- నాలుగు నెలల్లో సిద్ధం
- అన్నిరకాల పెట్టుబడులకు హైదరాబాద్ అనుకూలం
- ఐదేళ్లలో 20 శాతం ఐటీ ఎగుమతులే లక్ష్యం
- ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
హైదరాబాద్, నవంబర్ 12 (విజయక్రాంతి) : తెలంగాణలో నాలుగు నెలల్లో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంలో ఆర్టిఫిషియల్ సిటీ(ఏఐ సిటీ)ని నిర్మిస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రకటించారు. అన్నిరకాల పెట్టుబడులకు హైదరాబాద్ నగ రం అనుకూలమని ఆయన స్పష్టం చేశారు.
మంగళవారం హైదరాబాద్‌లో గ్లోబల్ లాజిక్ సాఫ్ట్‌వేర్ కంపెనీ నూతన కార్యాలయాన్ని మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... డిజిటల్ ఇన్నోవేషన్‌లో తెలంగాణ గ్లోబల్ లీడర్ నిలుస్తుందనడానికి హైదరాబాద్‌లో గ్లోబల్ లాజిక్ కంపెనీ ఏర్పాటే నిదర్శమన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఏఐ రంగం భారీ పురోభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు.
తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చేవారికి ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలను అందిస్తుందని వెల్లడించారు. అంతర్జాతీ య కంపెనీలతోపాటు స్మూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు కూడా తగిన ప్రోత్సాహం అందిస్తున్నామని వివరించారు. ప్రపంచస్థాయి డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, నైపుణ్యమున్న 2.5 లక్షల మంది గ్రాడ్యుయేట్లను ఆయా కంపెనీలకు తెలంగాణ అందిస్తుందని తెలిపారు.
గ్లోబల్ లాజిక్ నూతన కార్యాలయం ఏర్పాటుతో ఉపాధి కల్పనతోపాటు ప్రభావవంతమైన రంగాల్లో తెలంగాణ నాయకత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు దోహదపడుతుందని ఆకాంక్షించారు. తద్వారా ఆవిష్క రణల్లో అగ్రగామిగా ఉన్న తెలంగాణ స్థానాన్ని పటిష్టం చేస్తుందన్నారు. పెరుగుతున్న కార్యకలాపాలకు అనుగుణంగా కొత్త నియామ కాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో కూడా ఐటీ కంపెనీలు ఏర్పాటు చేసి, యువతకు ఉపాధి కల్పిస్తున్నామని తెలియజేశారు. ప్రస్తుతం ఐటీ ఎగుమతులు 12 శాతంగా ఉన్నాయని, వాటిని వచ్చే ఐదేళ్లలో 20 శాతానికి చేర్చడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు. మలేషియాలో స్థిరపడిన తెలుగు పారిశ్రామికవేత్తలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నారని పేర్కొన్నారు. ఏఐ అభివృద్ధికి సహకరిస్తామన్నారు.