calender_icon.png 25 October, 2024 | 1:45 AM

సాఫ్ట్‌వేర్ తరహాలోనే భారత్ నుంచి ఏఐ ఎగుమతులు

24-10-2024 11:44:59 PM

ఎన్విడియా సీఈఓ అంచనా

ముంబయి: కంప్యూటర్ రంగంలో ప్రపంచానికి సుపరిచితమైన భారత్.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలోనూ సత్తా చాటబోతోందని ఎన్విడియా వ్యవస్థాపకుడు, సీఈఓ జెన్సన్ హువాంగ్ అన్నారు. భవిష్యత్లో ప్రభావవంతమైన ఏఐ సొల్యూషన్స్‌ను ప్రపంచానికి ఎగుమతి చేయబో తోందని చెప్పారు.

ఈమేరకు ముంబయిలో నిర్వహించిన ఎన్విడియా ఏఐ సమ్మిట్లో ఆయన మాట్లాడారు. భారత్‌లో తమ ఎకోసిస్టమ్ విస్తరణకు కట్టుబడి ఉన్నామని చెప్పారు.కంప్యూటర్ రంగంలో ప్రపంచానికి భారత్ చాలా సుపరిచితమని, ప్రస్తుతం  సాఫ్ట్‌వేర్ ఎగుమతులకు హబ్‌గా ఉందని కొనియాడారు. భవిష్యత్‌లో  ఏఐ ఎగుమతుల్లోనూ లీడర్‌గా మారనుందని పేర్కొన్నారు.

సాఫ్ట్‌వేర్ తరహాలోనే ఏఐని భారత్ ప్రపంచదేశాలకు ఎగుమతి చేయనుందన్నారు.  సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులకు అడ్డాగా ఉన్న భారత్.. ఏఐ అభివృద్ధి, సరఫరాలో పవర్‌హౌస్‌గా మారనుందని చెప్పారు. భవిష్యత్‌లో ప్రతివ్యక్తికీ ఓ ఏఐ కో-పైలట్లు ఉండబోతు న్నాయని చెప్పారు.

ఏఐ వల్ల ఉద్యోగాలు హరించుకుపోతాయన్న ఆందోళనల పైనా హువాంగ్ స్పందించారు. ఏఐ పూర్తిగా ఉద్యోగాలు తుడిచిపెట్టబోదని, దాని స్వరూపాన్ని మారుస్తుందని పేర్కొన్నారు. వ్యక్తి కంటే ఏఐ మెరుగ్గా పనిచేయగలదని భావించినప్పుడు మాత్రమే ఆ ఉద్యోగం పోతుందని చెప్పారు.

రిలయన్స్‌తో భాగస్వామ్యం

భారత్‌లో  ఏఐ మౌలిక సదుపాయాల కల్పనకు రిలయన్స్తో ఎన్విడి యా భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నట్లు ఆ కంపెనీ సీఈఓ హువాంగ్ ప్రకటించారు. సమ్మిట్లో భాగంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీతో భేటీ అయిన సందర్భంగా ఈవిషయాన్ని ప్రకటించారు. ఈ భాగస్వామ్యం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. అమెరికా, చైనా తర్వాత పెద్ద డిజిటల్ కనెక్టివిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ భారత్ కలిగిఉందని ముకేశ్ పేర్కొన్నారు.