉన్న వ్యాపారులకు ఆర్థికంగా స్వావలంబన చేకూరుతుంది. చిరు వ్యాపారులు, స్థానికులు ఆర్థికంగా బలోపేతమయ్యేందుకు ఉపయోగపడుతుంది. ఇందులో భాగంగా స్నాక్ ల్యాండ్, అండర్ వాటర్ మ్యూజియం, వాక్ ఓవర్ బ్రిడ్జి, ఫ్లోటింగ్ ఆర్ట్ గ్యాలరీ, పాత వంతెనల పునరుద్ధరణ, ఫ్లోటింగ్ రెస్టారెంట్లు, థీమ్ పార్కు ఏర్పాటు చేసే ప్రణాళికలను ఏఐ ద్వారా రూపొందించారు. 

చుంగ్ గే చున్ తరహా 

ఇటీవల దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు సియోల్ నగరంలోని చుంగ్ గేచున్ నదిని సందర్శించారు. మూసీ పునరుద్ధరణ ప్రాజెక్టును చేపట్టినందున, సియోల్‌లోని నదిని ప్రముఖ వాటర్ ఫ్రంట్‌గా ఎలా తీర్చిదిద్దారనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. గతంలో కలుషితాలతో నిండిన సుమారు 11 కిలోమీటర్ల చుంగ్ గే చున్ నదిని 2005లో పునరుద్ధరించారు.

సియోల్ నగర వాసులతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఏటా 19 కోట్ల మంది పర్యాటకులను ఈ నది ఆకర్షిస్తోంది. ఈ నది తరహాలోనే మూసీని కూడా పునరుద్ధరించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అయితే మానవ వనరుల సహాయంతో మూసీ పునరుద్ధరణకు ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. ఈ క్రమంలో టీజీటీఎస్ ఆధ్వర్యంలో రూపొందించిన ఏఐ ఆధారిత ప్రణాళికను ప్రభుత్వం వినియోగించుకుంటే మూసీ పునరుద్ధరణ వేగంగా పూర్తవుతుంది. 

‘ఏఐ’ పరిష్కార మార్గాలు 

  1. డ్రోన్‌తో వ్యర్థాల పర్యవేక్షణ, తొలగింపు
  2. నీటి నాణ్యతపై ఏఐతో సమగ్రమైన పర్యవేక్షణ
  3. ఏఐ ఆధారిత పట్టణ ప్రణాళిక
  4. ఏఐ సహాయంతో వరద ముప్పు, ప్రమాద తీవ్రత తగ్గింపు సామాజిక, పర్యావరణ ప్రణాళికలు 
  5. నైట్ బజార్
  6. వ్యూ పాయింట్ 
  7. ఏఐ జెనరేటర్ పార్కు
  8. ఓపెన్ ఎయిర్ థియేటర్
  9. థీమ్డ్ మ్యూజియం
  10. వాటర్ మోనుమెంట్స్(ఫౌంటేన్)
  11. ఆర్ట్ కాన్వస్ వాల్స్
  12. ఫ్లోటింగ్ ప్లాట్‌ఫామ్స్ ఆర్థికాభివృద్ధి ప్రణాళికలు 
  13. స్నాక్ ల్యాండ్
  14. అండర్ వాటర్ మ్యూజియం
  15. వాక్ ఓవర్ బ్రిడ్జిలు
  16. ఫ్లోటింగ్ ఆర్ట్ గ్యాలరీ
  17. పాత వంతెనల పునరుద్ధరణ
  18. ఫ్లోటింగ్ రెస్టారెంట్లు
  19. థీమ్ పార్కులు