calender_icon.png 10 October, 2024 | 1:58 AM

ఏఐ బూస్ట్.. ఐటీ షేర్ల దూకుడు

29-08-2024 12:00:00 AM

ఆల్‌టైమ్ గరిష్ఠానికి నిఫ్టీ

ముంబై, ఆగస్టు 28: యూఎస్ ఫెడరల్ రిజర్వ్ త్వరలో వడ్డీ రేట్లు తగ్గించే అవకాశంతో పాటు ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ మార్కెట్‌ను అందిపుచ్చుకునే ఛాన్స్ ఉండటంతో బుధవారం ఐటీ షేర్లు భారీ ర్యాలీ జరిపాయి. ఏఐ రీసెర్చ్‌పై యూఎస్ వర్సిటీతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఇన్ఫోసిస్ చేసిన ప్రకటనతో ఈ రంగం షేర్ల కొనుగోళ్లకు ఇన్వెస్టర్లు మొగ్గుచూపడంతో స్టాక్ సూచీలు లాభపడ్డాయి. 

ఇంట్రాడేలో 327 పాయింట్లు పెరిగి బీఎస్‌ఈ సెన్సెక్స్ 82,039 పాయింట్ల గరిష్ఠ స్థాయికి చేరింది. చివరకు  74 పాయింట్లు లాభంతో 81,785 పాయింట్ల వద్ద  ముగిసింది. ఈ సూచీ పెరగడం వరుసగా ఇది ఏడో రోజు.  ఇదేబాటలో వరుసగా పదో రోజూ అప్‌ట్రెండ్ సాగించిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఇంట్రాడేలో 111 పాయింట్లు జంప్‌చేసి ఆల్‌టైమ్ గరిష్ఠస్థాయి 25,129 పాయింట్ల వద్దకు చేరింది. తుదకు 34 పాయింట్లు లాభపడి  25,052 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ స్థాయిలో నిఫ్టీ ముగియడం కూడా ఇదే ప్రధమం. 

పాజిటివ్ సెంటిమెంట్

గ్లోబల్ క్రూడాయిల్ ధరలు తగ్గడం, విదే శీ ఇన్వెస్టర్ల నిధులు మార్కెట్లోకి తరలిరావడం సెంటిమెంట్‌కు ఊతమిచ్చిందని ట్రేడ ర్లు తెలిపారు.  ప్రపంచ మార్కెట్లో బ్యారల్ బ్రెంట్ క్రూడ్ ధర 2  శాతం తగ్గి  78.7 డాల ర్ల వద్దకు దిగింది. అయితే మార్కెట్ విలువ అధికస్థాయిలో ఉండటం, ఈ వారాంతంలో భారత్ క్యూ1 జీడీపీ గణాంకాలు వెల్లడికానుండటంతో సురక్షిత షేర్లుగా భావిస్తున్న ఐటీ, హెల్త్‌కేర్ స్టాక్స్‌పై మొగ్గు చూపారని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్‌నాయర్ చెప్పారు. ఐటీ ఇండెక్స్ లాభపడటం వరుసగా ఇది మూడోరోజని, త్వరలో యూఎస్, భారత్ జీడీపీ డేటా వెల్లడికానుండటం, గురువారం డెరివేటివ్ కాం ట్రాక్టుల ముగింపు కారణంగా వొలటాలిటీ ఇండెక్స్ పెరిగిందని ప్రభుదాస్ లీలాధర్ అడ్వయిజరీ హెడ్ విక్రమ్ కాసత్ తెలిపారు. 

రికార్డుస్థాయికి ఇన్ఫీ, ఎయిర్‌టెల్

సెన్సెక్స్ బాస్కెట్‌లో ఇన్ఫోసిస్, భారతి ఎయిర్‌టెల్‌లు 3 శాతం మేర పెరిగి కొత్త రికార్డుస్థాయిలకు చేరాయి. ఇండస్‌ఇండ్ బ్యాంక్, సన్ ఫార్మా, టెక్ మహీంద్రా, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫిన్‌సర్వ్, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్‌లు లాభపడ్డా యి. మరోవైపు ఏషియన్ పెయింట్స్, మారుతి, నెస్లే, కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్‌లు  2 శాతం వరకూ నష్టపోయాయి.

వివిధ రంగాల సూచీల్లో అన్నింటికంటే అధికంగా టెక్నాలజీ ఇండెక్స్ 1.31 శాతం పెరగ్గా, ఐటీ ఇండెక్స్ 1.24 శాతం ఎగిసింది. హెల్త్‌కేర్ ఇండెక్స్ 0.91 శాతం, టెలికమ్యూనికేషన్స్ ఇండెక్స్ 0.48 శాతం చొప్పున పెరిగాయి. ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్ 0.68 శాతం, హెల్త్‌కేర్ ఇండెక్స్ 0.44 శాతం చొప్పున పెరిగాయి.యుటిలిటీస్, కమోడిటీ, క్యాపిటల్ గూడ్స్, బ్యాంకెక్స్‌లు తగ్గాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.04 శాతం పెరగ్గా, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.12 శాతం తగ్గింది.